మిహిరా మాధవం : భాగం-5

గురువారం-21 ఏప్రియల్ ,2011

“ఏమిటిది మాధవ్ ? వదలమంటుంటే..ఏంటిది,సిగ్గు లేకుండా?”

“చాతనైతే విడిపించుకో,ఎవరు వద్దన్నారు?”

“నిన్నూ..ఇలా కాదు” చెయ్యి కొరికేసి తప్పించుకుంది మిహిర.

“ఎక్కడికి వెళ్తావ్ నన్ను తప్పించుకుని? ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ నా దగ్గరికే వస్తావ్! భూమి గుండ్రంగా ఉంటుంది మిహిరా,ప్రేమ కూడా..” చిరు నవ్వు నవ్వాడు.

*                    *                       *                         *                        *         

 

పడుతూ లేస్తూ టెలిస్కోప్ లో దేన్నో చూద్దామని తాపత్రయపడుతోంది మిహిర.

ఉదయాన్నే ఈ ఫీట్లు చూసి మిహిర తల మీద ఒక మొట్టికాయ వేసాడు మాధవ్,”ఏం జరుగుతోందిక్కడ?”

“కనిపించట్లేదూ,టెలిస్కోప్ లోంచి చూస్తున్నాను.డిస్టర్బ్ చెయ్యకూ.”

“నాతో ఫైటింగ్ చెయ్యకపోతే ఒక్క నిమిషం కూడా తోచదా నీకూ? ఐనా ఇంత పొద్దున్నే టెలిస్కోపులో కనిపించిన ఆ యాంటిక్ పీస్ ఏమిటో?” అడిగాడు.

“యాంటిక్ పీస్ కాదు,పాదరసం పీస్” రెట్టించింది మిహిర.

“ఊహూ..ఐ సీ! అడ్డుగా నిలబడి నువ్వొక్కదానివే ఎంత సేపు చూస్తావ్,జరుగు-నేను చూడొద్దా?” మిహిరని సుతారంగా పక్కకి నెట్టేసి టెలిస్కోప్ దగ్గర సెటిల్ అయ్యాడు.

“ఓయ్..ఎందుకలా తోసేస్తున్నావ్? టెలిస్కోప్ కావాలని అడుగుతే నేనే ఇచ్చేదాన్ని కదా!”

“మాధవ్ తనక్కావాల్సింది సొంతగా తీసుకుంటాడు,అడిగి తీసుకోడు.నువ్వేమిటి ఇచ్చేది?వెళ్ళవమ్మా..వెళ్ళూ!”

“ఓయబ్బో..కొయ్యి కొయ్యి 100 లారీల సొరకాయలు,పోజులకేం తక్కువ లేదు” రుస రుసలాడుతూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది మిహిర.

“ఉడుకుమోతు అమ్మాయి” టెలిస్కోప్ లోంచి పరిశీలనగా చూస్తూ అన్నాడు,”మెర్క్యురీ లానే!”

బుధుడు (మెర్క్యురీ)

బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం.

ఇది టెర్రెస్ట్రియల్ గ్రహాల కోవలోకి చెందుతుంది.అంటే భూమి వంటి నిర్మాణం కలిగి ఉంటుందనమాట.బుధుడి కేంద్రకంలో ద్రవీభవించిన ఇనుము (భూకేంద్రకంలో కూడా ద్రవీభవించిన ఇనుము) ఉండటాన్ని మనం గమనించవచ్చు.

ఐతే భూమి మీద ఉన్న టెలిస్కోపుల ద్వారా బుధుణ్ణి చూడటం అంత సులువైన విషయం కాదు ఎందుచేతనంటే ఇది సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల,పరిమాణంలో భూమికంటే చిన్నదవడం వల్లా సూర్య కాంతి ముందు బుధుడి కాంతి వెల వెలా పోతుంది! అందుచేత  బుధుణ్ణి మామూలుగా పగటి పూట చూడలేం(ఒకవేళ సూర్యుని కిరణాలు పరావర్తనం చెంది బుధుణ్ణి ఆ కాంతిలో వీక్షించగలిగినప్పుడు మాత్రమే).

సాధారణంగా బుధుణ్ణి ఉదయతార గానూ(సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందు),సాయంతార గానూ(సూర్యాస్తమయ సమయానికి కొన్ని నిమిషాల తరువాత) చూడవచ్చు.

ఐతే చంద్రుణ్ణి చూసినంత సుళువుగా మనం బుధుణ్ణి గమనించలేము.ఇప్పటి వరకూ ఉన్న బుధుడి చిత్రాలు 1970 దశకంలో ప్రయోగించబడ్డ మారినర్-10 వ్యోమ నౌక తీసినవే కావడం గమనార్హం.ఐతే 2011 సంవత్సరంలో మెసెంజర్ వ్యోమ నౌక బుధుడి ఉపరితలాన్ని 80% వరకూ ఛాయా చిత్రాల రూపంలో చూపించింది.ఇంతవరకూ మనం చూడని బుధుడి రెండవ వైపు చిత్రాలను కూడా మెసెంజర్ నౌక సేకరించడం గమనించ దగ్గ విషయం.

బుధుడు 4880 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాడు (సుమారుగా 1/3 భూవ్యాసంతో సమానం).

బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 4500c వరకూ సమీపిస్తాయి.

ఆ వేడికి ఎలాంటి వస్తువైనా క్షణాల్లో బూడిదైపోవాల్సిందే!

సూర్యుడి ధాటికి బుధుడిలోని వాయువులన్నీ ఇగిరిపోవడం వల్ల,అక్కడ  ఎలాంటి నీటి జాడలు లేకపోవడం వల్లా,బుధోపరితలం పొడిగా సిలికేట్ల రూపంలో ఉంటుంది.

భూమిని ఆవరించి ఉన్న వాతావరణం లాగా బుధుడి మీద అసలు వాతావరణమే ఉండదు.అందువల్ల రాత్రి పూట ఉష్ణోగ్రత ఒక్కసారిగా -170 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకూ పడిపోతుంది.అంటే చలికే వణుకు తెప్పించేంత చల్లదనం అనమాట!

బుధుడి ద్రవ్య రాశి 3.30 x 10 23.  ద్రవ్యరాశి ప్రకారం చూస్తే 20 బుధ గ్రహాల్ని మన భూగోళంలో పట్టించవచ్చు.

బుధ మధ్య రేఖ(భూమధ్య రేఖ లాగే బుధుడి మీద అక్షాంశాలూ,రేఖాంశాలూ గుర్తిస్తే) దగ్గర నిలబడి నిటారుగా చూసినప్పుడు సూర్యుడు భూమి మీదకన్నా మూడు రెట్లు పెద్దగా కనిపిస్తాడు.

బుధుడి మీద ఒక రోజు భూమి మీద 58 రోజుల 16 గంటలతో సమానం.అలాగే బుధుడి మీద ఒక సంవత్సరం 88 రోజులు.

సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకీ అతి వేగంగా పరిభ్రమించే గ్రహంగా బుధుణ్ణి చెప్పుకోవచ్చు.

మొదట బుధుడు కూడా చంద్రుడిలాగే తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడో,అంతే సమయం సూర్యుడి చుట్టూ తిరగడానికి తీసుకుంటాడని భావించేవారు (58 రోజులు).

అంటే చంద్రుణ్ణి ఎప్పుడూ మనం ఒకే వైపు చూస్తాం,రెండో భాగం చూడలేం.అలాగే బుధుడు కూడా! అని శాస్త్రవేత్తలు భావించారు.కానీ మెసెంజర్ వ్యోమనౌక తీసిన చిత్రాల ద్వారా అది తప్పని ఋజువయింది.

బుధుడి మీద సూర్యోదయం,సూర్యాస్తమయం కూడా చిత్రంగా ఉంటాయి.

సూర్యోదయ సమయంలో సూర్యుడు మొదట కొద్దిగా ఉదయించి తరువాత మళ్ళీ అస్తమించి కాసేపటి తరువాత తిరిగి ఉదయిస్తాడు.అలాగే అస్తమించేప్పుడు ముందు కొద్దిగా అస్తమించి తరువాత కాసేపు మళ్ళీ ఉదయించి తరువాత అస్తమిస్తాడు.బుధుడు తన అక్షానికి 0.206 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల  ఇలా జరుగుతుంది.

చంద్రుడికీ,బుధుడికీ మధ్య ఎన్నో సామ్యాలున్నాయి.రెండిటి ఉపరితలాలూ సిలికేట్ల రూపంలోనే ఉన్నాయి.పరిమాణంలో కూడా దాదాపుగా కొద్ది తేడాలతో ఒకేలా ఉంటాయి.చంద్రుడి మీద లాగే బుధుడి మీద కూడా ఉల్కాశకలాల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

40 కోట్ల సంవత్సరాల క్రితం బుధుణ్ణి మీద ఒక ఉల్కా శకలం తాకడం కారణంగా ఏర్పడ్డ “కెలొరిస్ బేసిన్” వ్యాసం 1550 కిలోమీటర్లు ఉంటుంది.ఇదే బుధుడి మీద ఉల్కా శకలం తాకిడి వల్ల ఏర్పడ్ద అతి పెద్ద బిలం.

మెసెంజర్ వ్యోమ నౌక కెలోరిస్ బేసిన్ యొక్క అట్టడుగు భాగాన్ని తీసిన ఛాయా చిత్రాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.ఈ భాగం సాలీడు ఆకారంలో ఉండటాన్ని మనం గమనించవచ్చు.దీనికి శాస్త్రవేత్తలు “ద స్పైడర్” అని పేరు పెట్టారు.

ఇక బుధుడి గురించిన అతి పెద్ద విచిత్రం ఏమిటంటే  బుధుడి కక్ష్య మిగతా అన్ని గ్రహాల కక్ష్యల్లా కాకుండా తన చుట్టూ తాను శతాబ్దానికి 55  నిమిషాల చొప్పున  తిరుగుతూ  సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది.

భూమధ్య రేఖ,భూ కక్ష్యకు 0.01396డిగ్రీల కోణంలో ఉంటుంది.భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో అదే విధంగా భూకక్ష్య కూడా కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది.భూమధ్యరేఖ కక్ష్య ప్రతి 26 వేల సంవత్సరాలకి ఒక సారి సూర్యుణ్ణి చుట్టి వస్తుంది.

ఈ కక్ష్యా పరిభ్రమణం బుధుడికి కూడా వర్తింపజేస్తే (బుధ కక్ష్య కూడా భూకక్ష్య లాగా స్థిర కక్ష్య అనుకుంటే) బుధుడి కక్ష్య కూడా 26 వేల సంవత్సరాలకి ఒక సారి సూర్యుణ్ణి చుట్టి రావాలి.

ఈ 0.01396 డిగ్రీలని ఆర్క్ సెకన్ల కింద విభజిస్తే 5025 ఆర్క్ సెకన్ల కాలం అవుతుంది.కానీ విచిత్రంగా బుధుడి కక్ష్యా పరిభ్రమణ కాలం 5600 ఆర్క్ సెకన్లుగా గుర్తిచడం జరిగింది.

అంటే బుధుడి కక్ష్య స్థిరంగా లేదనమాట!

 

న్యూటన్ సిద్ధాంతాల్ని అనుసరించి సౌరకుటుంబంలోని గ్రహ కక్ష్యలన్నీ స్థిరమైనవి.అలాగే కెప్లర్ సిద్ధాంతాల ప్రకారం బుధుడి పరిభ్రమణం జరగడం లేదు! ఆ కాలం లోని కెప్లర్ సిద్ధాంతాలు న్యూటన్ గమన నియమాల మీద ఆధారపడి సూత్రీకరించబడ్డాయి.

ఈ సమస్యని న్యూటన్ గమన నియమాలేవీ వివరించలేకపోయాయి.తరువాత 1909 లో ఐన్ స్టీన్ రాసిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ద్వారా ఈ సమస్య దాదాపుగా పరిష్కరింపబడింది.(ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం – జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ).

ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం మనకి తెలిసిందే.విశ్వం వంపు తిరిగి ఉన్న కారణంగా ఆ వంపులోకి ప్రవేశించిన కాంతి కూడా వంపు తిరిగి ప్రయాణిస్తుంది.

విశ్వంలో ఈ వంపు గురుత్వాకర్షణ కారణంగా కలుగుతుంది.

అంటే శూన్యంలో ఒక ద్రవ్య రాశి కలిగిన వస్తువు తన చుట్టూ ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని అది వంపు తిరిగేలా చేస్తుంది.ద్రవ్య రాశి ఉన్న వస్తువులన్నిటికీ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని మనకి తెలుసు కదా!

దీని ప్రకారం బుధుడికి కూడా గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టు అర్థమవుతుంది.ఐతే ఈ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో 0.38 శాతం మాత్రమే(ఎందుకంటే బుధుడు భూమి పరిమాణంలో కేవలం 1/3 వంతు మాత్రమే అని పైన చెప్పుకున్నాం.)

లాగ్రేంజ్,లాప్లేస్ నియమాలు తరువాతి కాలంలో కొంత ఆధునిక పద్ధతుల ద్వారా ఈ సమస్యని పరిష్కరించడానికి దోహదపడ్డాయి.ఐతే ఈ రెండు సిద్ధాంతాలనూ సైద్ధాంతికంగా ప్రయత్నించిన తరువాత 532 ఆర్క్ సెకండుల కాలాన్ని మాత్రమే ఇంతకు ముందున్న 5025 ఆర్క్ సెకన్ల కాలానికి జోడించగలిగారు.

అంటే బుధుడి కక్ష్యా పరిభ్రమణం 5025+532 = 5557 ఆర్క్ సెకండ్లు.

ఐతే ప్రయోగపూర్వకంగా కనుగొన్న 5600 ఆర్క్ సెకండుల కాలానికి ఇంకా 43 ఆర్క్ సెకండులు తక్కువ అవుతున్నాయి. సిద్ధాంతాల పరంగా కనుగొన్న దానికీ,వాస్తవ విలువకీ భేదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

ఇలాంటి సమస్యే యురేనస్ విషయంలో ఏర్పడినప్పుడు ఆ చుట్టు పక్కల ఉన్న మరొక గ్రహం కారణంగా యురేనస్ కక్ష్యా పరిభ్రమణంలో మార్పులు ఊహించి శాస్త్రవేత్తలు ప్లూటో గ్రహాన్ని కనుక్కోగలిగారు.అలాగే బుధుడి విషయంలోనూ వల్కన్ అనే మరొక గ్రహం సూర్యుడికీ,బుధుడికీ మధ్యగా ఉందని శాస్త్రజ్ఞులు వేసిన అంచనాలు తలకిందులైపోయాయి.అలాంటి గ్రహమేదీ లేదని స్పష్టంగా ఋజువైంది.

సౌరకుటుంబంలోని ద్రవ్యరాశిలో 99% సూర్యుడిలోనే నిక్షిప్తమై ఉందని మనకి తెలుసు కదా! అందువల్ల సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి చాలా బలమైనది.

బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా 4 కోట్ల 70 లక్షల కిలోమీటర్ల దూరంలోనూ,దూరంగా ఉన్నప్పుడు 7 కోట్ల కిలోమీటర్ల దూరంలోనూ పరిభ్రమిస్తూ ఉంటాడు.ఐతే బుధుడి కక్ష్య సూర్యుడి గురుత్వాకర్షణ కారణంగా వంపు తిరిగిన స్థల-కాలాల్లో ఉండటం వల్ల ఈ 43 సెకన్ల కక్ష్యా భ్రమణం జరుగుతోందని ఐన్ స్టీన్ సిద్ధాంతం సూత్రీకరించింది.

ప్రస్తుతం ఉన్న అన్ని సిద్ధాంతాల్లోనూ ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం చాలా సమస్యలకి సరైన సమాధానాలు సూచించిన కారణంగా ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుతానికి ఎవరూ ప్రశ్నించే ప్రయత్నం చేయలేకపోతున్నారు.

ఇతర సిద్ధాంతాలు కొన్ని సూర్యుడు బల్లపరుపుగా ఉన్నాడని సూత్రీకరిస్తున్నాయి.దాని వల్లే ఈ 43 సెకన్ల తేడా కలుగుతోందని అవి నిర్ధారించలేకపోవడం వల్ల ఈ సిద్ధాంతాల్ని బలహీనమైన సిద్ధాంతాలుగా పరిగణించడం జరుగుతోంది.

ఈ 43 సెకన్ల మిస్టరీని ప్రయోగ పూర్వకంగా ఇంతవరకూ శాస్త్రజ్ఞులు ఛేదించలేకపోయారు.

ఇన్ని వింతలూ విశేషాలతో కూడుకున్న బుధగ్రహానికి మరో వింత కూడా ఉంది! అదే బుధాయణం లేక బుధుని ట్రాన్సిట్.

బుధాయణం (బుధుని ట్రాన్సిట్)

బుధుడు సూర్యుడికీ,భూమికీ మధ్య ఉన్నప్పుడు మాత్రమే మనం బుధాయణాన్ని చూడగలం.

ఈ ప్రక్రియలో బుధుడు సూర్యబింబం మీద ఒక చివరి నించి మరొక చివరికి (ఎడమ నించి కుడికి లేదా పై నించి కిందికి) నల్లని చుక్క వలె తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

అంగారకుడు,బృహస్పతి,శని లాంటి మిగతా గ్రహాల నించి చూసినప్పుడు శుక్రుడు,భూమి కూడా ఇలాంటి ప్రక్రియని కనబరుస్తాయి.

భూమి నించి బుధుణ్ణి,శుక్రుణ్ణి వీక్షించడం వీలు పడుతుంది కాబట్టి బుధాయణాన్ని భూమి మీద ఉండే వారు గమనించవచ్చు.

బుధుడు మన సౌరకుటుంబంలోనే అత్యంత వేగంగా పరిభ్రమించే గ్రహం అని చెప్పుకున్నాం కదా! అందువల్ల ఒక శతాబ్ద కాలంలో బుధుడు 12 నించి 13 సార్లు తన బుధాయణాన్ని పూర్తి చేస్తాడు.శతాబ్ద కాలంలో మరే ఇతర గ్రహాల ట్రాన్సిట్ల కన్నా ఇదే ఎక్కువ.

———————————————————————————

మూడో రోజు సౌరయాన్-1 ప్రయాణం సజావుగానే జరిగింది.

దశల వారీగా నాలుగో రోజు చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెడుతుంది సౌరయాన్.చంద్రుడి ఆకర్షణ పరిధికి లోబడి ఒక సారి చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తిన్నగా చంద్రుడి మీద దిగుతుంది.

గ్రౌండ్ కంట్రోల్ దగ్గర అనుకున్న ప్రకారం నాలుగో రోజు ఉదయం కల్పనా క్యాప్స్యూల్ నియంత్రణ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు మాధవ్.

మూడు గంటల్లో సౌరయాన్-1 చంద్రుడి కక్ష్య చేరుతుందనగా..

అప్పుడు జరిగిందొక ప్రమాదకర సంఘటన.

*                    *                       *                        *                         *

ఆస్టరాయిడ్ బెల్ట్ లోంచి భూమి మీదకి దూసుకుని రాబోతున్న ఒక ఉల్కా శకలం గతి తప్పి చంద్రుడి వైపుకి దూసుకు రాసాగింది.

కల్పనా క్యాప్స్యూల్ మానిటర్ నించి చంద్రుడి కక్ష్యని పరిశీలిస్తున్న మాధవ్ చప్పున అలర్ట్ అయాడు.

ISRO గ్రౌండ్ కంట్రోల్  ని సంప్రదించాడు.

“గామా..గామా..రెడ్ అలర్ట్..దిస్ ఈజ్ మాధవ్ కమింగ్ ఇన్..ఓవర్”

“వాట్ హ్యాపెన్డ్ మై బాయ్?” ఇస్రో ఛైర్మన్ అడుగుతున్నారు.

“యన్ ఆస్టరాయిడ్ ఈజ్ అప్రోచింగ్ ద మూన్ సర్,కొలిజన్ ఈజ్ లైక్లీ టూ హ్యాపెన్.ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సౌరయాన్ అండ్ కల్పనా క్యాప్స్యూల్ విల్ గెట్ సివియర్లీ డామేజ్డ్.కుడ్ యూ ప్లీజ్ చెక్ ద పొజిషన్ కో-ఆర్డినేట్స్? ఐ వుడ్ గెట్ ద స్పేస్ షిప్ బ్యాక్ టూ ఐ.యస్.యస్.వీ హ్యావ్ 3 అవర్స్ ఆఫ్ టైమ్ రిమెయినింగ్. అట్లీస్ట్ ఐ కెన్ అవాయిడ్ ద కొలిజన్ డ్యామేజ్ టూ 3/4th ఎక్స్టెంట్.”

“ష్యూర్ మై బోయ్!వాట్ ఎవర్ ఈజ్ ద పాజిబుల్ సొల్యూషన్,ప్లీజ్ గో విత్ ఇట్.ఐ నో దట్ యూ కెన్ హ్యాండిల్ సచ్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్.గో ఎహెడ్! వీ విల్ మానిటర్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఆస్టరాయిడ్.విల్ అప్ డేట్ యూ షార్ట్ లీ.”

“కమాన్ గైస్,వీ హ్యావ్ యన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్.ఇమ్మీడియెట్లీ నీడ్ టూ మ్యాప్ ద డేటా ఫర్ యాన్ ఆస్టరాయిడ్.ఇట్స్ అప్రోచింగ్ మూన్.ఫాస్ట్,ఫాస్ట్! రేంజ్ ద ఇంపాక్ట్ ఏరియా అండ్ కొలిజన్ ఎఫెక్ట్..”

మరో పక్క గ్రౌండ్ కంట్రోల్ లోని తోటి శాస్త్రవేత్తలకి ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ ఉల్కా శకలం ప్రస్తుతం యే వైపుగా ఎంత వేగంతో కదులుతున్నదీ లెక్క కట్టమని పురమాయించారు.

“సర్,కొలిజన్ ఇంపాక్ట్ ఈజ్ వెరీ హై.దిస్ ఆస్టరాయిడ్ వజ్ లైక్ లీ టూ హిట్ ద ఎర్త్ బట్ హ్యాజ్ ఛేంజ్డ్ ఇట్స్ డైరెక్షన్ అండ్ హెడింగ్ టువర్డ్స్ ద మూన్. ఐ థింక్ 3 అవర్స్ విల్ బీ ద సఫిషియెంట్ టైమ్మ్ ఇఫ్ ద సౌరయాన్ ట్రావెల్స్ ఔట్ వార్డ్స్ ఇన్ నార్తర్న్ డైరెక్షన్ అరౌండ్ ద పోలార్ యాక్సిస్ ఆఫ్ ద మూన్.సౌరయాన్ నీడ్ టూ పికప్ ఎ స్పీడ్ ఆఫ్ 250-300 కిలోమీటర్స్ యన్ అవర్ టూ ఎస్కేప్ ద కొలిజన్ ఇంపాక్ట్.ఇంపాక్ట్ ఈజ్ లైక్లీ టూ స్ప్రెడ్ ఓవర్ 500 కిలోమీటర్స్ ఫ్రమ్ ద యాక్చువల్ ఇంపాక్ట్ సైట్!”

“ఓహ్..దట్ ఈజ్ హైలీ డిఫికల్ట్ సిట్యుయేషన్” తల పంకిస్తూ అన్నారు ఇస్రో చైర్మన్.

బీటా..బీటా..గ్రౌండ్ కంట్రోల్..సిగ్నల్ కమింగ్ ఇన్..

కల్పనా క్యాప్స్యూల్ లోని మానిటర్ బీప్ మనే శబ్దం చేస్తూ మోగింది.

“మాధవ్..ఉల్కా శకలం ఢీకొట్టాక ఆ చుట్టు పక్కల 500 కిలోమీటర్ల వరకూ ఇంపాక్ట్ ఉంటుందని మన వాళ్ళు అంచనా వేసారు మై బోయ్! సౌరయాన్ ని గంటకి 250-300 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉత్తర ధృవ కక్ష్య నించి బైటి వైపుగా తిప్పాల్సుంటుంది.నువ్వు చెయ్యగలవా ఈ సాహసం?”

“సౌర పవనం అనుకూలిస్తే చెయ్యగలననుకుంటాను” – చెప్పాడు అంత ప్రమాదకరస్థితిలోనూ తన ధైర్యాన్ని కోల్పోని మాధవ్.

“యే మాత్రం తేడా జరిగినా మీ ప్రాణాలకే ప్రమాదం!”

“తెలుసు సర్- ఇంపాక్ట్ వల్ల కూడా ప్రమాదమే కదా!!”

——————————————–

సౌరపవనం వీస్తున్న మార్గాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నించాడు మాధవ్.

ప్రయత్నిస్తే 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం సాధ్యమే.కానీ 3 గంటల పాటు సౌరపవనం ఆగకుండా వీస్తేనే తాము ఇంపాక్ట్ సైట్ నించి 750 కిలోమీటర్ల దూరం వెళ్ళడం వీలు పడుతుంది.అలా జరిగితే గానీ ఆ విస్ఫోటం నించి  తప్పించుకోవడం సాధ్యం కాదు.

“లేదంటే సౌరయాన్ తో పాటు మేమిద్దరం కూడా…” ఒక్క నిట్టూర్పు విడిచాడు మాధవ్.

“మానవ ప్రయత్నం చెయ్యాలి-ఫలితం దైవానికి వదిలివెయ్యాలి” భగవద్గీతా సారం గుర్తించాడు.

“ఏమంటావు మిహిరా? ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా?”

పెల్లుబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ మాధవ్ ని గట్టిగా కౌగిలించుకుంది మిహిర.

“ఊ..ఇప్పుడు నేను అన్నిటికీ సిద్ధపడ్డాను” భారంగా వస్తున్నాయి మిహిర మాటలు.

“పిచ్చి పిల్లా..ఎందుకేడుస్తున్నావు? ప్రమాదాలు ఎక్కడైనా ఉంటాయి.ధైర్యవంతులు ఏడవరు.సాధించి చూపిస్తారు!!” ఓదార్చాడు.

“ఐ యామ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్” బాధని దిగమింగుతూ చెప్పింది.

***************************************************

కల్పనా క్యాప్స్యూల్ లోని మిషన్ కంట్రోల్ బోర్డ్ సహాయంతో సౌరయాన్ వేగం గంటకి 250 కిలోమీటర్లు చేరుకునేలా చెయ్యగలిగాడు మాధవ్.

సౌరపవనం అంత అనుకూలంగా లేదు,మరీ అంత ప్రతికూలంగా కూడా లేదు.మధ్యస్థంగా సౌరయాన్ దిశ మార్చడానికి సహాయ పడుతున్నట్టుగా ఉంది.కానీ మూడు గంటల పాటు అది సహకరిస్తుందో లేదో అంచనా వెయ్యడం మాధవ్ కి కొద్దిగా కష్టంగానే ఉంది.

ఏదేమైనా ఈ అపాయం నించి తప్పించుకునే ఉపాయం వెతికి తీరాలి కాబట్టి సౌరయాన్ దిశని చంద్రుడి ధృవ కక్ష్యకి ఉత్తరంగా సరి చేసాడు మాధవ్.

వింటిని సారించి వదిలిన బాణంలా రివ్వున ముందుకి దూసుకుపోయింది సౌరయాన్.

ఉల్కా శకలం గంటకి 1500 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు దూసుకొస్తూంది.

అది ప్రయాణిస్తున్న మార్గం యే కొద్దిగా మళ్ళినా సౌరయాన్ కి ముప్పు తప్పదు.జాగ్రత్తగా సౌరయాన్ ని మరొక ఆల్టిట్యూడ్ కిందకి దించాడు మాధవ్. ఒకవేళ ఉల్కా శకలం కక్ష్య మారినా దానితో ఢీకొట్టడానికి అవకాశం లేని కక్ష్యలోకి సౌరయాన్ ని తీసుకెళ్ళాలనేది మాధవ్ ఉద్దేశ్యం.

“మిహిరా,ఆస్టరాయిడ్ పొజిషన్ చెక్ చెయ్!”

“అలాగే..”, ఆమె ఉల్కా శకలం ప్రస్తుత స్థితిని అంచనా వెయ్యడానికి సిద్ధమైంది.

“ఆస్టరాయిడ్ ఆల్టిట్యూడ్ +795 కిలోమీటర్స్  ఫ్రమ్ GSA -” మానిటర్లో చెక్ చేస్తూ చెప్పింది.

“అంటే మనం ఇంకో 300 కిలోమీటర్లు కిందికి దిగాలనమాట! కానీ అప్పుడు చంద్రుడి ఆకర్షణ మన మీద పని చెయ్యదు,భూమి ఆకర్షణ ఎక్కువయిందంటే మళ్ళీ ISS కి తిరిగి చేరుకోవడం తప్ప మరో దారి లేదు” అన్నాడు మాధవ్.

“అదే చెయ్యాలనుకుంటున్నాం కదా! ఇంక దాని గురించి ఇంత ఆలోచన దేనికి?” అడిగింది మిహిర.

“నిజమే,కానీ ఒక సారి అక్కడి నించి ముందుకి కదలడమంటూ జరిగాక మళ్ళీ వెనక్కి తగ్గడం ఏమీ బాగోలేదు” అన్నాడు మాధవ్ సాలోచనగా.

“అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం,ISS తిరిగి వెళ్ళటం నీకిష్టం లేదా?”

అవునన్నట్టు తలపంకించాడు మాధవ్.”దీనికి ఇంకో సొల్యూషన్ ఉంది,అదేమిటంటే..” అర్థాంతరంగా ఆగిపోయాడు.

తనకి వచ్చిన ఆలోచనకి తనకి తానే ఒళ్ళు గగుర్పొడిచింది ఒక్క నిమిషం.”ఇది వింటే మిహిర నా దరిదాపుల్లోకి రావడానిక్కూడా భయపడుతుందేమో! వీడికి ఇంత పెద్ద క్రాక్ ఏంట్రా బాబూ,ఈ నట్ లూజ్ గాడితో వెళ్తున్నానా నేను అనుకుంటే?” అన్న సందేహం కూడా అదే నిమిషంలో కలిగింది మాధవ్ కి.

“ఏమిటి?” అని అడిగింది కుతూహలం ఆపుకోలేని మిహిర.

“ఏమీ లేదులే!” అన్నాడు.

“చెప్తావా? చెప్పవా?” పట్టు పట్టింది.

“చెప్తే భయపడ్తావ్”

“అందుకని నాకు చెప్పకుండా చేసేద్దామనేనా? ఇక్కడ క్యాప్స్యూల్ లో నేను కూడా ఉన్నాను,నువ్వుతీసుకునె డెసిషన్స్ కరెక్టో కాదో చెక్ చెయ్యాల్సిన అవసరం నాకే ఉంది” అంది మిహిర అతని మీద హక్కులన్నీ తనొక్కదానివే అన్నట్టు ఆరిందాలా.

“క్యాప్స్యూల్ కింద పడిపోయినా పర్లేదు,మహారాణి గారు మాత్రం గాల్లో తేలుతూ ఉండాలి.కింద పడ్డా కూడా పైచెయ్యి నాదే అంటావనమాట అయితే!కూలిపోయే క్యాప్స్యూల్లో చేరి కోల్డ్ వార్ చెయ్యడమంటే ఇదే!”

“కాదా మరి? మనం పడితే మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా లాగి పడెయ్యాలి.లేదంటే రేసులో వెనకాల ఐపోతాం” చెప్పింది టెక్కుగా.

“చూడటానికి వేలెడంత లేవు గానీ ఈ సోకులకేం తక్కువ లేదు” అన్నాడు మాధవ్.

“ప్లీజ్,చెప్పవా నువ్వేమనుకున్నావో? మా బుజ్జి కదా..ప్లీజ్!” గడ్డం పట్టుకుని అడిగింది గోముగా.

“ఆరడుగుల అందగాణ్ణి ఇలాగే నువ్వు బుట్టలో పడేస్తున్నావు.చెప్పమన్నావా? చెప్తే భయపడి పారిపోకూడదు మరి!”

“పారిపోనులే,చెప్పు”

“ఆస్టరాయిడ్ తాకేది సదరన్ హొరైజన్ దగ్గర కదా,మనమిప్పుడు డైరెక్షన్ రివర్స్ చేసి ఒక రైట్ కట్ ఇచ్చుకుని చంద్రుడికి తూర్పు వైపున ఉన్న క్రేటర్లో ఎందుకు దిగకూడదూ?”

“ఏమిటీ? నీకేమైనా పిచ్చా? అసలే ఇక్కడ ముందు నుయ్యి,వెనుక గొయ్యి అంటుంటే ఎటు పొయ్యినా వచ్చేది గొయ్యే కదా,అందులో ఇద్దరం కలిసి ఒకే సారి దూకుదాం అంటున్నావా! ఇంకా నయమే, పని చూస్కోవోయ్ – నేను బెంగుళూరులో ఉన్న మా ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను”

“ఆశ..అంత తొందరగా వెళ్ళిపోదామనే!”

“దోశా,వడా,అప్పడం కూడా..నాకు మా అమ్మ కావాలి.నేను వెళ్తున్నానంతే!”

వీళ్ళిలా సంభాషణలో ఉండగానే ఒక్క సారిగా పడమర వైపుకి బలంగా వీచిన సౌరపవనం సౌరయాన్ ని చూస్తుండగానే తనతో పాటు ఈవెంట్ హొరైజన్ లోకి తీసుకువెళ్ళింది.

కన్ను మూసి తెరిచేలోపు జరుగుతున్నదేమిటో అంతుబట్టలేదు వాళ్ళిద్దరికీ.

ఏదో ఒక సొరంగ మార్గంలోంచి స్వేచ్ఛా స్థితిలో కిందికి పడిపోతున్నట్టుగా అనిపించసాగింది.

అలా ఆ సొరంగ మార్గంలో ఎంత సేపు ప్రయాణించారో తెలియదు.కల్పనా క్యాప్స్యూల్ లో ఉన్న మిషన్ కంట్రోల్స్ అన్నీ పని చెయ్యడం మానేసినట్టుగా అనిపించింది వాళ్ళిద్దరికీ.

“రెడ్ అలర్ట్..రెడ్ అలర్ట్..” ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ లోని IVR సిస్టమ్  పదేపదే హెచ్చరించసాగింది.

“రెడ్ అలర్ట్..రెడ్ అలర్ట్..సౌరయాన్ మిస్సింగ్ ఫ్రమ్ ద విజన్!”

“ఓహ్..ఏమిటిది?” ఉన్నట్టుండి ఏం జరిగిందో అంతుబట్టని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుని కూర్చున్నారు.
                                                                          (ఇంకా ఉంది..)

బూచి-పిశాచి : భాగం-2

శుక్రవారం -8 ఏప్రియల్ ,2011

“ఏమా భయంకర నర్తన? మహా ఘోరముగానున్నది” ఉరిమిందా స్వరం.

ఇంతలో ఎక్కడో దూరంగా పిడుగు పడ్డ శబ్దం వినిపించింది.

మాయమైపోయిన భవంతి స్థానంలో ఒక పాడు పడ్డ,పైకప్పు కూలిపోయిన పురాతన భవనం ప్రత్యక్షమయ్యింది.ఈ సారి లతీఫ్ ప్రాణం లేకుండా పడి వున్నాడు.

అది చూస్తూనే మిగతా వాళ్ళ వెన్ను జలదరించింది.

“ఔరా,నా లాంటి ప్రేతములను దృశ్య శ్రవణ యంత్రములలో బంధించవలెననియా మీ తాపత్రయము? మీ దుర్మార్గమునకు తగిన శిక్ష విధించెద.నా శక్తిని చూపించెద.”

ఎవరో తనని భారీ క్రేన్ తో ఎత్తినట్టు జోసఫ్ అమాంతంగా గాల్లో పైకి లేచాడు.

“నో,నో..నన్నేం చెయ్యొద్దు,ప్లీజ్!మేమంతా ఇక్కణ్ణించి వెళ్ళిపోతాం.దయచేసి మమ్మల్ని వదిలి పెట్టు.”

“ఓరీ,ధూర్తాగ్రణీ! నాతో పందెము వైచిన వారికి వైతరణీ నదియే గతి.నీవెంత పెనుగులాడిననూ నా కబంధ హస్తముల నించి తప్పించుకొనలేవు.”

అనకొండ నోట్లో చిక్కుకున్న మిడత పిల్లలా వృత్తాకారంలో వంకర్లు తిరుగుతూ అమాంతంగా నేల మీద పడిపోయాడు జోసెఫ్.

స్టూడియో స్క్రీన్ మీద నిలువు గీతలు రావడం మొదలైంది.కాసేపటికి సుందర్,లతీఫ్,జోసెఫ్ ల కళేబరాలు స్క్రీన్ మీద వయ్యారంగా చెట్ల కొమ్మల మీద ఊగుతూ కనిపించాయి.

కార్యక్రమంలో ఇలాంటి అపశృతులు దొర్లినందుకు స్టూడియో లోని క్రీంకార్ బృందం “బూచి-పిశాచి” లైవ్ టెలిక్యాస్ట్ ని నిలిపేసి క్షణ క్షణం ఏం జరుగుతుందా అని భయంతో కుదేలైపోతున్నారు.

“నువ్వేమైనా చంద్రముఖిననుకుంటున్నావా? నీ భరతం పడతాను చూడు!” ఆగ్రహంతో పందెం కాసింది రూప.

“హహ్హహ్హా..” గాల్లో గింగిర్లు తిరిగిందో వికటాట్టహాసం.

“అలాగా! చూద్దాం”

తన మెడలో ఉన్న పంచ ముఖీ ఆంజనేయ కవచ్ బైటికి తీసింది రూప.హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టింది.

“వెఱ్ఱి దానా,ఇవి నన్నేం చెయ్యలేవు!!”

రూప మెడలో ఉన్న కవచం ఎగిరి అల్లంత దూరంలో పడింది.దాంతో పాటే రూప కూడా.

అమిత్ ఇంకా సౌమిన్ ఇద్దరే మిగిలారు ఇప్పుడు.

“ఇక్కడున్న వారందరూ అందగాళ్ళే,ఐననూ నాకెందుకో మీరిద్దరే బహు సుందరముగా కనిపించుచున్నారు.ఒకరివి నీలి కన్నులు,మరొకరివి తేనె కన్నులు.మీ ఇద్దరిలో ఒకరు నన్ను వివాహము చేసుకొనిన యెడల రెండవ వారిని వదలివైచెదను.శీఘ్రమే నిర్ణయం చేయుము.”

“అంటే,నువ్వు ఆడ దయ్యానివా?” అడిగాడు అమిత్.

“అనుమానమా?” అడిగింది ప్రేతాత్మ.

“అహహా..కన్ ఫర్మ్ చేసుకుందామని అడిగానంతే! ఐ మీన్,నా ఉద్దేశ్యం నీ అంగీకారము కొరకు వేచి ఉన్నాను అని అర్థము.”

“నాకు ఆంగ్లము బహు బాగుగా అర్థమగును.మాకు భాషా,కుల,మత భేదములు లేవు.ఐనచో మరి నన్ను యెప్పుడు వివాహము చేసుకొనియెదవు?” అడిగింది ఆత్మ.

“ఇంకో వన్ అవర్ లో చేసుకుందాం,మ్యారేజ్ కి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి కదా.అవునూ,నువ్వు ఉగాది సెలబ్రేట్ చేసుకుంటావా?”

“లేక క్రిస్మస్ దినము చేసుకుందుననుకొంటివా యేమి?”

“ఐతే మరి ఉగాది పచ్చడీ..” నసిగాడు అమిత్.

“గైకొని రమ్ము.ఆరగించి శుభాకాంక్షలు తెలుపుకొందము!మర్యాదగా తిరిగి వచ్చిన యెడల వలచి పూల మాల వైచి  వివాహము చేసుకుందును.మోసము చేసితివా? నీ తోలు వలిచి నా మెడలో మాల  వైచుకొందును.”

“అబ్బెబ్బే,నిన్ను మోసం చెయ్యడానికి నాకెన్ని గుండెలు?” ఉగాది పచ్చడి గిన్నె తీసుకు రావడానికి వెళ్ళాడు అమిత్.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

వెనక నించి తన భుజాన్ని నొక్కుతున్న చెయ్యిని వదిలించే ప్రయత్నం చేసాడు సౌమిన్.

“అందగాడా,ఈ అమితుడు నన్ను పరాభవించునేమో అని నాకనుమానముగా నున్నది.నిజమునకు మీ ఇరువురిలో నిన్నే నేనధికముగా వలచినాను.ఉలుకు పలుకు లేక అటుల నిలుచున్నావేమి? నన్ను వరింపుము.”

బీ.పీ అమాంతంగా పెరిగిపోయింది సౌమిన్ కి ఒక్కసారిగా.

“ఎలా ఈ ప్రేతాత్మ పీడాకారం వదిలించుకోవడం?” దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

ఏమయితే అదవుతుందని లేని గుండె ధైర్యం తెచ్చుకున్నాడు,”మోసాన్ని మోసంతోనే జయించాలి.శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన సారమంతా ఇదే కదా” అని నిర్థారించాడు.

“ఇందాక మరి అమిత్ ని వరించావు కదా,సడన్ గా ఇలా ప్లేట్ తిప్పేస్తే ఎలా? నిన్ను ఎలా నమ్మమంటావ్,వాడిక్కూడా సేమ్ టూ సేమ్ డైలాగ్ చెప్పావ్”

“అతను కూడా అందగాడే.కానీ నీ అంత అందముగా లేడే ? అదియునూ గాక మనిద్దరికీ జన్మ జన్మల సంబంధమున్నట్టు నాకు తోచుచున్నది.నిన్ను వదలి ఉండలేకున్నాను.నిన్నే వరింతును,వానిని వధింతును.”

“ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా రెండో వాళ్ళని వదిలేస్తానని చెప్పావ్? ఎక్కడో గాల్లో దాక్కుని దాక్కుని మాట్లాడుతున్నావ్,నీ అందం ఎంతుందో చూడకుండా నేను పెళ్ళి చేసుకోవడం ఎలా? పెళ్ళయ్యాక మనకి పిల్లలు పుడితే వాళ్ళు ఎంతందంగా ఉంటారో నేను తెల్సుకోవద్దా? సరే గానీ మనిద్దరికీ ఎన్ని జన్మల సంబంధం ఉందో క్యాల్ క్యులేట్ చేసి చెప్పు,త్వరగా..అసలే ఎక్కువ టైమ్ లేదు.”

“అమ్మో ఈతను ఘటికుడు,నన్నే ప్రశ్నలు వైచి పరీక్షించుచున్నాడు.ఒక అందమైన ఉద్యానవనమునకు తీసుకొని పోయి ఈతని మనసు మార్చెదను.”

సౌమిన్ ఎదురుగా ఒక అందమైన ఉద్యానవనం ప్రత్యక్షమయ్యింది.

ఆ వనంలో పూల సౌందర్యం చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు సౌమిన్.

కాసేపటికి ఒక పాతికేళ్ళ అమ్మాయి అక్కడ కనిపించింది.జుట్టు విరబోసుకుని గంధపు రంగు చీరలో తన ముందు నిల్చున్న ఆ వాలుకళ్ళ అమ్మాయి సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు సౌమిన్.

“నన్ను గుర్తించినావా ప్రియా?” అడిగింది ఆమె.

“ఓ..నువ్వేనా? ఎవరో దేవకన్య పొరపాటుగా ఈ తోటలో షికారుకొచ్చిందనుకున్నాను.”

(ఓ..ఇది నేను చిన్నప్పుడు తాతయ్య చెప్పిన కథల్లో విన్న మోహినీ,కామినీ టైప్ పిశాచి అనమాట.దీన్ని ఎక్కువ సేపు కళ్ళార్పకుండా చూస్తే డేంజర్.త్వరగా వదిలించుకుంటే బెటర్ అనుకున్నాడు.)

“అటులనా?” నవ్వుతూ సౌమిన్ చెయ్యి పట్టుకుని దగ్గరలో ఉన్న బెంచ్ మీదకు తీసుకు వెళ్ళింది.

అక్కడ ఒక పళ్ళెంలో రక రకాల పండ్లున్నాయి.

“తిను ప్రియా..” సుతారంగా పళ్ళు వలిచి నోటికందించింది.

“తింటాను గానీ నా క్వెశ్చన్స్ కి నువ్ ఆన్సర్ చెప్పలేదు.”

“చెప్పనిచో..”

“నేను తినను” బెదిరించాడు.

“అటులనే చెప్పెదను” సౌమిన్ కళ్ళ ముందు ఒక మ్యాజిక్ స్టిక్ తిప్పింది పిశాచి.

**********************************************

సౌమిన్ ఇప్పుడు వేరే ప్రపంచంలో ఉన్నాడు.ఇంకో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గురుగ్రహమంత పెద్ద గ్రహమ్మీద ఉన్నాడు.

ఎటు చూసినా జలపాతాలు,చుట్టూ కొండలూ-కోనలూ.అందమైన ప్రకృతి.ఎవరో చేత్తో ల్యాండ్ స్కేప్ గీసినట్టుగా ఉంది ఆ ప్రదేశం.

“ఓహ్..ఎంత అద్భుతంగా ఉందీ గ్రహం.ఇదంతా దీని మాయా DTS డిజిటల్ ఎఫెక్ట్.గ్రాఫిక్స్ ఇంజనీర్ని నాకే గ్రాఫిక్స్ చూపిస్తోందే! ఇలాంటి వాటికి మనం లొంగిపోకూడదు.”  స్థిరంగా నిశ్చయించుకున్నాడు.

“యా! ఇంతకీ నాకోసం ఇన్ని చేస్తున్నావు.కానీ నీ పేరు చెప్పనే లేదు.కామిని,మోహిని,జగన్మోహిని,రంభ,ఊర్వశి,మేనక,తిలోత్తమ..నీ పేరు ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తున్నాను.”

ఈ మాటలతో పిశాచి మెత్తబడింది.

“ఇవేమియునూ కాదు.నా పేరు చంద్రిక.”

“ఓ..చంద్రిక.సో స్వీట్ నేమ్” బుగ్గ గిల్లాడు సౌమిన్ పిశాచిని మసి పూసి మారేడు కాయ చేస్తూ.

“మరి ఫలములు ఆరగింపుము అందగాడా!”

“అలాగే,దూరముగా కనిపిస్తున్న ఆ గుహ ఏమిటి?” అడిగాడు.

“ప్రతి విషయమునకూ చిక్కు ప్రశ్నలు వైచి మమ్ము పరీక్షించుచున్నావు కదా! ఆ దూరముగా కనిపించు గుహ నా నివాసము.అందులో ఎన్నియో రహస్యములున్నవి.మానవ మాత్రులు తెలుసుకొనలేరు.”

“నేను కూడానా?” అడిగాడు సౌమిన్ చంద్రిక దగ్గరగా జరిగి.

“ఊ..”

“ఐతే నీకు నా మీద నమ్మకం లేదనమాట” నిష్ఠూరంగా అన్నాడు.

“అది యేమి అందగాడా,అటులందువు? నీ మీద నాకు నమ్మకము లేకేమి?”

“నమ్మకముంటే మరి చెప్పు”  చంద్రికని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు.

“అది భయంకరమైన గుహ.నీవందు అడుగు పెట్టలేవు.ముఖ్య ద్వారమునందు భయంకరమైన అగ్నిని మరియు బాష్ప వాయువుని వెదజల్లు యంత్రములు ఉన్నవి.అక్కడ అడుగిడిన వారు మాడి మసైపోవుదురు.”

“ఐతే నేనొక సారి చూస్తాను,నాకు చూపించవా? ఇలాంటి అడ్వెంచర్స్ అంటే నాకు బలే ఇష్టం తెలుసా?”

“మరి ఫలములు” మాట మార్చింది చంద్రిక.

“నేను చెప్పింది వింటేనే ఫలములు,లేదంటే పస్తులే” అన్నాడు సౌమిన్.

“సరి,సరి తినకున్నచో నీవు చిక్కి శల్యం ఐపోదువు.నాతో రమ్ము” తీసుకెళ్ళింది చంద్రిక.

అక్కడ రెండు బంతుల్లోంచి మంటలు ఎగసి పడుతున్నాయి.

ఆ రెండిటికీ మధ్య వంద అడుగుల దూరం ఉంది.ఆ రెండు బంతుల్నీ కలుపుతూ ఉన్న రేఖ మీద మిడ్ పాయింట్ గుర్తించాడు సౌమిన్.

అక్కడ చుట్టు పక్కల వెతికి చూసాడు.అక్కడ కొద్దిగా కుంగిపోయి ఉన్న భూమిలో చిన్న స్విచ్ లాంటిది కనిపించింది.కాలుతో ఆ స్విచ్ ని నొక్కాడు.వెంటనే ఫౌంటెన్లా ఎగసి పడ్డాయి నీళ్ళు.మంటలు నిమిషాల మీద చల్లారిపోయాయి.

“శభాష్,మంచి తెలివైన వాడివే” మెచ్చుకుంది చంద్రిక.

“మరి?” భుజాలు ఎగరేసాడు సౌమిన్.

తరవాత కెలిడోస్కోప్ రూములో అద్దాల గదిలో అసలు అద్దం కనుక్కుని దాన్ని పలకలుగా  పగలకొట్టాడు.

చదరంగం ఆటలో చంద్రికని ఓడించాడు.

పిరమిడ్ గదిలో రహస్య సొరంగ ద్వారం కనుక్కున్నాడు.

ఇక చిక్కాల్సింది చంద్రిక అసలు రహస్యం.

*********************************************

అన్ని గదుల్లోనూ ఒక గదికి పెద్ద తాళం వేసి ఉండటం గమనించి అదేమిటని అడిగాడు.

“అది రహస్యం,నేనిపుడు చెప్పలేను.చాలా అలసిపోయాను.కాసేపు విశ్రమిస్తాను.” తప్పించుకోవాలని ప్రయత్నించింది చంద్రిక.

“ప్లీజ్ డియర్,అదేంటో చెప్పవా? ఉత్తినే వద్దులే,ఒక ముద్దిస్తాను”,అంత పనీ చేసాడు.

“ఆ గదిలో ఒక అద్భుతమైన దీపపు సెమ్మె ఉంది.దానిలో ఒక అపురూపమైన వజ్రం ఉంది.అందులో నేనున్నాను” చెప్పి వెళ్ళిపోయింది చంద్రిక.

“ఓహో..ఐతే ఆ వజ్రాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఈ పిశాచి పని పట్టడం పూర్తవుతుందనమాట!మరి వజ్రాన్ని ఎలా డెస్ట్రాయ్ చెయ్యడం,అది డెస్ట్రాయ్ అవ్వదే?”

అప్పుడు గుర్తొచ్చింది సౌమిన్ కి,”ముల్లుని ముల్లుతోనే తియ్యాలి.వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి.”

“ఇప్పుడు ఇంకో వజ్రం సంపాదించాలి.ఎలా? ఇందాకటి గదిలో చంద్రిక స్నేహితురాళ్ళు మాకు స్వాగతం పలికారు.అక్కడ ట్రై చేస్తేనో?”

ఆలోచన రాగానే ఆ గదిలోకి వెళ్ళాడు సౌమిన్.

ఇందాక కనిపించిన స్నేహితురాళ్ళు ఇప్పుడు లేరు.”ఎక్కడికెళ్ళారు వీళ్ళు? ” వెతుకుతూ అప్రయత్నంగా కాలికింద ఏదో తగలడంతో ముందుకు తూలి పడబోయి తమాయించుకుని నిల్చున్నాడు.

ఒక తీగ లాంటిది కనిపించింది.అది పట్టుకుని ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దామని లాగాడు.

లాగగానే ఎదురుగా ఉన్న తలుపు తెరుచుకుంది.అందులోంచి ఒకమ్మాయి బైటికి వచ్చింది.”ఏమి ఆజ్ఞ?” అడిగింది.

“ఓహో..ఇది ఇందాకటి స్నేహితురాలు అనుకుంటా.ఐనా నన్నే ఆర్డర్ చెయ్యమంటుంది కదా,ఓ కోహినూరంత వజ్రం ఆర్డర్ చేస్తే పోలా?” అనుకున్నాడు సౌమిన్.

“మీ చంద్రిక మిస్ నన్ను మ్యారేజ్ చేసుకోవాలని సంకల్పించారు.మరి ఆవిణ్ణి పెళ్ళాడటమంటే మాటలా? తనకి ఎంగేజ్ మెంట్ గిఫ్టుగా బహూకరించడానికి ఒక కోహినూర్ వజ్రం కావాలి.నువ్వు అది అరేంజ్ చేస్తావా?” లౌక్యంగా అడిగాడు సౌమిన్.

“చిత్తం” అదృశ్యం అయి ఒక పది నిమిషాల తరవాత తిరిగి ప్రత్యక్షం అయింది వజ్రంతో.

“సరే,నువ్వు వెళ్ళి మీ మిస్ తో సెలబ్రేట్ చేసుకో.రేపు మార్నింగ్ వచ్చి నన్ను నిద్ర లేపు.” ఆర్డర్ వేసాడు సౌమిన్.

“చిత్తం” మాయమైపోయింది.

“అమ్మయ్యా,ఇప్పటికి దీన్ని వదిలించుకున్నాను.ఇంక పెద్ద పిశాచాన్ని వదిలించాలి.” ఆ తీగకి కాలు తగలకుండా జాగ్రత్తగా తాళం వేసిన గది వైపు వెళ్ళాడు సౌమిన్.కాళ్ళకీ,చేతులకీ ఏమీ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఆ గదిలోకి అడుగు పెట్టడమే చాలా కష్టమైపోయింది. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా తాళం తెరుచుకోవడం లేదు.అప్రయత్నంగా జేబులో చెయ్యి పెట్టిన సౌమిన్ కి అతని గాళ్ ఫ్రెండ్ అఖిల జడ పిన్ను దొరికింది.ఒక సాయంత్రం అఖిల జడతో ఆడుతూ ఆడుతూ పిన్నులు లాగి జేబులో వేసుకోవడం గుర్తొచ్చింది.

“ఆహా..గాళ్ ఫ్రెండ్ ఉన్న వాడిదే కదా అదృష్టమంటే” అనుకున్నాడు.

ఈ పిన్నులిప్పుడు నాకు బాగా పనికొస్తాయి అనుకుని వాటిని రక రకాలుగా వంచి మొత్తానికి ఎలాగైతేనేం ఆ గది తాళం తియ్యగలిగాడు.

“ఎంత మంచి దానివే అఖిలా,ఈ పిశాచి చేతుల్లోంచి బైటపడ్డానంటే నీకు ట్రీట్ ఇస్తా” అనుకున్నాడు.

ఎక్కడి నించో చాకులు గాల్లోంచి దూసుకొచ్చాయి తలుపు తియ్యగానే.

ఆ చాకులు తగలకుండా డాలు అడ్డు పెట్టుకుని నేల మీద వంగి పరిశీలించాడు సౌమిన్.

కిందున్న కార్పెట్ మీద కాలు తగలగానే చాకులు వస్తున్నాయి.”ఇదా సంగతి” అని చాపని గుండ్రంగా చుడుతూ కిందున్న స్విచ్చులు కాలికి తగలకుండా గదికి ఒక మూలగా మూటని చేరుకున్నాడు.మూట విప్పి చూసాక అందులో కనిపించింది దీపపు సెమ్మె.  

ఆ సెమ్మె డిజైన్ మధ్యలో తళ తళా మెరుస్తూ కనిపించిందొక వజ్రం.

“ఇదే అనమాట దాని ప్రాణ రహస్యం.” ఆ వజ్రాన్ని బైటికి తియ్యాలని ప్రయత్నించాడు.అది డిజైన్లో ఫిక్స్ చేసి ఉండటం వల్ల బైటికి రాలేదు.

“ఫెవి క్విక్ పెట్టి అతికించిందా ఏంటి దీని దుంపతెగ,ఎంత లాగినా ఊడి రావట్లేదు”

“ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటెయిన్ చేసుంటుందో ఇప్పటి దాకా? ముందు అమిత్ గాడు కావాలంది,ఇప్పుడు నేను కావాలంటోంది.అక్కడ సిటీలో ఒక్క గాళ్ ఫ్రెండ్ తోనే వేగలేక నేను అవస్థలు పడుతున్నాను.ఉన్న కష్టాలు చాలవని ఇప్పుడీ పిశాచి చేతిలో కొత్త కష్టాలు నాకు.ప్చ్!” నిట్టుర్చాడు సౌమిన్.

చేతికున్న వాచ్ చూసుకున్నాడు.ఇంకో గంటలో తెల్లారిపోవస్తోంది.

“అయ్యో,తెల్లవారగానే ఆ ఫ్రెండ్ పిశాచి మళ్ళీ చిత్తం చిత్తం అని ప్రత్యక్షమైపోతుందే,దాన్ని పొద్దున్నే రమ్మని రెచ్చిపోయి చెప్పేసాను.గంటలో ఈ వజ్రాన్ని డెస్ట్రాయ్ చెయ్యాలే?” టెన్షన్ తో చెమటలు పట్టేస్తున్నాయి సౌమిన్ కి.

రాబోతున్న ఉపద్రవాన్ని ఊహించని చంద్రిక అక్కడ అమిత్ తో సరసాలాడటానికి వెళ్ళింది.

దుష్టురాలైన చంద్రిక అటు అమిత్ నీ,ఇటు సౌమిన్ నీ ఇద్దరినీ మోసం చెయ్యాలని సంకల్పించింది.

ఏదేమైనా దాని భరతం పట్టి తీరాలని పట్టుదలగా ఉన్నాడు సౌమిన్.అమిత్ మాత్రం దాని దెబ్బకి భయపడిపోయి చేతులెత్తేసాడు.

***************************************************

“ఇలా ఐతే లాభం లేదు,డైరెక్టుగా నా కోహినూర్ తో ఈ వజ్రాన్ని కోసేస్తా” మెల్లిగా ఆ దీపపు సెమ్మెలో ఉన్న వజ్రాన్ని కొయ్యడం మొదలెట్టాడు సౌమిన్.

ముప్పావు గంట తరవాత సెమ్మెలోని వజ్రం లోంచి ఒక పెద్ద ముక్క ఊడి కింద పడింది.

మధ్యలో ఊడిపోయిన ఆ వజ్రాన్ని  పది నిమిషాల్లో మరింత చిన్నగా కోసాడు సౌమిన్.చంద్రిక మ్యాజిక్ స్టిక్ ముక్కలై కింద పడింది.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఆగ్రహోదగ్రురాలైపోయి సౌమిన్ ముందుకి వచ్చింది చంద్రిక.

“దుష్టుడా,నాకే ఎసరు పెడదామని చూస్తున్నావా?”

“లేకపోతే నువ్వు నాకు పెడ్తావు కదా!” సూటిగా ప్రశ్నించాడు సౌమిన్.

“నా మీద నమ్మకం లేదా?”

“తెలివైన వాడు తనని తాను నమ్ముతాడే గానీ పిశాచాల్ని ఎప్పటికీ నమ్మడు.ఈ మాత్రం తెలియదా నీకు? నీ మోసాలిక కట్టి పెట్టు.నా దగ్గర చెల్లవు.జాగ్రత్త!” హెచ్చరించి మిగతా వజ్రాన్ని ముక్కలు చేసాడు సౌమిన్.

వజ్రం ముక్కలవడంతో చంద్రిక కింద పడిపోయింది.అక్కడున్న భవంతి మాయమైపోయింది.

***********************************************

దక్షిణ దిశగా వాళ్ళు వెళ్ళిన చిట్టడవిలో ఉన్నాడిప్పుడు.

ఒక్కడే దారి కనుక్కుని విజయవంతంగా తిరిగి వచ్చాడు.

డైరెక్టుగా వీతెగులు ఛానల్ ఆఫీసుకి వెళ్ళాడు సౌమిన్,రెండు బృందాల్లోనూ ఛాంపియన్ గా మిగిలిన ఏకైక విజేత.

“ఇలాంటి దిక్కుమాలిన రియాలిటీ షోలు,సినిమాలూ  మళ్ళీ మీ ఛానల్ వాళ్ళు స్పాన్సర్ చేసినా,చేసినట్టు తెలిసినా లీగల్ కేసు పెట్టి ఏకంగా ఛానలే మూయించేస్తా! అండర్ స్టాండ్?”

ఆ దెబ్బతో బెదిరిపోయాడు క్రీంకార్.

“నీకు కూడా సేమ్ వార్నింగ్!”  హరస్యం యాంకర్ కి ముచ్చెమటలు పోసాయి.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

సాయంత్రం అఖిలని మాంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు సౌమిన్.

క్యాండిల్ లైట్ డిన్నర్ స్పాన్సర్ చేసాడు.

“ఏమిటిది సౌమిన్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా?”

“సర్ ప్రైజ్! అంతే..”

“సర్ ప్రైజ్ కి కారణాలుండవు.నీ జడ పిన్స్ ఇస్తావా?” ముసి ముసిగా నవ్వుతూ అఖిల జడలోంచి పిన్నులు లాగేసుకున్నాడు సౌమిన్.

                                                                            ..ఐపోయింది..

“మేడలో బూచి-మూటలో పిశాచి”-(ఒక భీతావహ ప్రేమకథ)

బుధవారం-6 ఏప్రియల్ ,2011

జ్ జ్ జ్ జ్ జ్ జ్ … స్ స్ స్ స్ స్ …

వూ…హూ .. జూ ..

గాలికి జడలు విరబోసుకున్న దయ్యాల్లా భయంకరంగా ఊగుతున్నాయి మఱ్ఱి చెట్లు.

క్రీచ్..క్రీచ్..

టక్..టక్..

ఠప్..ఠప్..

టప టపా కొట్టుకుంటున్నాయి ఆ భూత భవంతి తలుపులూ,గవాక్షాలూ.

అది ఫాల్గుణ బహుళ అమావాస్య.సమయం అర్థ రాత్రి గం.12:45 నిమిషాలు.

తెల్లవారితే చైత్ర శుద్ధ పాడ్యమి.ఉగాది పండుగ.

ఆ భవంతిలో మిగిలి ఉన్నది ఒకే ఒక అబ్బాయి.అతని వయసు దాదాపుగా 30 సంవత్సరాలుంటుంది.

అతను నిలువెల్లా వణికిపోతున్నాడు.చెమటతో తడిసి ముద్దైపోయి ఉన్నాడు అప్పటికే.కదిలిస్తే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది అతని ప్రస్తుత పరిస్థితి.

మామూలు సమయాల్లో ఆరడుగుల ఆ అబ్బాయి అమిత ధైర్యశాలి.బ్రహ్మరాక్షసుడు ఎదురుగా వచ్చి గోళ్ళతో రక్కినా భయపడని సాహసి.

గత మూడు గంటల నించీ అతను చూస్తున్న దృశ్యాల వల్ల అతని ధైర్యం పూర్తిగా చెదిరిపోవడం మొదలయ్యింది.

అతనితో పాటు ఉగాది పండుగ జరుపుకోవడానికి వచ్చిన అతని స్నేహితులు ఒక్కొక్కరుగా అతని కళ్ళ ముందే రక్తపు మడుగుల్లో విగత జీవులైపోతున్నారు.అన్నీ చూస్తూ కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి అతనిది.

ఇంతలో వెనక నించి  వొక చెయ్యి వచ్చి అతడి భుజం మీద గట్టిగా నొక్కింది.

ఉలిక్కిపడి కెవ్వున కేక వేసాడతను.
***************************************

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

వీతెగులు టీవీ ఛానల్ కోసం క్రీంకార్ అనే ప్రముఖ యాంకర్ నిర్వహిస్తున్న విలక్షణమైన హార్రర్ రియాలిటీ షో “మేడలో బూచి-మూటలో పిశాచి” ఒకటో సిరీస్ కోసం సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు.

టీవీ19  “హరస్యం” కార్యక్రమం ద్వారా ప్రజల్లో తన హావభావాలకి గానూ అత్యుత్తమ రహస్యాన్వేషకుడుగా పేరు సంపాదించుకున్న మరో ప్రముఖ యాంకర్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.

సర్పకేశి,తామ్రపాలి అనే అందమైన వ్యాఖ్యాతలు “మేడలో బూచి-మూటలో పిశాచి” కార్యక్రమాన్ని తమ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో కనుల విందుగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చెయ్యబడ్డ పది అత్యుత్తమ విద్యా సంస్థల్లోని M.Tech మరియు Ph.D విద్యార్థులు టైటిల్ పరీక్షలో పాల్గొంటున్నారు.

పోటీలో పాల్గొనే అబ్బాయిలూ,అమ్మాయిలూ మంచి శారీరక దారుఢ్యం,రోగ నిరోధక శక్తి ఇంకా మానసిక స్థైర్యం కలిగి ఉండాలని,ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ గుండె పోటు తెచ్చుకుని పడిపోకూడదని గట్టి నిబంధనలు మొదట్లోనే క్రీంకార్ పెట్టడం వల్ల బలహీనులూ,గుండె ధైర్యం లేని పిరికి వాళ్ళూ ఆడిషన్ స్టేజ్ లోనే వెనుతిరిగి వెళ్ళిపోయారు.

“మేడలో బూచి-మూటలో పిశాచి”  కార్యక్రమ నియమ నిబంధనల్ని అనుసరించి ఎవరైతే భూతభవంతిలోని భూతాలతో ప్రత్యక్షంగా మాట్లాడి వాటి మాటలని/అరుపులని/చేష్టల్ని కెమెరాలో బంధించి తగిన ఆధారాలతో నిరూపిస్తారో వారే విజేతగా నిలుస్తారు.

చివరి పరీక్షలో 15 మంది నెగ్గారు.వారిలో ఉన్నాడు సౌమిన్ కాశ్యప్.

సౌమిన్ వయసు 30 సంవత్సరాలు.ఎత్తు ఆరడుగుల రెండంగుళాలు.

ప్రతి రోజూ జిమ్ లో రెండు పూటలా వర్కవుట్లు చెయ్యడం వల్ల అతని శరీరం ధృఢంగా ఉంటుంది.ఎత్తుకి తగ్గ పర్సనాలిటీ.ఎదుటి వారిని కట్టి పడేసే తేనె కళ్ళు అతని స్వంతం.

అమిత్,రూప,వంశీ,జోసెఫ్,లతీఫ్,సుందర్ వీళ్లంతా సౌమిన్ తో పాటు ఎంపికయ్యారు.ఈ ఏడుగురూ సెలక్షన్స్ జరుగుతున్నప్పుడే మంచి మిత్రులైపోయారు.

ఇక “మేడలో బూచి-మూటలో పిశాచి” సాహస కార్యక్రమం మొదలయ్యింది.

ఎంపిక చేసిన పదిహేను మందినీ రెండు గ్రూపులుగా విభజించారు.సౌమిన్ వాళ్ళ గ్రూప్ కాకుండా ఇంకో గ్రూపులో 8 మంది సభ్యులున్నారు.

మరో బృందాన్ని ఉత్తరం వైపుగానూ,సౌమిన్ వాళ్ళ బృందాన్ని దక్షిణం వైపుగానూ పంపించారు.

ప్రఖ్యాతి గాంచిన భూతభవంతుల్లో వాళ్ళకి బస ఏర్పాటు చేసారు.ఆ భవంతి మూల మూలలా పరిశీలించి దయ్యాలు ఎక్కడున్నాయో వెతకడం,వాటి మాటల్ని/చేష్టల్ని రికార్డ్ చెయ్యడం ఆ రెండు బృందాలకీ అప్పజెప్పబడిన పని.

ఫాల్గుణ బహుళ అమావాస్య.

సౌమిన్ బృందంలోని సభ్యులు రెండు రోజులుగా ఆ భవంతిలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నివాసం ఉంటున్నారు.

భవంతి నలు వైపులా ఎటు చూసినా వారికి భుతాల జాడ కనిపించలేదు.

ఆ భవంతిలోని ప్రతి అణువునీ సర్పకేశి వీతెగులు ఛానల్ టీవీ కెమెరాలో తన వ్యాఖ్యానంతో పాటు ప్రత్యక్షంగా చూపిస్తోంది.

రెండు రోజులుగా ఎలాంటి చలనమూ లేని ఆ భవంతిలో ఒక్కసారిగా వింతలూ,విచిత్రాలూ చోటు చేసుకోవడం మొదలు పెట్టాయి రాత్రి పది గంటలవుతుండగా.

ఉగాది కోసం ముందు రోజు రాత్రి నించే సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నారు మిత్రులంతా.

ఉగాది సంబరాలు జరుపుకోబోతున్న సమావేశ స్థలాన్ని నిర్ణయించుకున్నారు.అక్కడ అందంగా అలంకరించిన ఒక వేదికని సిద్ధం చేసారు.

ఆ వేదిక మీద “ఉగాది పచ్చడి” గిన్నెని అమర్చారు.దానితో పాటే ఒక చాక్లెట్ కేక్ ని కూడా సిద్ధంగా ఉంచారు.

పది గంటలకి సౌమిన్ బృందంలోని సభ్యులంతా అక్కడ సమావేశం అవడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని తయారుగా ఉన్నారు.

సమయం రాత్రి 9:57 నిమిషాలు.

బృందంలోని సభ్యులంతా అక్కడ సమావేశమయ్యారు.

సర్పకేశి,వీతెగులు ఛానల్ కెమెరా మెన్లూ,బూచి-పిశాచి కార్యక్రమాన్ని షూటింగ్ చేస్తున్న డైరెక్టర్,టెక్నికల్ అసిస్టెంట్లూ అందరూ ఆ సమయానికి అక్కడికి చేరుకున్నారు.

**********************************************

ఉన్నట్టుండి కలలో లాగ ఎవరో అదృశ్య మీట నొక్కినట్టు ఆ భవంతి గాలిలో మాయమైపోయింది.

ఎటు చూసినా కీకారణ్యం.కళ్ళు పొడుచుకున్నాకనిపించని కటిక చీకటిలో సర్పకేశి బెదురు బెదురుగా తన వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తోంది.

స్టూడియో నించి క్రీంకార్ పెద్దగా అరుస్తున్నాడు,”సర్పా,అక్కడ ఏం జరుగుతోంది?”

“మేము బస చేసిన భవంతి ఉన్నపాటుగా ఒక్క క్షణంలో మాయం అయిపోయింది క్రీంకార్” చెపింది సర్ప.

న్యాయ నిర్ణేత హరస్యం యాంకర్ :”క్రీంకార్,ఉన్నట్టుండి సర్ప వీడియో కెమెరాలోని సిగ్నల్ కట్ అవుతోంది.నా చెవుల్లో శంఖం మోగినట్టు వింత ధ్వని వస్తోంది.ఇది ఖచ్చితంగా మాయా నాగరికతకి సంబంధించిన ఆనవాలు.

మాయన్ ఏలియన్లు నాతో సంభాషించడానికి సిగ్నల్స్ పంపుతున్నారు.మాయన్ల ఆచారాలని అనుసరించి చెవిలో శంఖనాదం వినిపించడాన్ని ప్రమాద సూచనగా పరిగణిస్తారు.

ప్రపంచంలోని అత్యున్నత నాగరికత కేవలం మాయన్ క్యాలండర్లోనే ఇమిడి ఉంది.అందులోని శంఖం గుర్తు ప్రళయానికి ప్రతీక.”

“ఇప్పుడు ఏదో అనర్థం ముంచుకు రాబోతుందని నాకనిపిస్తోంది.”

***********************************************

ఉన్నట్టుండి స్టూడియో స్క్రీన్ మీద ఒక ఆకారం లీలగా ప్రత్యక్షం అయ్యింది.అది ఎలాంటిదో తెల్సుకునే లోపే మాయం ఐపోయింది.

#####################################

“ఓరీ ధూర్తులారా,మీరంతా ప్రాణాలతో మిగిలాలనుకుంటే తక్షణమే నా భవంతిని విడిచి పొండు” ఒక భయంకరమైన ధ్వని ఆ అరణ్యంలో గింగురుమంది.

ఆ గొంతు వింటూనే సౌమిన్ వాళ్ళ బృందంలో సగం మందికి పై ప్రాణాలు పైనే పోయాయి.

భయంతో బిగ్గరగా ఒకరినొకరు పొదివి పట్టుకుని నిల్చున్నారు.

మరు క్షణం మాయమైపోయిన భవంతి ప్రత్యక్షం అయింది.అంతా చూస్తుండగానే సుందర్ రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది.

“అహో..మాకు నృత్య గాన లీలా వినోదములు కావలె.సర్పా,ఇటు రమ్ము” కర్కశంగా ఆజ్ఞాపించిందా కంఠస్వరం.

వణుకుతూ వణుకుతూ వేదిక లాంటి స్థలంలో వెళ్ళి నిలబడింది సర్ప.భవంతి మళ్ళీ గాలిలో మాయం ఐపోయింది.

ఒక కీర్తన గాలిలో లీలగా వినిపించడం మొదలైంది.

“మయూరి వలె ఈ గానమునకు నీ నాట్యము రక్తి కట్టవలె.బేలా..ఇక నీ నృత్యము కొనసాగించుము.”

తన ఇష్టం వచ్చినట్టు కాళ్ళూ,చేతులూ అడ్డ దిడ్డంగా కదుపుతూ అడుగు తీసి అడుగు వెయ్యడమే కష్టంగా అరుంధతిలో అనుష్క నాట్యం చేసినట్టు చెయ్యసాగింది సర్పకేశి.

తన చీరకొంగునే కత్తిలా గాలిలోకి విసురుతూ నృత్యం చెయ్యసాగింది.

                                                                                          సశేషం..

రౌడీ రాజయ్య(M.L.A) రాకెట్ ప్రయాణం..

బుధవారం-2 మార్చి,2011

అతను తెల్లగా,బొద్దుగా ఉంటాడు.

దోసకాయ లాంటి మొహం.

ఉన్నాయా,లేవా తెలియనట్టుండే చీకిరి కళ్ళు.ఆ చీకిరి కళ్ళను కప్పేస్తూ ఫెండీ చలువ కళ్లజోడు.

గుక్కీ బ్రాండ్ దుస్తులంటే మహా ఇష్టం.డెనిమ్ జీన్స్ అంటే మక్కువ ఎక్కువ. 

అతని పోర్టికోలో పదికి తక్కువ కాకుండా స్పోర్ట్స్ కార్లుంటాయి.వాటిలో అతనికిష్టమైనది మెక్ లారెన్ మెర్సిడెస్.

ఎక్కడికి వెళ్ళినా తన వెంట అర్మానీ బ్లాక్ కోడ్ పర్ఫ్యూమ్ బాటిల్ మర్చిపోకుండా వెంట తీసుకెళ్తాడు.

చెవులకి పోగులూ,చింపిరి జుట్టూ అతని స్టైల్. 

ఇంటి నించీ ఆఫీసు గది వరకూ ఏసీ లేకుండా అసలు రోజు గడవదు.

అతనే రాజ్ అలియాస్ రాజయ్య. 

చిన్నప్పుడు అతణ్ణి ఇంట్లో వాళ్ళు రాజిగా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవాళ్ళు.

పదిహేడేళ్ళ వరకూ చిల్లర తిరుగుళ్ళు తిరిగిన రాజి గాడి దశ ఒక రోజు తిరిగిపోయింది.

అధికార పక్షం M.L.A అయిన ఆగన్నని ప్రతిపక్షం వాళ్ళ చెప్పుల దాడి నించి అనుకోకుండా రక్షించి రాత్రికి రాత్రే ఆ నాయకుడి నమ్మిన బంటు అయిపోయాడు.

రెండేళ్ళు తిరిగే సరికి రాజి గాడు ఆగన్న రైట్ హ్యాండ్ అయిపోయాడు.ఎక్కడ రాళ్ళూ,చెప్పుల దాడి జరగాలన్నా రాజి గాడే.

అంతే కాకుండా ఆగన్నకి అడ్డు చెప్పిన వాళ్ళని లేపెయ్యడం,ఆగన్న ఫ్యాక్టరీల మీద సహాయ నిరాకరణోద్యమాలు చేసిన వాళ్ళని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం రాజి గాడి స్పెషల్ సిద్ధాంతాలు.

ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోవాల్సిన 21ఏళ్ళ వయసులో స్పెషల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇన్ రౌడీయిజం,గూండాయిజం పట్టా పుచ్చుకుని ధన్యుడైపోయాడు రాజి గాడు.

ఇలా ఉండగా సంవత్సరం తరవాత - 

తన ఒక్కగానొక్క చెల్లెలు అంజమ్మ అలియాస్ అంజని కి సైట్ కొట్టిన రాజి గాడి దౌర్జన్యం భరించలేక ఆగన్న అంజమ్మని తన దోస్తు M.L.A కొడుకు యెంకన్నకిచ్చి పెళ్ళి చెయ్యడంతో ఆగన్న మీద మెరుపు దాడి చేసి అతణ్ణి భూస్థాపితం చేసి M.L.A గా ఎదిగిపోయాడు.

M.L.A గా మారగానే తన పేరు రాజ్ గా మార్చేసుకున్నాడు.అన్నిటికన్నా బాగా ఆమ్యామ్యాలొచ్చే ఎక్సైజ్ శాఖని తన స్వంతం చేసుకుని 1000 బెల్టు షాపుల యజమానిగా పాతికేళ్ళకే బోలెడంత పేరు సంపాదించుకున్నాడు.

తనకి ఎలాగూ పొట్ట పొడిస్తే అక్షరమ్ముక్క రాదు కాబట్టి CIEFL లో ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకుని అమెరికా వెళ్ళి తిరిగొచ్చిన NRI హ్యారీ అనబడే హరిని ఒకానొక శుభోదయాన హైద్రాబాదులో కిడ్నాప్ చేసి తన పర్సనల్ అసిస్టెంటుగా నియమించుకున్నాడు.

తల్లిదండ్రులు,అక్కా-తమ్ముళ్ళు లేని హ్యారీ రాజ్ నెల నెలా ఇచ్చే 50,000 bucks కోసం అతని అసిస్టెంటుగా మారడానికి ఒప్పేసుకున్నాడు.

దానితో పాటు బోనస్ గా రాజ్ వాడే స్పోర్ట్స్ కార్లూ,పర్ఫ్యూమ్ బాటిల్సూ అప్పుడప్పుడూ సోదర ప్రేమతో హ్యారీ కూడా ఉపయోగించుకుంటుండేవాడు.

రాజ్ హ్యారీని ఈ విషయంలో ఏమీ అనకుండా చూసీ చూడనట్టుండేవాడు.హ్యారీ అంటే రాజ్ కి వల్లమాలిన అభిమానం.

హ్యారీ రాజ్ కి ఎన్నో విషయాలు నేర్పించాడు.అందులో ఈ స్టైల్ మెయింటెనెన్స్ కూడా ఒకటి.

హ్యారీ దగ్గరుండి రాజ్ కి అమెరికా లైఫ్ స్టైల్,టాటూలు వేసుకోవడం ఎలా? ఎలాంటి హెయిర్ స్టైల్ ఉంటే అమ్మాయిల హాట్ ఫేవరిట్ అవుతారు?

పోగులు ఎక్కడ పెట్టుకోవాలి? గడ్డం ఎలా పెంచాలి? గుబురు మీసాల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  ఇలాంటి విషయాలన్నీ నేర్పిస్తుండేవాడు.

హ్యారీ గాడు తనకింకో ఏడు సంవత్సరాల క్రితం దొరికుంటే అంజూ ని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో తెలిసేది కదా అని రాజ్ అప్పుడప్పుడూ విచారిస్తూ ఉంటాడు ఏకాంతంలో.

రెండేళ్ళు తిరిగే సరికి రాజ్ చెయ్యి వెయ్యని శాఖ లేదు ఆంధ్ర ప్రదేశ్ లో.

గనుల శాఖ నించీ బొగ్గు గనుల శాఖ దాకా విమానయాన శాఖ నించీ విద్యుత్ శాఖ దాకా,విద్యా శాఖ నించీ ఉద్యోగ శాఖ దాకా ఒక్కడే లీడర్ గా ఎదిగిపోయాడు.

హ్యారీ గోల్డెన్ లెగ్గు వల్లే తన ఆస్తి వెయ్యి రెట్లు,లక్ష రెట్లు,కోటి రెట్లు అయ్యిందన్న నమ్మకం బలంగా ఉండేది రాజ్ కి.

స్వీడన్ ఎయిర్ పోర్ట్, చెకింగ్ కౌంటర్    

రాజ్ స్పెషల్ సమ్మర్ హాలిడే గడిపి స్వీడన్ నించి తిరిగి వస్తుండగా ప్రమాద వశాత్తూ అతని పాస్ పోర్ట్ మరో రాజ్ అనబడే రాజేష్ పాస్ పోర్టుతో మారిపోయింది.

అది గమనించని రాజ్ మామూలుగానే హైద్రాబాద్ తిరిగొచ్చాడు.

అక్కణ్ణించీ రాజేష్ కష్టాలు మొదలయ్యాయి.

రాజేష్ వాళ్ళది మధ్య తరగతి కుటుంబం.

ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని రాజేష్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు.

విదేశాల్లో ఉద్యోగం సంపాదించి కనీసం ఒక నాలుగైదు కోట్లు వెనకేసుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని నమ్ముతాడు.

రాజేష్ అనే మూడక్షరాల పేరు ఇంగ్లీష్ వాళ్ళకి పలకడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పదో తరగతి సర్టిఫికెట్ నించీ తన పేరు రాజ్ గా మార్చుకున్నాడు దూర దృష్టితో.

M.S పూర్తి చేసి స్వీడన్ లో తన ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసమని వెళ్ళాడు.వస్తూ వస్తూ పాస్ పోర్టులు మారిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు.

ఇండియా రాగానే అ పాస్ పోర్టులో ఉన్న అడ్రస్,ఫోన్ నంబర్ల కోసం ఆచూకీ సేకరించాడు గానీ అవి బోగస్ అని తేలడంతో ఏమీ చెయ్యలేక పోలీస్ స్టేషన్లో తన పాస్ పోర్ట్ పోయిందని ఒక కంప్లెయింట్ రాసి ఇచ్చి తన ఇంటికి తిరిగొచ్చాడు.

పది వేల రూపాయల అమ్యామ్యా సమర్పించుకుంటే పాస్ పోర్ట్ వెతికిస్తామని చెప్పిన పోలీసులు అంతటితో ఆగకుండా రాజ్ దగ్గర చీటికీ మాటికీ ఏదోక వంకతో లక్షన్నర దాకా వసూలు చేసారు పాస్ పోర్ట్ ఇవ్వకపోగా.

అసలే మంచి ఉద్యోగం లేక, అటుపై  అప్పు చేసి స్వీడన్ వెళ్ళొచ్చిన భారంతో బాధ పడుతున్న రాజ్ నెత్తిన మూలిగే నక్కమీద తాటి పండు పడ్డ చందంగా ఈ లక్షన్నర కొత్త అప్పు తయారయి కూర్చుంది.

రాజి గాడి ఐరన్ లెగ్గు పుణ్యమా అని రాజేష్ బతుకు బందరు బస్ స్టాండ్ ఐపోయింది.

గుడ్డిలో మెల్లలా అప్పుడే ISRO లో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఖాళీలు వెయ్యడంతో ఏదో ఒకటిలే ఈ అప్పు తీర్చడానికి అనుకుని ఆప్లై చేసి పరీక్ష రాసి నెలకి పది వేల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకున్నాడు రాజేష్.

పేరుకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయినా రాకెట్లకి నట్లూ,బోల్టులూ బిగించే బాధ్యత రాజేష్ నెత్తిన పడింది.

“ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన నేను మెకానికల్ ఇంజనీర్లా  నట్లూ,బోల్టులూ బిగించాల్సి వస్తోంది.నా ఖర్మ!” అని తన స్నేహితుల దగ్గర వాపోయాడు రాజేష్.

“భారత దేశంలో మంచి చదువు చదివిన వాళ్ళకి ఇలాంటి ఉద్యోగాలే వస్తాయిరా! నువ్వేం బాధ పడకు,ఏదోక నాడు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది” అనునయించారు రాజేష్ స్నేహితులు.

ఆ మాటలతో ఊరట చెందిన రాజేష్ తన ఉద్యోగానికి అంకితమయ్యాడు.
———————————————————-

రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీస్, సికింద్రాబాద్

పది గంటలకి తన సీట్లో వచ్చి కూర్చుంది సారిక.

“అబ్బబ్బా,మనల్ని కనీసం కంప్యూటర్ ఆన్ కూడా చెయ్యనివ్వకుండా ఈ క్యాండేట్స్ అంతా అప్లికేషన్లతో వచ్చి పడతారు.విదేశాలకెళ్ళకపోతే ఏం కొంపలంటుకుపోతున్నాయని ఇక్కడ? కనీసం లిప్ స్టిక్ వేసుకుని,మేకప్ చేసుకునే టైమైనా ఇవ్వరు కదా – ఏమంటావే సరూ?” అడిగింది పక్క సీట్లో
కూర్చునే దేవి.

“హహ్హహ్హా..” పెద్దగా నవ్వింది సారిక.

సీనియర్ ఆఫీసర్ చురచురా చూసాడు సారిక వంక,”ఆఫీసంతా వినిపించేలా బిగ్గరగా ఏమిటా నవ్వు? ముందు పని కానివ్వు”

“అదే కదండీ ఇప్పుడు చేస్తున్నది,కనీసం నవ్వడానిక్కూడా మాకు హక్కు లేదా?” కాస్త గట్టిగా అడిగింది.

“ఎందుకు లేదమ్మా,ఈ నెల టార్గెట్ పది వేల పాస్ పోర్టులు.అదైపోయాక తీరిగ్గా నవ్వుదువు గానీ,ఎవరు వద్దన్నారు?”

“ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ ముసలాడికి? ఒక డొక్కు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చాం కదా అని ముక్కు పిండి మరీ పని చెయ్యిస్తున్నారు” తిట్టుకుంటూ కంప్యూటర్లో తల దూర్చింది సారిక.

సంవత్సరం ఉద్యోగం తరవాత మళ్ళీ కొత్త పాస్ పోర్ట్ కోసం అప్లై చేసుకున్నాడు రాజేష్.

“కనీసం దుబాయ్ పెట్రోల్ బంకులో పెట్రోల్ బాయ్ గా చేరినా అప్పులు రెండేళ్ళలో తీరిపోతాయి.ఈ నట్లూ,బోల్టులూ బిగించుకోవడం కన్నా అదే నయం” అని.

*                 *                  *                   *                     *

“ఏమిటయ్యా ఈ అప్లికేషన్,ఇలాగేనా నింపేది? ఊపుకుంటూ పాస్ పోర్టుల కోసం వచ్చేస్తారు.ఎవడయ్యా నిన్ను లోపలికి పంపించింది?” అరుస్తున్నాడు సీనియర్ ఆఫీసర్.

“మొదలయ్యింది ముసలాడి గోల” గొణిగింది దేవి.

“ఊరుకోవే,విన్నాడంటే నీ టార్గెట్ పెంచేస్తాడు.పొద్దున్నే ఫైర్ మీద ఉన్నాడు” మందలించింది సారిక.

*                 *                *                  *                   *

లైన్లో నిలబడ్డ రాజేష్ అరుస్తున్న ముసలి ఆఫీసర్ వంక చూసాడు.

——————————————————–

“ఏమిటిది? అడ్రస్ లేదూ,ఎడ్యుకేషన్ డిటెయిల్స్ లేవూ,ఫోన్ నంబర్ లేదూ..ఈ చెత్త ఫామొకటి తీసుకొచ్చి పాస్ పోర్ట్ ఇవ్వమంటే ఎక్కణ్ణించి ఇష్యూ చెయ్యాలనుకున్నావు?గాల్లోంచి పాస్ పోర్ట్ ఊడి పడుతుందా??” క్లాస్ పీకుతున్నాడు ఆఫీసర్.

అతనికెదురుగా ఒక 23-24 ఏళ్ళ అబ్బాయి నిలబడి ఉన్నాడు.

“నాకేం తెలీదు సార్,గేటు దగ్గర ఏజెంట్ నా దగ్గర 2500 తీసుకుని పాస్ పోర్ట్ ఇప్పిస్తా అని చెప్పి లోపలికి పంపించాడు” చెప్పాడా అబ్బాయి.

“ఆహా! ఐతే ఈ అప్లికేషన్ మొత్తం నింపి పట్టుకురా.ఆ తరవాత నాకింకో 10 వేలివ్వు,నీ పాస్ పోర్ట్ తయారు చేసి ఇస్తాను.వాడు చెప్తాడూ,వీడు వస్తాడూ..” ఫామ్ ని ఆ పిల్లాడి మీదికి విసిరేస్తూ అన్నాడు ఆఫీసర్.

“పెద్ద వీడొక్కడే భారతీయుడు రేంజులో ఆ ఫోజు చూడు” సారికకి వినిపించేలా మంద్రంగా అంది దేవి.

చిరు నవ్వొకటి విసిరేసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది సారిక.

రాజ్ కంటే ముందు ఇంకో పాతిక మంది దాకా లైన్లో నిలబడి ఉన్నారు.

వచ్చిన ప్రతి అప్లికెంటు మీదా చిర్రు బుర్రులాడుతునే ఉన్నాడు ఆఫీసర్.ఒక పది అప్లికేషన్ ఫాముల దాకా విసిరేసాడు అప్పటికే.

పదకొండు అవ్వగానే టీ బ్రేక్ అని లేచి వెళ్ళిపోయాడు ఆఫీసర్.

“ఇంట్లో పెళ్ళాం టిఫిన్ పెట్టినట్టు లేదు.ఆ కోపమంతా వీళ్ళ మీద ప్రదర్శిస్తున్నాడు” అనుకుంది సారిక.

గంట సేపటి తరవాత తిరిగొచ్చాడు.అప్పటికే అక్కడ నిలబడి ఉన్న వాళ్ళ కాళ్ళు పీక్కు పోతున్నాయి.

ముందు రోజు రాత్రి నించీ చాపలూ,దిండ్లతో వచ్చి అక్కడే పడుకుని తెల్లారగానే లైన్ లో నిల్చున్న వాళ్ళున్నారు వాళ్ళలో. రాజ్ ది కూడా అదే పరిస్థితి.

ఇంకో ఐదు అప్లికేషన్ ఫాములు విసిరేసిన ఆఫీసర్ మళ్ళీ లంచ్ బ్రేక్ అని బైటికెళ్ళాడు.

కోపం నషాళానికంటింది రాజేష్ కి.

తిన్నగా సారిక సీట్ దగ్గరికి వచ్చాడు.”ఈ ముసలోడు ఎప్పుడొస్తాడు లంచ్ బ్రేక్ నించి?” విసురుగా అడిగాడు.

తలెత్తి చూసింది సారిక.

“ఏమోనండీ,అది అతని మూడ్ ని బట్టి ఉంటుంది.”

“చింపెయ్యడం,విసిరెయ్యడం తప్పించి వేరే పనేమీ ఉన్నట్టు కనిపించట్లేదు.ఇతనికి పాస్ పోర్ట్ ఇచ్చే మూడెప్పుడొస్తుంది ఇలా ఐతే?

నిన్న రాత్రి నించీ లైన్లో నిల్చున్నాం.కళ్ళు తిరిగిపోతున్నాయి,గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నాయి.టీ కోసమే గంట సేపు వెళ్ళాడు.వీడి లంచ్ అయ్యే వరకూ ఇంకెన్ని గంటలు నిల్చోవాలి?” నిలదీసాడు రాజ్.

“చూడండి మిస్టర్,మీరు బాగా కోపంలో ఉన్నారు కదా! ఈ కోపంలోనే అతణ్ణి నాలుగు కడిగెయ్యండి. ఇక్కడ చూడండి కనీసం 300 మంది ఉన్నారు లైన్లో.వీళ్లందరి అప్లికేషన్లూ నేను ప్రాసెస్ చెయ్యాలి.” సమాధానమిచ్చింది సారిక.

“వాణ్ణెలాగూ కడిగేస్తాను. పోయిన సారి కూడా ఇలాగే గంటలు గంటలు నిల్చోబెట్టి మూడు నెల్ల తరవాత పాస్ పోర్ట్ ఇచ్చారు.అతణ్ణొక్కణ్ణి కాదు మీ అందరినీ నిలబెట్టి కడిగెయ్యాలి” అన్నాడు రాజేష్.

“అయ్యయ్యో,మమ్మల్నందర్నీ వద్దండీ! అంతటికీ అతనే కారణం” అఫీసర్ సీటు వంక చూపించింది సారిక.

“అవునవును” వంత పాడారు లైన్లో నిల్చున్న వాళ్ళు.వాళ్ళకి మహా ఆనందంగా ఉంది ఇలా ఒకబ్బాయి వెళ్ళి వాళ్ళని అరుస్తున్నందుకు.

రెండు గంటల తరవాత తిరిగొచ్చాడు ఆఫీసర్.

ఇంకో ఐదు మంది అప్లికేషన్లు విసిరేసాడు.

*                 *                   *                    *                    *

రాజేష్ వంతు వచ్చింది.

అప్లికేషన్ ఫామ్ అతనికివ్వకుండా గడకర్రలా నిల్చున్నాడు రాజ్.

“అప్లికేషన్ ఫామ్” తన కళ్ళ జోడు సవరించుకుంటూ అడిగాడు ఆఫీసర్.

“ఎందుకూ,నువ్వెలాగూ విసిరేస్తావు కదా!” అన్నాడు రాజ్.

“ఏమిటయ్యా నీ ఉద్దేశ్యం?”

“నువ్వు పొద్దుణ్ణించీ విసిరెయ్యకుండా,చించెయ్యకుండా వదిలేసిన అప్లికేషన్ ఫాములెన్నో చెప్పు పోనీ?” ముందుకి వంగి ఆఫీసర్ కళ్ళలో కళ్ళు పెట్టి అడిగాడు రాజ్.

“మిస్టర్,యూ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్” అరిచాడు ఆఫీసర్.

“యూ హావ్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్” ముందుకి వంగి ఆఫీసర్ దగ్గర మోగుతున్న సెల్ ఫోన్ లాక్కున్నాడు రాజ్.

“మర్యాదగా చెప్తే వినర్రా మీరూ..” లేచి నిలబడ్డాడు ఆఫీసర్.

వెంటనే రాజ్ వెనక్కి తిరిగి చూసాడు.లైన్లో నిలబడ్డ వాళ్ళంతా ఒక్క సారిగా ముందుకొచ్చి ఆఫీసర్ని చితగ్గొట్టారు.

అనుకోని ఈ సంఘటనకి భయంతో వాళ్ళు నిల్చున్న వైపు చూసింది సారిక.

“గదిలో పెట్టి కొడితే పిల్లి ఐనా ఇంతేనమ్మా” అన్నాడు వాళ్ళలో ఒకడు.

గది తలుపులు మూసేసాడు రాజేష్.

“ఎక్కడికి పారిపోతావురా? ఈ రోజు వీళ్ళందరి పాస్ పోర్టులూ ప్రాసెస్ చేసే వరకూ నిన్నీ గదిలోంచి బైటికి వెళ్ళనివ్వను” ఆఫీసర్ పక్కనే ఇంకో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.

మొదట్లో కాస్త భయపడ్డా ఆఫీసర్ చినిగిపోయిన షర్టూ,దేభ్యం మొహమూ చూసి నవ్వు ముంచుకొచ్చేసింది సారికకి.

“భలే ఉన్నాడు ఈ అవతారంలో,వీడి తిక్క ఇవాళ్టికి కుదిరింది” అని సంబరపడిపోయింది.

తన సెల్ ఫోన్ తో చడీ చప్పుడూ లేకుండా ఆఫీసర్ ని ఒక ఫోటో కూడా తీసుకుంది. “అచ్చూ అడుక్కు తినే వాళ్ళా ఉన్నాడు,వీడికిప్పుడు జోలె ఒకటే తక్కువైంది” అనుకుంటూ..

సారిక ఫోటో తియ్యడం రాజ్ చూసాడు.

దేవి,సారిక ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు ఆఫీసర్ని చూసి.అదంతా గమనిస్తూనే ఉన్నాడు రాజ్.

ఆఫీసర్ మొత్తుకుంటూ తిట్టుకుంటూ తన ఎదురుగా లైన్లో నిల్చున్న వాళ్ళందరి అప్లికేషన్లూ తీసుకుని కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నాడు.

“మరి నా అప్లికేషనెవరు చేస్తారు,మీ తాతయ్యా? ఊపుకుంటూ ఆఫీసులకొచ్చేస్తారు.పబ్లిక్ సర్వెంట్ అని బోర్డ్ తగిలించుకుంటే కాదు.పబ్లిక్ కి సర్వీస్ చెయ్యాలి” ఆఫీసర్ని ఉరిమాడు రాజ్.

“చేస్తానయ్యా బాబూ,ఆగు.చేస్తాను.చెయ్యకపోతే చస్తాను” భయం భయంగా చూసాడు ఆఫీసర్.

“తియ్ అప్లికేషన్ ఫామ్.ఆన్-లైన్.నేను డిటెయిల్స్ చెప్తానూ,అది నింపు”  డిమాండ్ చేసాడు రాజ్.

గత్యంతరం లేక అప్లికేషన్ ఫామ్ తీసాడు ఆఫీసర్.

రాజ్ డిటెయిల్స్ చెప్తుంటే అతను ఫామ్ నింపుతున్నాడు.

“రీ-అప్లై.నా పాస్ పోర్ట్ పోయింది.కొత్తది కావాలి” చెప్పాడు రాజ్.

వివరాలు నింపడం పూర్తైపోయింది.

“సార్,నేనింక ఇంటికి వెళ్ళొచ్చా?” దీనంగా అడిగాడు ఆఫీసర్.

“ఏమిటి వెళ్ళేది? నా పాస్ పోర్ట్ నా చేతిలో పెట్టే వరకూ నిన్ను వదిలేది లేదు”

“వారం రోజులు పడ్తుంది సార్”

“నాకు ఇవాళే,ఇప్పుడే కావాలి” ఆర్డర్ వేసాడు రాజ్.

“సార్,మీ పాత పాస్ పోర్ట్ ఇంకా యాక్టివ్ స్టేజ్ లోనే ఉంది.అది సబ్మిట్ చేస్తే గానీ కొత్తది ఉపయోగించడానికి  వీల్లేదు.అదెక్కడుందో ట్రేస్ చేసే టైమైనా మీరు మాకివ్వాలి కదా!” కనీసం రెండు రోజుల టైమ్ కావాలి.అన్నాడు ఆఫీసర్.

అతను చెప్పింది సబబు గానే అనిపించింది రాజ్ కి.

“సరే ఐతే,ఏడువ్” అతణ్ణి వదిలి పెట్టాడు.

రాజ్ గది బైటికి వెళ్ళగానే సారిక పరిగెత్తుకుంటూ అతనికోసం బైటికి వచ్చింది.

“ఎక్స్ క్యూజ్ మీ,మిమ్మల్నే మిస్టర్ బ్లాక్ టీ-షర్ట్!” పిలిచింది సారిక.

“యా..” వెనక్కి తిరిగి చూసాడు రాజ్.

“ఆ ముసలోడికి బలే కోటింగ్ ఇచ్చారు.మీ పేరు రాజ్ అనుకుంటాను కదూ,డిటెయిల్స్ నింపిస్తున్నప్పుడు విన్నాను.

చాలా థాంక్స్ అండీ,సంవత్సరం నించీ వాడు నాకు ఒక్క లీవు కూడా ఇవ్వకుండా ఏడిపించుకు తింటున్నాడు.ఇవాళ మీరిచ్చిన కోటింగుకి తిక్క కుదిరింది వెధవకి.

చినిగిపోయిన షర్టుతో వాణ్ణసలు ఫోటో తియ్యకుండా ఉండలేకపోయాను.

ఈ ఫోటో మా ఇంట్లో వాళ్ళందరికీ చూపించి నేను పార్టీ చేసుకుంటాను.మీరేమీ అనుకోనంటే..మీ ఫోటో ఒకటి తీసుకోవచ్చా?” అడిగింది సారిక.

“ఆఫీసర్ని తన్ని ఫామ్ నింపించిన అబ్బాయి అని మీ ఇంట్లో వాళ్ళకి చూపించి ఇంకో పార్టీ చేసుకుంటారా?” అడిగాడు రాజ్.

“బలే క్యాచ్ చేసారే?” అమాయకంగా చూసింది సారిక.

మొదటి సారి సారిక ఎందుకో నచ్చేసింది రాజ్ కి.

“అందరితో ఇలాగే మాట్లాడతారా?” అడిగాడు.

“లేదు.మీతోనే ఇలా వాగేసాను.సంవత్సరం నించీ వాడు ఏడిపించేస్తున్నాడు కదా,అందుకూ..వాడి మీద కోపం” చెప్పింది సారిక.

చిరు నవ్వు నవ్వేసి అక్కణ్ణించి వేగంగా వెళ్ళిపోయాడు రాజేష్.

“అయ్యో,నా ఫోటోకి పోజివ్వకుండానే వెళ్ళిపోయాడు.పేద్ద పోజు..దుర్మార్గుడు” తిట్టుకుంది సారిక.

రెండు రోజుల తరవాత రాజ్ కి ఫోన్ వచ్చింది.తన వంతు కోసం ఎదురు చూస్తున్నాడు ఆఫీసర్.

“సార్! మీ పాత పాస్ పోర్ట్ ట్రేస్ అవ్వట్లేదు,అర్జంటుగా మీరొక సారి పాస్ పోర్ట్ ఆఫీసుకి రావాలి” చెప్పాడు.

పాస్ పోర్ట్ ఆఫీసులో మళ్ళీ అడుగు పెట్టాడు రాజ్.

వెనుక నించి ఎవరిదో చెయ్యి తన భుజమ్మీద పడటంతో ఆశ్చర్యానికి లోనై తిరిగి చూసాడు.

“ఇష్..ఇలా రండి” పక్కకి తీసుకెళ్ళింది సారిక.

“హమ్మయ్యా,కనిపించారా! ఇందాకణ్ణించీ మీ కోసమే వెతుకుతున్నాను.మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళకండి”

దేనికన్నట్టు కనుబొమలు ఎగరేసాడు రాజ్.

“మొన్న మీరు వాడి భరతం పట్టారు కదా.రివెంజ్” చెప్పింది సారిక.

“నీకెలా తెలుసు?”

“వాడు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను.అందుకే మీకు వార్నింగ్ ఇద్దామని ఇందాకటి నించీ వెతుకుతున్నాను.”

“ఏం మాట్లాడాడు?”

“వేసెయ్యండ్రా వాణ్ణి” అన్నాడు.

“ఓ.. ఐ సీ”

“వద్దంటుంటే మళ్ళీ ఆఫీసులోకే వెళ్తారేం?” 

“సరే వెళ్ళను ఐతే,నా పాస్ పోర్ట్ నువ్వు ఇస్తావా మరి?” అడిగాడు రాజ్.

“చూసి చెప్తాను.మీ పాస్ పోర్ట్ కాస్త సమస్యగానే మారేట్టుంది”

“ఏం?”

“ఎవడో మీ పాస్ పోర్ట్ ఉపయోగించుకుంటున్నాడు.వాడు దొరకడం లేదు.వాడిచ్చిన డిటెయిల్స్ అన్నీ తప్పుడువే” చెప్పింది సారిక.

“ఇప్పుడు తెలిసిందా నేనెందుకు మళ్ళీ అప్లై చేసానో?”
 
“ఊ..”

*                *                   *                    *                     *

రాజ్ అడపా దడపా సారికని కలుసుకోవడానికి వెళ్తున్నాడు.

రెండు సార్లు తనని ఔటింగ్ కి తీసుకెళ్ళాడు.ఒక సారి తన నట్లు,బోల్టుల విభాగానిక్కూడా తీసుకొచ్చాడు.

సారిక మరీ అంత ఆధునికంగా లేకపోయినా నిండైన చుడీదార్లలో పద్ధతిగా ఉంటుంది.మెరుపు తీగలా లేకపోయినా అందంగానే ఉంటుంది.

రాజేష్ కూడా అంతే.మంచి పొడగరి.ఎత్తుకు తగ్గట్లు మీడియం పర్సనాలిటీ.మరీ సన్నగా ఉండడు,అలాగని లావుగా కూడా ఉండడు.

ఉన్నట్టుండి ఒక రోజు-

హ్యారీ అలియాస్ హరి వాల్డ్ కప్ మ్యాచుల కోసం ఛానల్స్ మారుస్తూ అనుకోకుండా ఒక ప్రోగ్రాం హెడ్ లైన్ చూసి ఆగిపోయాడు.టీవీని కన్నార్పకుండా తదేకంగా చూస్తున్నాడు.

*                *                 *                    *                   *

అంగారకుడి మీద ఫ్లాట్స్ కొన్న బిలియనీర్లని ఇంటర్వ్యూ చేసి చూపిస్తున్న కార్యక్రమం అది.అమెరికాలో ఉన్న ఐదుగురు కోటీశ్వరులు అంగారకుడి మీద ఇంటి స్థలాలు కొన్నారు.

ఇంటర్వ్యూ చేస్తున్న అతను వాళ్ళని వివరాలు అడుగుతున్నాడు.

“అంగారకుడి మీద స్థలాలు కొనడం ఎలా సాధ్య పడింది?”

వచ్చే సంవత్సరం డిసెంబర్లో డూమ్స్ డే రాబోతోంది.ఈ లోపే అమెరికా లోని కొందరుమేధావులు అంగారకుడి మీదకి వెళ్ళే రాకెట్ ఒకదాన్ని తయారు చేసారు.అలాంటి రాకెట్లు ఇంకొన్నిటిని ప్రయోగ పూర్వకంగా తయారు చెయ్యబోతున్నారు.దాని ద్వారా అంగారకుడి మీదకి వెళ్ళడం సాధ్యమే.

చంద్రుడి మీద స్థలాలు కొన్నా అక్కడ జీవం నివసించడానికి చాలా కష్టం.అదే అంగారకుడి మీద నీటి జాడలున్నాయి.అక్కడ జీవం బ్రతికి బైటపడే ఛాన్సులు ఎక్కువ.

అందుకే మేం అంగారకుడి మీద ప్లాట్లు తీసుకున్నాం.

వావ్,మీ దూర దృష్టికి నేనెంతో ఆశ్చర్య పడుతున్నాను.మరి మీరు అంగారకుడి మీదకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారు?

నాసా వాళ్ళు.

వాళ్ళు ఆల్రెడీ ఒక రాకెట్ తయారు చేసారు.ముందు ఒక మనిషిని 2011 నవంబర్ లోగా అంగారకుడి మీదకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.అది గానీ సక్సెస్ అవుతే మేము కూడా అంగారక యాత్ర చేసే వీలుంటుంది.

రాకెట్లో ఎక్కి అంగారకుడి మీదకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుని ఉండటమే!

ఈ రాకెట్ ప్రయాణం ఎంత ఖరీదుంటుంది?

సింపుల్ గా చెప్పాలంటే మా లాంటి కోటీశ్వరుల వల్లే అవుతుంది.అందరూ ఇలాంటి రాకెట్లలో ప్రయాణం చెయ్యలేరు.దీనికి ఎంత లేదన్నా ఒక లక్ష కోట్ల  డాలర్లు ఖర్చవుతుంది.

చూసారు కదా వ్యూయర్స్, ఇప్పుడు అంగారకుడి గురించి మరిన్ని వివరాలు తెల్సుకుందాం. అంగారకుడి మీద యేయే స్థలాల్లో ప్లాట్లు విక్రయిస్తున్నారో కూడా తెలుసుకుందాం!

ఆ తరవాత –

అంగారకుడి మీద జీవం నివసించడానికి అనువుగా ఉండే ప్రాంతాలు,నీటి జాడలున్న ప్రాంతాలు జూమ్ చేసి చూపిస్తున్నాడు రిపోర్టర్.అంగారకుడి చరిత్ర మొత్తం చూపించాడు.

తరవాత అంగారకుడి మీదికి పంపించబోయే రాకెట్,దాని గురించిన వివరాలు చూపించడం మొదలెట్టాడు.

తదేకంగా ఆ రాకెట్ ని చూస్తున్న హ్యారీ ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు ఛానల్ మారిపోవడంతో.

“ఏంది తమ్ముడూ,అట్ట కన్నార్పకుండా యేంది జూస్తన్నావూ? ఆ ముష్టి రాకెట్టా? వాల్డ్ కప్పులో సచిన్ ఇరగదీసేస్తున్నాడు.ఆ బ్యాటింగ్ చూద్దామంటే లేకుండా పోతుండె,ఎట్టాగబ్బా?” అడిగాడు రాజ్. 

“అ-దీ ముష్-టి   రా-కె-ట్   కా-దూ  డూడ్,సూ-ప్ప-ర్  రాకెట్. ఆ   రా-కె-ట్-లో  ఎ-క్కూ-తే మార్స్  మి-దా-కి   తీస్-కెల్తున్-ది    టె-ల్సా?” కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు హ్యారీ.

“ముష్షా,బుష్షా? ఎట్టెట్టా? మళ్ళీ జెప్పు” అడిగాడు రాజ్.

“ఆ  ప్రోగ్-రామ్   మ-ల్లీ   పెడ్-టే   చెప్-టా  అన్ని-య్యా!” మారాం చేసాడు హ్యారీ.

“అట్టాగే గానియ్” ఇందాకటి ఛానల్ మళ్ళీ పెట్టాడు రాజ్.

“ఈప్-డూ  ఈ  రాకెట్  ఉన్-ది   క-దా ? ఇదీ  స్సో  కాస్ట్-లీ  రాకెట్,ఇ-దీ  ఎక్-తే  మార్స్  అన్-టే  టెల్గూ లో అన్-గా-రక్-డూ  అక్-డి-కీ   టీస్-కెల్-తున్-ది.

వీ-లన్-తా మల్టీ బిలియనీర్స్. అన్-గా-రక్-డూ  మీ-ద  ప్లాట్స్  కొను-క్కు-నారూ” ముక్కలు ముక్కలు చేసిన తెలుగులో ఇంగ్లీష్ మిక్స్ చేసి మిడికాడు హ్యారీ.

“అట్టాగా? వీళ్ళంతా ఆ గెహం మీద ప్లాట్లు గొనీ ఏం జేస్తారూ?”

“అక్-డే  ఉంటారూ.ఎన్-దూ-కన్-టే  డూమ్స్ డే   వ-చేస్-టున్-దీ   క-దా  డూడ్!”

“ఓర్నీ నీకు బుర్ర దొబ్బేసింది.వేలంటైన్ డే ఉంటాది గానీ  ఈ డూమ్సుడే యేంది?”

“అయ్యో  అన్ని-యా  నీ-కూ  డూమ్స్ డే   టె-లీ-దా?

ఆ  డే  రో-జూ  భూమి మో-త్తం  మున్-గీ   పో-టున్-ది.”

“ఎట్టెట్టా? ఎవురు జెప్నారు నీకూ?”

“అమే-రికా  మో-త్తం అందర్-కీ  టెల్సూ,అందుకే ఈ రాకెట్  చేస్-టూ-నారు.ఇండ్-యా లో  కూ-డా   చా-లా  మంద్-కీ  టెల్సూ.”

“మరి నాకెందుకు జెప్పలా?”

“ను-వ్  అడ్-కో-లేదు  కదా  అన్ని-యా!”

“అడుక్కోవడం కాదురా నీ తస్సాదియ్య,అడగలేదు అనాల – సర్నా?”

“ఓ..యా”

“అట్టాగా,ఈ రాకెట్టోళ్ళు యాడుంటారు? నాకీ ఇసయం ఇప్పుడే తేలిపోవాల”

“ఇస్-రో అనీ  ఇండ్-యా లో  ఒక  పే-ద  కంప్-నీ ఉంది.అక్-డా   ఉన్-టా-రు.”

“పేద కంపెనీ రాకెట్ ఎట్టా జేస్తందిరా నీ దుంపదెగ?”

“పేద  కంప్-నీ  కాదు  అన్ని-యా  ఐ  మీన్  బిగ్  కంప్-నీ”

“పెద్ద కంపనీ కొచ్చిన తిప్పలా ఇయ్యి? నీ దుంప దెగ.నువ్వు మాట్టాడుతంటే కొన్ని కొన్ని అర్థమే గావురా.నేను గాబట్టి ఇట్టా అర్థం చేసేసుకుంటన్నాను.బండి తియ్యి. ఆ కంప్నీ యేందో ఓ పాలి జూసొస్తే పోలా?”

“ఆ,మర్సినాను.మన తెల్ల గుర్రం మెక్కులారీ ఉండాదే (మెక్ లారెన్).ఆ బండి దియ్యి.200 మీన జామ్మున పోతాది.

ఓ హ్యారీ,నేనోపాలి ఆ కోడు(అర్మానీ బ్లాక్ కోడ్) సెంటు గొట్టుకునొస్తానబ్బాయో అందాకా ఆగు.ఆ పెంటి(ఫెండీ) కళ్ళ జోడెట్టుకోవాల.అట్నేనా?”      

“ఓ-కే  అన్ని-యా!” పోర్టికోలోని మెక్ లారెన్ బైటికి తీసాడు హ్యారీ.

*                *                   *                     *                    *

ముందో పది సెక్యూరిటీ కార్లూ,వెనకో పది సెక్యూరిటీ కార్లూ వెంట వస్తుండగా తెలుపు రంగు మెక్ లారెన్ మెర్సిడెస్ కారులో ఇస్రో రాకెట్టోళ్ళని కలుసుకోవడానికి బైలుదేరాడు రాజ్.

యథావిధిగా ఆ రోజు కొత్త రాకెట్ కి నట్లూ,బోల్టులూ బిగిస్తున్నాడు రాజేష్ (రాజ్-2).

8 గంటల ప్రయాణం తరవాత రాజ్-1 కారు ఇస్రో ఆఫీసు వెనకున్న లాంచింగ్ ప్యాడ్ దగ్గర ఆగింది.

అరుణాచలం సినిమాలో లాగా అన్ని కార్లు వచ్చి ఆగాయేమిటా అని ఆశ్చర్యపోయాడు రాజ్-2.

పువ్వులాంటి గుక్కీ సూటు వేసుకున్న నిరక్షర కుక్షి రాజ్-1 కారు దిగి తన ఫెండీ కళ్ళజోడు సరి చేసుకుని హ్యారీని వెంట తీసుకుని ఇస్రో ఆఫీసులో అడుగు పెట్టాడు.

“యవుర్రా ఈ కంప్నీ యెడ్డూ?” వాకబు చేసాడు రాజ్-1.

అక్కడ ఎవ్వరికీ తెలుగు రాకపోవడంతో రాజ్-1 కి ఎవరూ సమాధానం చెప్పలేదు.

“వోర్నీ,వీళ్ళకు మనవెవరో తెలిసినట్లేదు.హ్యారీ,యీళ్ళ కతేందో నువ్వోపాలి సూసి సెప్పూ”

“ఈ   కంప్-నీ   హె-డ్   ఇక్-డా   ఉన్-డ-డనీ   చెప్-టు-నారు   అన్ని-యా.”

“యాడుంటాడు మరి?”

“ఆయ్-నా  ఈ కంట్రీలో లే-డు.యే-దో  మీటింగ్  కో-సం  వే-రే  కంట్రీ   వె-లా-డూ” చెప్పాడు హ్యారీ.

“మరి మనకెవరు జెప్తారు ఆ మార్సు రాకెట్టు గురించి.ఈణ్ణి కిడ్నాప్ జేసి మన కారులో అట్టుకెళ్ళిపోదాం.ఆడే జెప్తాడు ఆడ్సిగదరగ”

*                 *                   *                    *                    *

వీళ్ళెవరో తనని ఎందుకు కిడ్నాప్ చేసి తీస్కెళ్తున్నారో అతనికేం అర్థం కాలేదు ఓ పట్టాన.సైంటిస్టు దిక్కు తోచక మూర్ఛపోయాడు.

సైంటిస్టుని ఒక రూములో బంధించి మొహమ్మీద నీళ్ళు చిలకరించాడు రాజ్.

కళ్ళు తెరిచి చూసిన సైంటిస్ట్ గాభరా పడ్డాడు.

“ఎన్నప్పా,చెన్న బసప్పా..నీ బారప్పా,నాన్ కిడ్నాప్  హోగిద్దారే”" కన్నడలో దేవుణ్ణి స్మరిస్తున్నాడు.

“వోర్నీ,యిప్పుడు గానీ నేనడిగిందానికి జవాబు సెప్పనేదూ,ఈ కోడి పిల్ల పీకట్టుకుని పిసికీసినట్టు నీ పీకట్టుకు పిసికేస్తా” ఎదురుగా ఉన్న కోడి పిల్ల పీక మీద కత్తి పెట్టాడు రాజ్.

ఆ సైంటిస్టుకి ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ వివరించాడు హ్యారీ.

“డిస్ గై ఈజ్ గోయింగ్ టూ స్మాష్ యువర్ హెడ్ లైక్ డట్ ఆఫ్ ద చిక్, క్రాప్.. ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ ద క్వెశ్చన్”

వణికిపోయాడు సైంటిస్ట్ . 

“ఓ.కే,ఓ.కే” వణుకుతూనే చెప్పాడు.

“డూమ్సు డే యెప్పుడొస్తాది?” అడిగాడు రాజ్.

ట్రాన్స్ లేషన్ చేస్తున్నాడు హ్యారీ.

“డిసెంబర్ 21,2012″

“బూవి నిజంగా మునిగిపోతుండాదా?”

“అవును”

“దాంతర్వాత ఏటవుద్ది?” 

“ఒక మీటియర్  వొ-చ్చీ  ఎర్త్  మీ-దా  పడ్-టున్-దీ.అప్-డూ ఎర్త్  చచ్చీ-పో-టున్-ది.”

“వోరి దీన్సిగదరగ,నాను పదేళ్ళ నించీ సంపాదిత్తాంది ఇంకో సంవత్సరంలో పోగొట్టీసుకోటాన్కా? నానూ ఆ మార్సుమీద ప్లాట్ కొనేసుకుని యెల్లిపోవాల! అమెరికా వోడు రాకెట్టు సేసీసినాడు.నాను కూడా అట్టాంటి రాకెట్టు యెక్కి మార్సు మీదకెల్లాల.ఆ రాకెట్టు యవుడు జేత్తాడు?”

“యూ,నువ్ జస్ట్  గలీ-లీడర్.

బుల్ షిట్,నీ  దగ్-రా అంత  డబ్బ్-లూ   యక్-డీ   నిన్-చీ  వ-స్తా-యి?

ఈ క్వశ్చిన్ నీ-ను కాదు అన్ని-యా.. వీ-డూ  అడు-కున్-టు-నాడూ.”

“ఇంకో పాలి ఆడు పెశ్నలడిగీడంటే ఆడి పీకెగిరిపోతాది.అడగాల్సింది నాను,ఆడు కాదు.

నాను ఏపీ వొక సోటే లీడర్ అనుకుంటన్నాడు సన్నాసి.ఇంకో ఆరు నెలల్లో పెయిమ్ మినిట్టర్నైపోతన్నా అని ఈడికి తెలీట్నేదు.”

“అ-లాన్-టి  రా-కెట్-లు  అమే-రికా  వా-లే   చే-స్టా-రు  అని  చెప్-టు-నా-డు  అన్ని-యా.”

“అట్నా,ఆ అమెరికా వోణ్ణే లేపేసి అట్టుకొచ్చెయ్యాల.నువ్ రేపే అమెరికా యెల్లాల హ్యారీ.యేంది? నాను ఈణ్ణెట్టా లేపుకొచ్చినానో అట్నే ఆ తెల్ల దొర రాకెట్టోణ్ణి నువ్వు లేపుకొచ్చీయ్యాల.నాను రాకెట్టెక్కాల. మార్సు మీద ఇల్లు కట్టుకోవాల.ఆణ్ణే  పెదాన మంత్రి కుర్సీ యెక్కి కూకోవాల.”

హ్యారీకి అమెరికా టికెట్లు బుక్ చేసేసాడు రాజ్.

“అన్ని-యా.. టె-ల్లా  డో-రా  రాకెట్  సైంటిస్ట్ ని  లే-పు-కొచ్చే-డం  అంత  ఈజీ  కా-దూ  అన్ని-యా!”

“అదంతా నాకు తెలవదు.ఎట్ట జేస్తావో యేందో.నా అట్టెంట్లిద్దర్ని నీతో పాటు పంపిత్తన్నా.ఆణ్ణి లేపి ఈడకట్టుకురావాల.

పో..ఇన్ని రోజుల కాణ్ణించీ నా దెగ్గిర పన్జేసి  ఇంతేనా అబ్బాయా నువు నేర్సుకుండాది?”

“వీడు ఇంత మొండోడని నాకు తెలీదే” వాపోయాడు హ్యారీ.

ఇంక చేసేదేమీ లేక తెల్ల దొర రాకెట్ సైంటిస్టుని కిడ్నాప్ చేసి తీసుకు రావడం కోసం పథకం సిద్ధం చేసాడు.

——————————————————

నల్ల మాస్క్ వేసుకుని నాసా ఆఫీసులో నకిలీ కోడ్ తో చొరబడ్డాడు హ్యారీ.

అందర్లోకీ పెద్ద తలకాయ రాకెట్ డివిజన్ హెడ్ ని టార్గెట్ చేసాడు.

అసిస్టెంట్లిద్దరికీ ట్రాంక్విలైజర్లు ఒక గన్నులో పెట్టి ఇచ్చాడు.

హెడ్ సింగిల్ గా కారిడార్లోకి రాగానే అతణ్ణి అటాక్ చేసి ట్రాంక్విలైజర్లు పేల్చారు.అవి దిగబడ్డ హెడ్డు వారం రోజుల దాకా లేవలేదు.

అతణ్ణి చేప పిల్లలా ఒక గాజు పెట్టెలో పెట్టి ఆక్సీజన్ మాస్క్ తొడిగి భద్రంగా ఇండియాకి పార్సిల్ చేసి లేపుకొచ్చాడు హ్యారీ.

“వావ్..అన్ని-య్యా  నీ-నూ కిడ్నాప్ మాస్టర్ ఐ-పొ-య్యా!” సంతోషంతో కళ్ళు మిల మిలా మెరుస్తుండగా చెప్పాడు హ్యారీ.

“బలే తెచ్చీవు.నీకు పమోసన్ ఇచ్చేత్తన్నా,తీస్కోయెహే!”

*                 *                   *                    *                  *

రాజ్ కష్టాల పరంపర పాస్ పోర్ట్ ఆఫీసుతో ఐపోలేదు.

రాజ్ నట్లు బిగించిన రాకెట్ పైకెగిరిన కాసేపటికే బంగాళాఖాతంలో కూలిపోయింది.

రాకెట్ కూలిపోవడానికి కారణాలు వెతికిన పెద్ద సైంటిస్టులు రాజ్ నట్ సరిగ్గా బిగించకపోవడం వల్లే రాకెట్ కూలిపోయిందని రిపోర్ట్ ఇచ్చారు.

డివిజన్ హెడ్ రాజ్ కి వార్నింగ్ ఇచ్చేడు.

“ఇది నీ మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను,రెండో సారి రిపీట్ అవుతే రాకెట్ కాదు నువ్వుంటావు బంగాళాఖాతంలో.” 

ఈ మధ్య రాజ్ కి వర్క్ మరీ ఎక్కువయ్యింది.హ్యారీ పుణ్యమాని ఇస్రో ఆఫీసులో నాసా సైంటిస్టులు చొరబడటంతో.

కొలాబరేషన్ స్కీము కింద నాసా-ఇస్రో సంయుక్తంగా చేపట్టిన మార్స్ మిషన్ కోసం చాలా రాకెట్ మోడల్స్ ని పరిశీలించి ఒక ఫైనల్ మోడల్ తయారు చేసాడు హ్యారీ లేపుకొచ్చిన తెల్ల దొర సైంటిస్ట్.

నాలుగు నెలల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రైమ్ మినిస్టర్ని గద్దె దింపేసిన రాజ్ ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ అవతారం ఎత్తాడు.

అన్ని శాఖల నిధులూ తన రాకెట్ కోసం మళ్ళించాడు.బెల్టు షాపుల నించి వచ్చే ఆదాయాన్ని కూడా రాకెట్ మార్గం వైపు తరలించాడు.

ఏడు నెలల్లో పూర్తయ్యింది ప్రైమ్ మినిస్టర్ కొత్త రాకెట్.

టెస్ట్ రాకెట్ ని విజయవంతంగా పరీక్షించారు.ఈ సారి రాకెట్ బంగాళాఖాతంలో కూలకుండా గాలి పటంలా రివ్వున పైకెగిరింది.

*              *                 *                 *                  *

యెంతో ఆనందించేడు రాజ్.ఈ దెబ్బతో తన కష్టాలన్నీ గట్టెక్కుతాయనుకున్నాడు.

రాజ్ కష్టం వృధా పోలేదు.నెలకి వెయ్యి రూపాయల జీతం ఇంక్రిమెంటుగా అందుకున్నాడు.

తన ఇంక్రిమెంట్ వచ్చిన ఆనంద క్షణాలని సారికతో పంచుకోవాలనుకున్నాడు రాజ్.

సారికని తన నట్లూ,బోల్టుల విభాగానికి ఆహ్వానించాడు.

రాజ్ కోసం పరుగున వచ్చింది సారిక.

అదే రోజు యం.యల్.ఏ రాజ్ తన మార్స్ ప్రయాణం టెస్ట్ చేసుకోబోతున్నాడు.

తన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఇంకో రాకెట్లో ముందు భూమి చుట్టూ మూడు చక్కర్లు కొట్టి అసలు రాకెట్ నిజంగా పని చేస్తుందో లేదో పరీక్షించి చూద్దామని లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి బైలుదేరాడు.

నట్లూ బోల్టుల డివిజన్ దగ్గర సారిక కోసం ఎదురు చూస్తున్నాడు రాజ్.

“రాజ్” తియ్యటి గొంతుతో పిలిచింది సారిక.

అటుగా వెళ్తున్న రాజ్ కుందనపు బొమ్మలా జీన్స్ లో ఉన్న సారికని చూసాడు.

“ఎంతందంగా ఉందీ పిల్ల,నా అంజూ కంటే లక్ష రెట్లు ముద్దొచ్చీస్తున్నాది.దీన్ని కూడా మార్స్ మీదకట్టుకెలిపోతే అక్కడ తోట బంగళా కట్టుకుని హాయిగా ఉండిపోవచ్చు” అనుకున్నాడు.

“యే గుంటదానా,బేగొచ్చీవే” సారికకి చెయ్యి వూపాడు.

సారిక రాజ్ ని దాటుకుని ఇంకాస్త ముందుకెళ్ళింది.

“రాజ్!” పరిగెత్తుతూ వెళ్ళి రాజేష్ ని గట్టిగా కౌగిలించుకుని “ఏది నా గిఫ్టు?” అడిగింది.

రాజ్ కి కోపం ముంచుకొచ్చేసింది.సారిక దగ్గరికి వచ్చాడు.

“నన్ను రమ్మని పిల్సీ ఈణ్ణట్టుకుని మీదమీద పడిపోతన్నావు,నీనొదిలేత్తానా? యేటనుకుంతన్నావు?  తిమ్మిరిగా ఉందా? “ సారిక చెయ్యి పట్టుకుని లాగాడు.

“వదల్రా,ఎవరు నువ్వు? నేను నా రాజ్ ని పిలిచాను.నిన్నెవరు పిలిచారిక్కడ?”

“నన్ను పిల్సీ నాటకాలాడుతావా? రాజ్ అంటే నీను. పెయిమ్ మినిస్టర్ రాజ్. బుర్రలోకెక్కిందా?

బుల్లే,నువ్ నాక్కావాల.మనిద్దరం లగ్గమెట్టుకోవాల.ఈణ్ణొదిలేసి నా కాడికొచ్చీయ్యి.

మనిద్దరం మార్సు మీదకి పోయి బంగళా కట్టుకోవాల.బేగెల్దాం వోచ్చీవే,పేమగా పిల్సి నన్నిట్టా ఏడిపించమాక.”

రాజ్ చటుక్కున మెరుపులా కదిలాడు.”ఓ..ఐతే ఇదన్నమాట విషయం! వీడి మొహానికి నా సారిక కావాల్సొచ్చిందా,చెప్తాను వీడి సంగతి”

సైంటిస్టులంతా ప్రైమ్ మినిస్టర్ గారి చోద్యం చూస్తున్నారు గుడ్లు మిటకరించి.అందరి ఫోకస్ ఇప్పుడు సారిక మీదే ఉంది. ఆ సమయంలో ఒక చిన్న తప్పు చేస్తే తనకి యే అపాయమైనా జరగొచ్చు.ఇది ముందుగానే ఊహించాడు రాజ్.

రాకెట్ ఇంకా లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి తీసుకెళ్ళలేదు.దానికి ఫైనల్ టచెస్ ఇస్తున్నారు.

మెల్లిగా నక్కుతూ పిల్లిలా వెళ్ళి దాని ఇంజన్లో ఉన్న నట్ ఒకదాన్ని పీకేసి వచ్చాడు.”ఇంక వీడి బతుకు బంగాళాఖాతమే!”

సారికకి సైగ చేసాడు రాజ్.వాడి వెంట వెళ్తున్నట్టు ఒప్పుకో!

రాజ్ ఎందుకలా చెప్తున్నాడో సారికకి అంతు బట్టలేదు.

“నేనున్నాను,వొప్పుకో!” చూపించాడు రాజ్.

అందరి చూపులూ తన మీదే ఉండటంతో సారిక గత్యంతరం లేక మౌనంగా ప్రైమ్ మినిస్టర్ రాజ్ తో కలిసి లాంచింగ్ పాడ్ దగ్గరికి వెళ్ళింది.

రాకెట్ ని లాంచింగ్ పాడ్ దగ్గరికి తీసుకొచ్చారు.

రాజ్ కీ,సారికకీ స్పేస్ సూట్ వెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సారిక సూట్లో ఏదో తేడా రావడంతో రాజ్ కి అప్పగించారు దాన్లో ఏం తేడా ఉందో చూడమని.

ప్రైమ్ మినిస్టర్ అంగరక్షకుడు కాపలాగా నిలబడ్డాడు.

“ఊ..చెకింగ్ మాత్రమే చెయ్యి.పిచ్చి వేషాలేసి ఆ అమ్మాయిని ముట్టుకున్నావా,మటాష్ ఐపోతావ్” బెదిరించాడు.

“ఓ.కే” సూట్ ని చెక్ చెయ్యడానికి మాత్రమే వచ్చినట్టు ఎంతో వినయంగా వచ్చి సారిక ముందు నిలబడ్డాడు రాజ్.

“స్పేస్ షిప్ ఎక్కకు..” రాజ్ గుసగుసగా సారికకి ఏదో చెప్పాడు.

అర్థమైనట్టు తలూపింది సారిక.

———————————————

తన తల్లోని గులాబీ పువ్వుని ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా కింద పడేసింది.

ప్రైమ్ మినిస్టర్ రాజ్,సారిక స్పేస్ షిప్ ఎక్కారు.

“ఏవండీ”  ముద్దుగా పిల్చింది సారిక.

“ఊ..అగ్గదీ,అట్టా పిలుస్తే నాకు కమ్మగా ఉంటది.ఏటి?” అడిగాడు రాజ్.

“ఇందాక మీతో వస్తున్నప్పుడు నా గులాబీ పువ్వు కింద పడిపోయింది.రోజూ ఒక గులాబీ పెట్టుకోవడం నాకలవాటు.నేను గులాబీ మర్చిపోయిన రోజల్లా ఏదోక యాక్సిడెంట్ అయిపోతుంది.నా పువ్వు తెచ్చుకోనా?” గారాలు పోతూ అడిగింది.

“ఊ..తెచ్చుకోవే! నీ ఇట్టం” చెప్పాడు.

ఆమె కిందికి దిగిన కొన్ని క్షణాల తరవాత -

ఇంజన్లో నట్ ఊడిపోవడం మూలంగా రివర్స్ కౌంట్ డౌన్ మొదలవకుండానే రాకెట్ గాల్లోకి ఎగిరి నిమిషంలో బంగాళాఖాతంలో కూలిపోయింది.

*                *                *                  *                  *

స్పేస్ సూట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ రాజ్ ఈదుతూ ఈదుతూ ఒక రెస్క్యూ పడవలోకి చేరి చావు తప్పి కన్ను లొట్ట పోయి తీరానికి చేరుకున్నాడు.

తీరానికి రాగానే కోపంతో ఊగిపోయాడు రాజ్.ఇప్పుడు మూలిగే నక్క మీద తాటి పండు పడట్టు ఇంకో రాకెట్ పేల్చాడు హ్యారీ.

*                *                *                 *                  *

పువ్వు కోసం వచ్చిన సారికకి కింద ఇంకో వస్తువు కనిపించింది.ఏమిటా అని తీసి చూసిన సారికకి అసలు విషయం బోధపడింది.

“రాజ్,ఇటు చూడు నీ పోయిన పాస్ పోర్ట్ ఇక్కడుంది.”

“సూపర్,నువ్వే నాకు గిఫ్టిచ్చావు” నమ్మలేనట్టు తన పాస్ పోర్ట్ ని తడిమి చూసుకున్నాడు రాజ్.

M.L.A గాడి పీడా వదిలినందుకు రాజ్ కి థాంక్స్ చెప్పుకున్నారు సైంటిస్టులు.

———————————————

“అన్ని-య్యా.. నీ-నూ పార్టీ  మా-రి-పో-టు-నా-నూ” చెప్పాడు హ్యారీ.

“ఇన్ని రోజులూ నా కాడ పన్జేసి పార్టీ మారిపోవడమేంట్రా,నీ దుంపదెగా?”

“రాజ్-కీయం-లో  ఎవ్వరు-నీ  నమ-కూ-డ-దనీ   ను-వే  క-దా  చె-పా-వ్ అన్ని-య్యా! సారీ,నే-నిప్-డూ ఆ  రాజ్ అన్ని-య్యా  పార్టీ!!”

“వోర్నీ సిగ దరగా..” తల మీద చెయ్యి పెట్టుకున్నాడు రాజిగాడు.

రాజ్ దగ్గరికి వెళ్ళాడు హ్యారీ.

నిమ్మ బిళ్ళ..కేరళ పిల్ల పార్ట్-2

మంగళవారం-8 ఫిబ్రవరి,2011

పండు స్నానానికి వెళ్ళిన సమయంలో రూముకి కన్నమేసి అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్ని కొట్టేసారు నందూ-చందూ.. 

ఆ బ్యాగులు చచ్చేంత బరువుండడంతో పండు అసలు ఏం తిని ఇలాంటి బ్యాగుల్ని సునాయాసంగా మోసేస్తున్నాడా అని ఎంతో ఆశ్చర్యం చెందారు.

బ్యాగుల్ని రూములోంచి బైటికి తీసుకెళ్ళడం కష్టం కావడంతో పండు రూములోని కిటికీ నించి ఆ బ్యాగుల్ని కింద పార్క్ చేసిన వాళ్ళ ట్రక్కులోకి విసిరేసి పైప్ గుండా ట్రక్ లోకి దిగాడు నందూ.

పైప్ పట్టుకుని కిందికి దిగుతుండగా మధ్యలో కాలు ఇరుక్కుపోయి దాన్ని లాగలేక తంటాలు పడుతున్నాడు చందూ.

ఈ లోపే ధడేలుమన్న చప్పుడు వినిపించడంతో హుటాహుటిన తన స్నానం ముగించి రూములోకి వచ్చాడు పండు.

ఎదురుగా పెట్టిన తన అమెరికన్ టూరిస్టర్ బ్యాగులు కనిపించకపోవడంతో రూమ్ అంతా కలయజూసాడు.

తన రూమ్ లోని విండో తెరిచి ఉండడంతో పండుకి అనుమానం వచ్చి విండో దగ్గరికెళ్ళి పరిశీలనగా చూసాడు.

ట్రక్కులోని నందూ చందూకి కాలు బైటికి ఎలా లాక్కోవాలో చెప్తూ కనిపించాడు.

“ఆగండ్రా దొంగ వెధవల్లారా,ఎక్కడికిరా పారిపోతారు? నా చేతుల్లో ఐపోయారు” మెరుపులా లిఫ్టులో కిందికి దిగి నందూ-చందూల్ని వెంబడించాడు పండు.

కాలు వాచిపోయి కుయ్యో-మొర్రోమంటూ ట్రక్కులోకి దూకేసాడు చందూ.వెంటనే నందూ ట్రక్ స్టార్ట్ చేసి ఎదురుగా ఉన్న రోడ్డులోకి తిప్పాడు.

“ఒరేయ్..చచ్చార్రా నా చేతుల్లో” అక్కడ కనిపించిన బైక్ తీసుకుని ట్రక్కుని వెంబడించాడు పండు.

కొండల్లో గుట్టల్లో అష్టా వక్ర వంకర్లు తిప్పుతూ ట్రక్ నడిపిస్తున్నాడు నందూ.

వాళ్ళకేమాత్రం తగ్గకుండా బైక్ ని తిప్పుతూ వాళ్ళ పాలిటి యముడిలా తయారయ్యాడు పండు.

పండు బారి నించి తప్పించుకోవడానికి రక రకాల పథకాలు వేస్తూ స్పీడు కంట్రోల్ చెయ్యలేక ఒకానొక రాంగ్ టైములో రోడ్డు మీదున్న గుంటలో ట్రక్కుని దిగేసాడు నందూ.

ఆ దెబ్బతో ట్రక్కు టైరులో ఒక పెద్ద మేకు దిగబడిపోయింది.

సడన్ బ్రేక్ వేసాడు పండు.లేపోతే ఎదురుగా వస్తున్న లారీ తనని ఢీకొనేదే.వచ్చే ప్రమాదాన్ని ఆపడానికి సడన్ బ్రేక్ వేసి లెఫ్టుకి కట్ చేసాడు పండు.

బైక్ పల్లం లోకి వెళ్ళి ఆగిపోయింది.

ఈ లోపు నందూ-చందూ అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్ని చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాటిని తీసుకుని కుడివైపుగా ఉన్న కొబ్బరి తోటల్లోకి పరిగెత్తారు. 

వాళ్ళని చూసి తనూ కోకోనట్ గార్డెన్ లోకి పరిగెత్తాడు పండు.

పొదల మాటుకి పారిపోయి దాక్కున్నారు నందూ-చందూ.

వాళ్ళ వెనక పరిగెడుతున్న పండు చిత్రంగా ఆగిపోయాడు.

కళ్ళు నులుముకుని చూసాడు,తను కింద పడిపోయి ఉన్నాడు.

తలెత్తి పైకి చూసాడు పండు.

ఎదురుగా లంగా-ఓణీలో బొద్దుగా ముద్దుగా ఉన్న కేరళ కుట్టి కంటపడింది.

“సారీ..రియల్లీ వెరీ సారీ..” వచ్చీ రాని ఇంగ్లీష్ ని మళయాళీ యాక్సెంట్ లో మాట్లాడిందా అమ్మాయి.

వాగుతూనే ఉంది నాన్-స్టాప్ నాన్సెన్స్ లా మళయాళంలో.

ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు పండుకి.

“హేయ్ పిల్లా..ఏమనుకుంటున్నావసలు? నిలువెత్తు అబ్బాయికి నీ ఇష్టమొచ్చినట్టు డ్యాషిచ్చెయ్యడమేనా?” పైకి లేచి ఆ పిల్లని తెలుగులో బెదిరించాడు పండు.

అర్థం కానట్టు అయోమయంగా మొహం పెట్టి తుర్రుమందా అమ్మాయి.

ఆమె ఎటు వెళితే అటే తిరుగుతూ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు పండు ఆ అమ్మాయిని.

“వాట్ యువర్ ప్రాబ్లం మిస్టర్?” వచ్చీ రాని ఇంగ్లీష్ లో అడిగింది.

“యూ ఆర్ మై బిగ్ ప్రాబ్లం.టెల్ మీ వేర్ ఆర్ ద థీవ్స్?” కొబ్బరి మట్ట ఒకదాన్ని వంచుతూ అడిగాడు పండు.

“థీవ్స్..మీన్స్?”

“దొంగ వెధవలు.”

“ఓ..దే..థీవ్స్?”

“2 పర్సన్స్,బ్యాగ్..దే రన్..ఐ రన్.. యూ కమ్..ఐ డాష్” చెప్పింది ముక్కలు ముక్కలుగా.

“మా తల్లే ! ఏం ఇంగ్లీష్ మాట్లాడుతున్నావో,బంగారు తల్లి.ఇప్పుడూ..వేర్ ద థీవ్స్ గో?”  

“దే గో బుష్. ఐ రన్..యూ కమ్”

“ఓహో..అదా నీ గోల..ఓ.కే”

ఆ కేరళ కుట్టి చూపించిన పొద వైపు పరిగెత్తాడు పండు.

ఆయాసంతో పొదల్లో కూలబడి బ్యాగులు తెరిచిన నందూ-చందూ అవాక్కయ్యారు.

“ఛ..ఒక వంద కోట్లున్నయ్యేమో అని ఎంత ఫీలయ్యాను? తీరా చూస్తే పాపిన్స్,ఇవా ఈ బ్యాగుల్లో ఉన్నది?” నందూ ఆవేశంగా చందూని పట్టుకుని ఊపేస్తున్నాడు.

“ఒరేయ్ నందూ,పైన ఇలాంటి పాపిన్స్ పెట్టి కింద డబ్బుల కట్టలేమైనా పెట్టారేమోరా..” డౌట్ వెలిబుచ్చాడు చందు.

“నీ బొంద” గద్దించాడు నందు.

సాలోచనగా ప్యాకెట్ చింపి ఒక నిమ్మబిళ్ళని నోట్లో వేసుకున్నాడు చందు.దాని టేస్టుకి ముగ్ధుడైపోయాడు.

“నువ్వు కూడా ట్రై చెయ్యరా..” పన్లో పనిగా ఇంకో నిమ్మబిళ్ళని నందూ చేతికందించాడు చందు.

“ముందా దిక్కుమాలిన పాపిన్స్ ని నా కళ్ళ ముందు నించి తీసెయ్” ఆజ్ఞాపించాడు నందు.

“ఎవడిదిరా దిక్కుమాలిన పాపిన్స్,నా నిమ్మబిళ్ళల్ని అవమానిస్తారా?” వెనుక నించి మెరుపులా కొబ్బరి మట్టతో వాడి గుండు మీద ఒకటి తగిలించాడు పండు.

ఆ దెబ్బకి గింగిరాలు తిరిగిపోయి కింద పడ్డాడు నందు.

చందుకి ఇంక పరిగెత్తడానికి దమ్ము సరిపోక పండుకి సరెండర్ అయ్యాడు.

“ఈ పనేదో గంట క్రితం చేసుంటే ఈ ఛేజింగ్ ఎపిసోడ్ తప్పేది కదా..అనవసరంగా నా టైమ్ వేస్ట్ చేసారు కదరా!” తన అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్ని సర్దుకుంటూ అన్నాడు పండు.

“ఎలాగూ వాణ్ణొకటి పీకాను కదా,ఇప్పుడు నిన్ను కూడా ఒకటి పీకుతానేం” కొబ్బరి మట్ట చేతిలోకి తీసుకుని ఓ డైలాగిచ్చాడు.

“వద్దన్నా..ప్లీజే” బ్రతిమిలాడాడు చందు.

“లాభం లేదురా,మిమ్మల్నిద్దర్నీ గాలికొదిలేస్తే మళ్ళీ కన్నాలేస్తారు” అదే మట్టతో చందూ గాడి గుండు మీద ఒక్కటి వేసాడు పండు.

నందూ-చందూ ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు.

“వాట్ మూవీ యూ వాచ్,కమ్ హియర్”  – కొబ్బరి చెట్ల చాటు నించి తొంగి తొంగి చూస్తున్న కేరళ కుట్టిని పిలిచాడు పండు.

“గివ్ మీ వన్ రోప్” ఆర్డర్ వేసాడు.

పండుని అక్కడ కనిపిస్తున్న ఒక కాటేజ్ లోకి తీసుకెళ్ళింది కుట్టి.

అక్కడి వాళ్ళిచ్చిన తాడుతో నందూ-చందూల్నిద్దరినీ కట్టేసి పోలీసులకి ఫోన్ చేసాడు.

“థాంక్స్ ఫర్ ద హెల్ప్.టేక్ వన్ నిమ్మబిళ్ళ” తన నిమ్మబిళ్ళని కుట్టికి ఆఫర్ చేసాడు పండు.

“థాంక్స్” సిగ్గుతో మెలికలు తిరుగుతూ నిమ్మబిళ్ళ తీసుకుంది కుట్టి.

“వాట్ ఈజ్ యువర్ నేమ్?”

“రుక్మిణి” కొబ్బరి పుల్లతో ఆడుతూ చెప్పింది.

“ఓ..నైస్ నేమ్.మై సెల్ఫ్,వాసుదేవ్.కాల్ మీ పండు” షేక్ హ్యాండిచ్చాడు పండు.

“పండూ” – ముద్దుగా పిలిచింది కుట్టి.

“యా..టెల్ మీ”

“యూ డాష్,ఐ డాష్.యూ షేక్ హ్యాండ్,ఐ షేక్ హ్యాండ్.వీ మ్యారేజ్..ఓవర్” చెప్పింది కుట్టి.

“వాట్?” అదిరి పడ్డాడు పండు.

పండు చెయ్యి పట్టుకుని వాళ్ళ గూడెం లోకి తీసుకెళ్ళింది రుక్కూ.

సింగిల్ గా వెళ్ళి జంటగా ఇంటికి తిరిగొచ్చాడు పండు.

ఇంటికొస్తూనే సహదేవ్-వీణాపాణి పెళ్ళి ఫిక్స్ ఐన విషయం తెల్సుకున్నాడు.

“ఓరి దుర్మార్గుడా,కన్యాకుమారిలో కన్యా కుమారి తో డ్యూయెట్ వేస్కోవడానికెళ్ళావా?” సహదేవ్ ని ఆట పట్టించడం మొదలు పెట్టాడు పండు.

“పెద్దాడికి పెళ్ళి చేద్దామనుకుంటుంటే నేనేం తక్కువ తిన్లేదని నువ్వు కూడా కాంపిటీషన్ కి తయారయ్యావుగా!” పండు తల మీద ప్రేమగా ఒక్కటి వేసింది అమ్మ.

అర్థం కాని అయోమయంలో నవ్వింది రుక్కూ.

ఆ తరవాత పండు కేరళ కుట్టికి ఎంతో కష్టపడి తెలుగు నేర్పించాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా!

అమ్మా,నాన్నా..ఓ నిమ్మబిళ్ళ,కోకోనట్ గార్డెన్లో ఓ కేరళ పిల్ల!

సోమవారం-7 ఫిబ్రవరి,2011

వైజాగ్ ఆర్.కె.బీచ్ దగ్గర వాణీ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న వాసుదేవ్ వాళ్ళ అమ్మా,నాన్నల గారాబంతో అల్లారుముద్దుగా పెరిగాడు వాళ్ళింట్లో తనే చిన్నవాడు కావడంతో.

చిన్నప్పుడు పళ్ళు తినకుండా ప్రతి రోజూ మారాం చేసేవాడు వాసుదేవ్.ఎంతో కష్టపడి ఒక పండు తినిపించేసరికి వాళ్ళమ్మకి నీరసం వస్తుండేది.అందుకే వాసుదేవ్ ని ముద్దుగా వాళ్ళమ్మ “పండు” అని పిల్చుకుంటుంది ప్రేమతో.

వాసుదేవ్ వాళ్ళ అన్నయ్య సహదేవ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసి జావా నేర్చుకుని ఒక సాఫ్టువేర్ కంపెనీలో చేరిపోయాడు.సంవత్సరం తిరిగాక ఒకరోజు L-1 వీసా రావడంతో ఉప్పొంగిపోయి,కంపెనీ వాళ్ళే ఖర్చులు భరించి పంపగా క్యాలిఫోర్నియాలో సెటిల్ అయ్యాడు.తను ముద్దుగా పిలుచుకునే డబ్బా రేకుల సుబ్బమ్మ (డరేసు) అనబడే ఒక డెల్ ల్యాప్ టాప్ ద్వారా ప్రతి రోజూ గంట సేపు వీడియో చాట్ లోనూ,నాలుగేళ్లకో సారి నెల రోజుల పాటు డైరెక్టుగా ఫేస్ టూ ఫేస్ గానూ వాసుదేవ్ తో టైమ్ స్పెండ్ చెయ్యడం సహదేవ్ కి చాలా ఇష్టం.

అఫ్ కోర్స్,పండు కి కూడా సహదేవ్ అంటే చాలా ఇష్టం.

ఈ మధ్య పండు వాళ్ళ అమ్మా,నాన్నా సహదేవ్ కి పెళ్ళి చెయ్యాలని సంకల్పించి ఆ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నారు.అన్ని మ్యాట్రిమొనీ సైట్లలోనూ,వివాహ పరిచయ వేదికల మీదా ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ తమకు తోచిన అన్ని మార్గాల్లోనూ శోధించి,సాధించి నాలుగేళ్ళకోసారి
ఇండియాకి వచ్చే సహదేవ్ కోసం 40 మంది అమ్మాయిల మ్యాట్రిమొనీ ప్రొఫైల్స్ ఫోటోలతో సహా ఐ.ఐ.టి ఆన్సర్ షీట్లకి మల్లే కట్టలు కట్టి బీరువా లోపలి అరలో ఎంతో భద్రంగా దాచి ఉంచారు. 

సాధారణంగా ఇండియాకొచ్చిన తరువాత సహదేవ్ తన ముద్దుల తమ్ముడు పండు ని వెకేషన్ ట్రిప్ కోసం ఎన్నడూ కనీ వినీ ఎరుగని చిత్ర విచిత్రమైన ప్రాంతాలకి తీసుకెళ్తుంటాడు.ఓ వారం రోజుల పాటు తమ్ముడితో టైమ్ స్పెండ్ చేసినట్టూ ఉంటుంది,ఇండియాలో కొత్త ప్రదేశాలు చూసినట్టూ ఉంటుంది అనే ఆశతో.

అలాగే ఈ సారి “కొచ్చి” దగ్గర్లోని వెల్లంగల్లూర్ వెళ్ళాలని నిశ్చయించుకున్నారు సహదేవ్,వాసుదేవ్.

ఇండియా రాగానే సహదేవ్ అమ్మా,నాన్నలు ఎంత వారిస్తున్నా వినకుండా తన వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసేసాడు ఐనా నేనింకా జస్ట్ 28 యే కదా,నాకిప్పుడప్పుడే పెళ్ళి మీద ఇంట్రస్ట్ లేదంటూ.అనుకున్నదే తడవు బ్యాగ్ సర్దేసి పండు ని తీసుకుని “కొచ్చి” కి ప్రయాణమయ్యాడు.

ఇలా లాభం లేదని నిశ్చయించిన అమ్మా,నాన్నా తాము సెలక్ట్ చేసిన 40 మంది అమ్మాయిల్లోనించి చాకు లాంటి వీణాపాణి అనే అమ్మాయికి సహదేవ్ ఆర్కుట్ మరియు ఫేస్ బుక్ ఐడి ఇచ్చి డైరెక్టుగా మాట్లాడమన్నారు.

వీణాపాణి ఒక మంచి ముహూర్తం చూసుకుని వినాయకుడికి దండం పెట్టుకుని సహదేవ్ ఆర్కుట్ ప్రొఫైల్లో తనదైన స్టైల్లో హాయ్ చెబుతూ ఒక స్క్రాప్ రాసేసింది.

“కొచ్చి” వెళ్ళగానే అమ్మా,నాన్నలకి హాయ్ చెబుదామని ఆర్కుట్ ఓపెన్ చేసిన సహదేవ్ కి వీణాపాణి మెసేజ్ పిచ్చ పిచ్చగా నచ్చేసి ఆన్-లైన్లో పడ్డాడు.

వీణాపాణి ఎలాగైనా సరే రెండు రోజుల్లో కన్యాకుమారిలో తనని కలవమని ఇన్వైట్ చేసింది.

పండుకి డైరెక్టుగా విషయం చెబుతే తనని ఆట పట్టిస్తాడనే ఉద్దేశ్యంతో ఆఫీస్ నించి అర్జంటుగా ఫోన్ కాల్ వచ్చిందని,కన్యాకుమారిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారని అందమైన అబద్ధం చెప్పి మధ్యలోనే పండుకి హ్యాండిచ్చి కన్యాకుమారిలో తేలాడు సహదేవ్.

దారి మధ్యలో ఒంటరివాడైపోయాడు పండు.

అయినా సరే సహదేవ్ మధ్యలోనే వదిలేసిన వెకేషన్ ట్రిప్పుని తనెలాగైనా పూర్తి చెయ్యాలనే మహోన్నతమైన ఆశయంతో కొచ్చి నించి 37 కిలోమీటర్ల దూరంలోని వెల్లంగల్లూర్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు పండు.

వెల్లంగల్లూర్ జస్ట్ 37 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో కొచ్చి కి దగ్గర్లో ఉన్న హిల్ స్టేషన్లన్నీ ముందు చుట్టేసాడు.

కేరళ లో దాదాపు తను చూసిన అన్ని హిల్ స్టేషన్ల దగ్గరా దొరికే  అద్భుతమైన,లుక్కులకి ఆగ్రా పేఠే లాగా కనువిందు చేస్తూ తియ్యటి రుచితో నోరూరించే జిలాటిన్ మరియు సిట్రస్ ఎక్స్ ట్రాక్ట్స్ తో తయారైన ఒక రకమైన నిమ్మబిళ్ళ పండుని ఎంతగానో ఆకట్టుకుంది.క్షణమైనా దాన్ని వదిలి ఉండటం
పండుకి నచ్చడం లేదిప్పుడు.అందుకే సంవత్సరం పాటు సరిపడా నిమ్మబిళ్ళల్ని రెండు అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్లో నింపుకుని తను బస చేసిన రిసార్ట్ రూముకి తీసుకొచ్చాడు పండు.

రెండు బరువైన అమెరికన్ టూరిస్టర్ బ్యాగులతో రిసార్ట్ లో దిగుతున్న పండు మీద ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల కన్ను పడనే పడింది.హాట్ ఎయిర్ బెలూన్లా నిండుగా ఉన్న ఆ బ్యాగుల్లో ఎన్ని కోట్ల రూపాయలు దాగున్నాయో అని ఆనందంతో వాళ్ళ కళ్ళు మిల మిలా మెరిసాయి.

ఆ రాత్రి ఎలాగైనా సరే ఆ అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్ని సొంతం చేసుకోవాలని ప్రణాళిక తయారు చేసుకున్నారు వాళ్ళిద్దరూ.

                                          మిగతా కథ తరువాయి భాగంలో…

మిహిరా మాధవం : భాగం – 4

మంగళవారం-14 డిసెంబరు,2010

“మాధవ్..ప్లీజ్! ఏమిటా అల్లరి?” అతణ్ణి వెంబడించింది మిహిర లెన్స్ కోసం.

మిహిర మాధవ్ భుజాల ఎత్తులో ఉంటుంది.అందుకే ఆ లెన్స్ అందుకోవడం ఆమెకు వీలు చిక్కడం లేదు.

ఇదే అదనుగా లెన్స్ ని కుడి చేతిలోంచి ఎడమ చేతిలోకీ ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకీ వేగంగా సమయం చూసి మారుస్తూ లెన్స్ కోసం మిహిరతో దాదాపుగా బ్రేక్ డ్యాన్స్ చెయ్యిస్తున్నాడు మాధవ్.

అతని చేతుల హైట్ తను అందుకోలేనన్న విషయం కాసేపటికి అర్థమై ఏదో స్ఫురించిన దానిలా మాధవ్ దగ్గరికి వచ్చి అతడికి చక్కిలిగింతలు పెట్టింది మిహిర.చక్కిలిగింతలకి నవ్వుతున్న మాధవ్ చేతుల్లోంచి లెన్స్ ని లాగేసుకుంది.

“హేయ్..ఇది మోసం!” అన్నాడు మాధవ్.

“ఏం కాదు” అంది మిహిర.

“ఎందుక్కాదూ ? న్యాయంగా నా చేతుల్లోంచి లెన్స్ తీసుకోవాలి,చక్కిలిగింతలు పెట్టి తీసుకోకూడదు” కంప్లెయింట్ చేసాడు మాధవ్. 

“అవును పాపం! పొడుగ్గా ఉన్నామని చెప్పి పొట్టి వాళ్ళకి అందకుండా చేతుల్లోంచి లెన్స్ మార్చుకుని అందనివ్వకుండా ఏడిపించడం న్యాయం,చక్కిలిగింతలు పెట్టి నేను తీసుకుంటే మోసం ఎందుకవుతుంది? దానికీ దీనికీ చెల్లు. లెక్క సరిపోయింది” చెప్పింది మిహిర.

“ఊహూ..ఉండు చెబుతాను నీ సంగతి!” మిహిర దగ్గరి నించి మళ్ళీ లెన్స్ తన చేతుల్లోకి రప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మాధవ్.

“Hey Maddy,Ur friend is not doing well.Would you please mind to come with me?” ISS లోని డాక్టర్ ఆఘమేఘాల మీద మాధవ్ ని సమీపించింది.

 “What happened doctor?”

“Nothing is rigorously serious but seems some minor health problem” చెప్పింది డాక్టర్.

వెంటనే డాక్టర్ తో పాటు శశాంక్ ఛాంబర్లోకి వెళ్ళారు మిహిరా,మాధవ్.

“Hey Shashank, what happened?” ఆదుర్దాగా అడిగింది మిహిర.

“I Don’t know honey but I feel like I am flying upside down” భారంగా తల పట్టుకున్నాడు శశాంక్.

“వీడికి బాగా కిక్ ఎక్కినట్టుంది.ఇందాక వద్దురా అంటుంటే వినకుండా పార్టీలో బాటిల్ ఎంజాయ్ చేసిన ఎఫెక్టేమో” అనుకున్నాడు మాధవ్.

“మిహిరా! ఇప్పటికే చాలా ఆలస్యం అయింది,నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో.శశాంక్ దగ్గర నేనుంటాలే” చెప్పాడు.

“సరే!” శశాంక్ కి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది మిహిర.

“అసలేం జరిగిందిరా?” అడిగాడు మాధవ్ మిహిర వెళ్ళిపోయాక రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ.

“ఏమోరా..డిన్నర్ తరవాత డ్రింక్ తీసుకున్నాను కదా,కాసేపటికి కడుపులో అంతా పిచ్చి పిచ్చిగా ఉంటే ఈ డాక్టర్ ని పిలిచాను.టాబ్లెట్స్ ఇచ్చింది, అవేసుకోగానే వామిటింగ్స్ అయ్యాయి.ఆ తరవాత నించీ తల తిప్పుతోంది.నేను తల కిందులుగా వేళాడుతున్నట్టూ,తరవాత కాసేపటికి ఎక్కడో లోయలో పడిపోతున్నట్టూ అనిపిస్తుంది.ఫీవర్ కూడా ఉందని డాక్టర్ చెప్పింది.” 

“ఐతే స్పేస్ అడాప్టేషన్ సిండ్రోమ్ అనమాట” అన్నాడు మాధవ్.

“ఊ”..

“నువ్వు ఈ స్టేజ్ లో రాగలవా మరి సౌరయాన్-1 మిషన్ లో?”

“లేదురా, నా వల్ల కావడం లేదు.మీరిద్దరూ వెళ్ళండి.నేను రిటర్న్ వెళ్ళిపోతా”

“సరే, ఐతే నేను ISRO గ్రౌండ్ కంట్రోల్ కి ఇన్ ఫార్మ్ చేస్తాను”

శశాంక్ ఆరోగ్యం గురించి మిహిరతో సంప్రదింపులు జరిగిన తరువాత కూడా ఆమె తొట్రు పడక సౌరయాన్-1 మిషన్ కోసం తన సంసిద్ధత వ్యక్తం చెయ్యడంతో ISRO లోని గ్రౌండ్ కంట్రోల్ ని సంప్రదించాలని నిశ్చయించాడు మాధవ్.

కల్పనా క్యాప్స్యూల్ లోకి వెళ్ళి మానిటరింగ్ సిస్టమ్ ఆన్ చేసాడు.

కాసేపటికి ISRO కంట్రోల్  తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది.

శశాంక్ పరిస్థితి గురించి వాళ్ళకి క్లుప్తంగా వివరించి తనూ,మిహిరా సౌరయాన్-1 మిషన్ కొనసాగిస్తామని తెలియజేసాడు మాధవ్.

శశాంక్ ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా సౌరయాన్-1 మిషన్ ఆగిపోకుండా కొనసాగేందుకు మాధవ్, మిహిరలు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ఆమోదించారు ISRO ఛైర్మన్. 

ప్రణాళిక ప్రకారం సరిగ్గా 24 గంటల హాల్ట్ ముగించుకుని,పూర్తి స్థాయిలో ఇంధనం సమకూర్చుకుని మిహిరా,మాధవ్ ల సాహసంతో తిరిగి జాబిలి మీదకి ప్రయాణాన్ని సాగించింది సౌరయాన్-1.

అత్యున్నతమైన సౌందర్యంతో శోభిల్లే ధరణీ తలాన్ని, పర్యావరణాన్ని దాటుకుని సౌరకుటుంబం లోకి తమ మొదటి అడుగు వేసారు మిహిరా – మాధవ్ లు.

భూమిని దాటిన తరువాత చంద్రుణ్ణి చేరుకోవడానికి సౌరయాన్-1 కి మరో ఐదు రోజులు పడుతుంది.

భూమి నించి దూరం వెళుతున్నకొద్దీ ఎటు చూసినా అన్ని వైపులా ఆవరించి ఉన్న శూన్యం.

ఆ శూన్యంలో వెలుగులు విరజిమ్ముతూ మన సౌరకుటుంబం లోని ఏకైక నక్షత్రం సూర్యుడు గోచరించాడు వారికి శతకోటి,సహస్రకోటి వజ్ర కాంతులతో దీప్తమై తనకి సాటి మరెవరూ లేరన్నంత ధీమాగా..   

సూర్యుడు

భూమికి  సమీపంలో ఉన్న ఏకైక నక్షత్రం.

భూమి మీద జీవరాశులకి,వాటి మనుగడకి కావాల్సిన సమస్త పదార్థాలూ తన కిరణాల రశ్మి ద్వారానే ప్రసాదిస్తున్న అతి శక్తివంతమైన నక్షత్రం.

సూర్యుడు పాలపుంత లోని ఓరియన్ మండలానికి చెందిన నక్షత్రం.

నక్షత్రాల కాంతి తీవ్రతని బట్టి సూర్యుడు G2V మెయిన్ సీక్వెన్స్ విభాగానికి చెందిన నక్షత్రం.

ఇంద్ర ధనుస్సులోని రంగులు ఊదా రంగుతో మొదలై ఎరుపు రంగుతో సమాప్తమవుతాయని మనకి తెలుసు కదా! అలాగే తారల్లోనూ వర్ణపటకం ఊదా రంగుతో మొదలై ఎరుపు రంగుతో సమాప్తం అవుతుంది.

వర్ణ పటకంలో అన్నిటికన్నా చివర ఉండే రంగు యొక్క ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.అంటే ఎరుపు రంగు యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందనమాట!  అందువల్ల ఎరుపు రంగులో ఉండే తారల ఉష్ణోగ్రతలు తక్కువగానూ,ఊదా రంగులో ఉండే తారల ఉష్ణోగ్రతలు ఎక్కువగానూ ఉంటాయని మనం తెలుసుకోవచ్చు.

నక్షత్రాల వర్ణాలను వివిధ విభాగాల్లో వర్గీకరించడం జరిగింది.ఈ వర్ణ విభాగాలు నక్షత్రాలకి మాత్రమే వర్తిస్తాయి (ఎందుకంటే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు).

ప్రస్తుతం దూరదర్శినుల ద్వారా మనం వీక్షించ గలుగుతున్న నక్షత్రాలని వాటి వర్ణాల ఆధారంగా 7 విభాగాల్లోకి వర్గీకరించడం జరిగింది.అవి O,B,A,F,G,K మరియు M 

ఈ వర్ణమాలని సులభంగా గుర్తుంచుకోవడానికి ఈ క్రింది పదాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది.

“Oh Be A Fine Girl and Kiss Me!!”

ఇందులో O రకానికి చెందిన తారలు అమితమైన ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి.క్రమ క్రమంగా B,A,F వర్గాలకి చెందిన నక్షత్రాల ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఆఖరున ఉన్న M రకానికి చెందిన తారలు O రకం తారలతో పోల్చితే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి.

O రకం తారలు నీలం రంగులోనూ

A రకం తారలు తెలుపు రంగులోనూ

G రకం తారలు పసుపు రంగులోనూ

M రకం తారలు ఎరుపు రంగులోనూ ఉంటాయి.

మన సూర్యుడు ఇందులో G రకం తారల కోవలోకి వస్తాడు.

ఒక్కొక్క తారకీ వర్ణ మాపక సంఖ్య 0-10(వర్ణ తీవ్రత 0-100%) గా ఉంటుంది. ఈ సంఖ్య ప్రకారం సూర్యుడు G2 విభాగానికి చెందుతాడు.G2 అంటే పసుపు రంగు నుండి కొంచం దూరంగా 20% కాషాయ రంగు (ఆరెంజ్) వర్ణం కలిగిన మెయిన్ సీక్వెన్స్ K రకం తార వైపుగా తన వర్ణ మాపకాన్ని కలిగి ఉంటాడు. 

ఇక సూర్యుడి కాంతి తీవ్రత మరియు మిగతా తారలతో పోల్చి చూసినప్పుడు సూర్యుడి పరిమాణం ప్రకారం రోమన్ అక్షరం (0-7 లేదా 0-VII) విభాగాల్లో V విభాగం పరిధిలోకి వస్తాడు.

విభాగం -  0 రకానికి చెందిన తారలు బృహత్తారలు.ఇవి సూర్యుడికంటే కొన్ని కోట్ల రెట్లు హెచ్చు ఉష్ణోగ్రతల వద్ద ఉంటాయి.సూర్య కాంతికి కోట్ల రెట్లు ప్రకాశవంతమైన కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి.  

విభాగం -  I  రకానికి చెందిన తారలు మహా తారలు.ఇవి కూడా సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి.ఇవి బృహత్తారల కంటే కొంచం తక్కువ కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి.

విభాగం – II  రకానికి చెందిన తారలు బృహత్కాంతిమత్తారలు.ఇవి విభాగం – I తారల కంటే తక్కువ కాంతిని ప్రసరిస్తూ ఉంటాయని మనం సుళువుగానే తెలుసుకోవచ్చు.

విభాగం – III రకానికి చెందిన తారలు ఘనకాంతిమత్తారలు. సూర్యుని కంటే కొన్ని వేల రెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి.విభాగం-II తారల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. 

విభాగం – IV రకానికి చెందిన తారలు కాంతిమత్తారలు.సూర్యుని కంటె కొన్ని వందల రెట్లు కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. 

విభాగం – V రకానికి చెందిన తారలు కుబ్జ తారలు లేక మెయిన్ సీక్వెన్స్ తారలు లేక డ్వార్ఫ్ తారలు.ఇవి సూర్యునితో దాదాపుగా సమానమైన ద్రవ్యరాశిని కలిగి సూర్య కాంతితో సమానమైన కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి.    

ద్రవ్య రాశి మరియు కాంతి తీవ్రతని బట్టి సూర్యుణ్ణి V అంటే డ్వార్ఫ్ లేదా మెయిన్ సీక్వెన్స్ రకానికి చెందిన తారగా మనం గుర్తించవచ్చు.

కాబట్టి సూర్యుడు 20% కాషాయ రంగు వర్ణ మాపకాన్ని కలిగిన పసుపు పచ్చ తార లేదా G2V మెయిన్ సీక్వెన్స్ తారగా మనం గుర్తించవచ్చు. 

ఇక విభాగం – VI రకానికి చెందిన తారలు మహాకుబ్జ తారలు.

విభాగం – VII రకానికి చెందిన తారలు శ్వేతకుబ్జ తారలు.

ఈ రెండు విభాగాలకి చెందిన తారలు సూర్యుడి కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి తక్కువ కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి.

పైన చెప్పిన 0-V విభాగాల్లోని తారలు కొన్ని వేల కోట్ల సంవత్సరాల తరువాత తమలోని ద్రవ్యరాశిని కోల్పోతూ కోల్పోతూ విస్ఫోటనం చెంది రెడ్ జెయింట్ (అరుణకుబ్జ) లేదా వైట్ డ్వార్ఫ్(శ్వేతకుబ్జ ) తారలుగా మారిపోతాయి.మహా కుబ్జ,శ్వేత కుబ్జ తారలు మాత్రం తమలోని ఇంధనాన్ని కోల్పోక కోట్ల సంవత్సరాల తరువాత కూడా వాటి యథా స్థితుల్లోనే ఉంటాయి.

సూర్యుడు భూమికి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.

ఒకవేళ మనం కాంతి వేగంతో గనుక ప్రయాణిస్తే సూర్యుణ్ణి 8 నిమిషాల 19 సెకన్లకు చేరుకోగలుగుతాం.అంటే సూర్యుడు మనకి 8 కాంతి నిమిషాల దూరంలో ఉన్నాడనమాట!

సూర్యుడి వయసు 46 కోట్ల సంవత్సరాలు.     

పాలపుంత నిహారిక మధ్య భాగానికి సూర్యుడు 26,000 కాంతి సంవత్సరాల దూరంలోని ఓరియన్ అనే మండలంలో పాలపుంత చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు.

సూర్యుని వ్యాసం దాదాపుగా 13,92,000 కిలోమీటర్లు. అంటే దాదాపుగా 109 భూ వ్యాసాలతో సమానం.అంటే ఒక్క సూర్యుడిలో 109 భూగోళాలను పట్టించవచ్చు!

సూర్యుడు ఆరు లక్షల కిలోమీటర్ల చదరపు వైశాల్యం కలిగి ఉంటాడు.సౌరకుటుంబం లోని 99% ద్రవ్యరాశి సూర్యుడి నించి ఉత్పన్నమైనదే.సూర్యుడు తనలోని విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావం వల్ల దాదాపుగా గుండ్రని ఆకారం కలిగి ఉంటాడు.

సూర్యుడి కేంద్రకం మరియు ధృవాల వద్ద వంపులో తేడా ~10 కిలోమీటర్లు.

అందువల్ల సూర్యుడు ప్రస్ఫుటమైన గోళాకారాన్ని కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు.

అదే మన భూమి మరియు ఇతర గ్రహాల మీద విద్యుదయస్కాంత క్షేత్రాల బలం సూర్యుడి మీద కంటే తక్కువ కాబట్టి పూర్తి గోళాకారం కాకుండా అంచుల దగ్గర కొద్దిగా చదును చేయబడ్డ బంతుల వలె ఉంటాయి.

సూర్యుడు ప్రధానంగా వాయువులతో ఏర్పడిన గోళం.సూర్యుడి ఉపరితలం లోని ఉష్ణోగ్రతలు కొన్ని లక్షల డిగ్రీల సెల్సియస్ లో మరియు కేంద్రక ఉష్ణోగ్రతలు కొన్ని కోట్ల డిగ్రీల సెల్సియస్ లలో ఉంటాయి కాబట్టి సూర్యుడి కేంద్రకంలో పదార్థం వాయు రూపంలో కాక అణువులు,పరమాణువులు ఎక్కడివక్కడ విడిపోయిన ప్లాస్మా స్థితిలో ఉంటుంది.

సూర్య కేంద్రకంలో ఉన్న పదార్థం ప్లాస్మా స్థితిలోనూ,ధృవాల వద్దనున్న పదార్థం వాయు రూపంలోనూ ఉండటం వల్ల సూర్య కేంద్రకం (తన చుట్టూ తాను తిరిగే సమయం 26 రోజులు ) ధృవాల వద్ద (తన చుట్టూ తాను తిరిగే సమయం 34 రోజులు) కన్నా ఎక్కువ వేగంతో పరిభ్రమిస్తూ ఉంటుంది.అందువల్ల సూర్యుడు తన చుట్టూ తాను   కలన భ్రమణం (differential rotation) చేస్తూ ఉంటాడు. 

సూర్యోపరితలం మొత్తాన్ని 9 భాగాలుగా విభజించవచ్చు.

 1.కేంద్రకం

2.ఉష్ణ మండలం

3.వికిరణ మండలం

4.ఫోటో స్ఫియర్

5.క్రోమో స్ఫియర్

6.కరోనా

7.సన్ స్పాట్

8.గ్రాన్యూల్స్

9.ప్రామినెన్సులు

సూర్య  కేంద్రకంలో ఉన్న హైడ్రోజన్ అణువులలోని ప్రోటాన్-ప్రోటాన్ మధ్య సంయోగం జరిగినప్పుడు హైడ్రోజన్ అణువు హీలియం అణువుగా రూపాంతరం చెందుతూ దానితోబాటే అమితమైన ఉష్ణ శక్తి కేంద్రకం నించి విడుదలవుతూ ఉంటుంది.ఈ శక్తి కొన్ని లక్షల అణుబాంబుల శక్తితో సమానం.

కేంద్రక ఉష్ణోగ్రత 1 కోటి 36 లక్షల కెల్విన్లు. (~1,35,99,727 0 C)  

సూర్యుని కేంద్రకంలో సాంద్రత 150 గ్రాములు/సెంటీమీటర్3 గా ఉంటుంది.అంటే (భూమి మీద) నీటి

సాంద్రతలో ఒక గ్రాము బరువు తూగే వస్తువు సూర్య కేంద్రకంలో 150 గ్రాములు తూగిన దానితో సమానం.

మనం చూసే దృశ్య కాంతిలోని చాలా భాగం కాంతి ఫోటో స్ఫియర్ లేదా కాంతి మండలం నించి విడుదలవుతుంది.

క్రోమో స్ఫియర్ (వర్ణావరణం) మరియు కరోనా ల నుంచి కూడా కాంతి ప్రసారం జరుగుతుంది గానీ ఫోటో స్ఫియర్ నించి విడుదలయ్యే కాంతి తరంగాల శక్తి ముందు వీటిని మనం చూడలేం.అందువల్లే గ్రహణాల సమయంలో మాత్రమే మనం కరోనాను వీక్షించగలుగుతాం. 

రేడియో తరంగాలు,అల్ట్రా వయొలెట్ తరంగాలు,X మరియు ఆల్ఫా,బీటా,గామా తరంగాలు కూడా దృశ్య కాంతితో పాటే సూర్యుడి నించి విడుదలవుతూ ఉంటాయి.   

ఉష్ణ మరియు వికిరణ మండలాల్లో ఏర్పడిన ఫోటాన్లు కాంతి మండలం ద్వారా ప్రయాణించి వర్ణావరణాన్ని దాటుకుని సూర్యోపరితలమైన కరోనాను చేరుతాయి.కరోనాలో ఉష్ణోగ్రత దాదాపుగా 6000 కెల్విన్లు (~5727 0C).    

కాంతి మండలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల కంటె నల్లగా చుక్కల వలె కనిపిస్తాయి.వీటినే సన్ స్పాట్స్ అంటారు.

సన్ స్పాట్ల ఉష్ణోగ్రతలు దాదాపుగా 2,727–4,227 °C మధ్య ఉన్నా కాంతి మండలంలోని ఇతర ప్రాంతాలు ~5700 0C ఉష్ణోగ్రతలుకలిగి ఉండటం వల్ల సన్ స్పాట్స్ కాంతి మండలం లోని

కాంతివంతమైన మిగతా భాగాలకంటే నల్లగా కనిపిస్తాయి. ఇవి వికిరణావరణం లోని విద్యుత్ తరంగాల కదలికల వల్ల ఏర్పడతాయి.

ఇవి 10 కిలోమీటర్ల నించి మొదలుకొని 80,000 కిలోమీటర్ల వరకూ ఉంటాయి. ఇవి కాంతి మండలం నించి పైవైపుగా కదులుతూ సూర్యోపరితలానికి చేరి అదృశ్యమవుతూ ఉంటాయి. 

కాంతి మండలంలోని వికిరణ విద్యుత్ తరంగాల వల్ల గ్రాన్యూల్స్ ఏర్పడతాయి.ఇవి బుడగల్లాంటి ఆకారాలు.

ఇవి ఒక్కొక్కటీ దాదాపుగా 1000 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.ఇవి సూర్యోపరితలంపై ఏర్పడిన 8 నించి 20 నిమిషాల వ్యవధిలో అదృశ్యమవుతూ ఉంటాయి.

సూర్యుడి కరోనా నించి విరజిమ్మబడే ప్రకాశవంతమైన దారాల వంటి ప్రాంతాలను ప్రామినెన్సులు అని అంటారు.ఇవి వివిధ ఆకారాల్లో ఏర్పడతాయి.వీటినే సోలార్ ఫ్లేర్స్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు.ఇవి కొన్ని వేల కిలోమీటర్ల వరకూ ఉంటాయి.

 

—————————————————–

“సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు కదా!”  ఏదో ఆలోచనలో మునిగి ఉన్న మిహిర ఏకాంతం భగ్నం చేసాడు మాధవ్.

“ఊ..సూర్యుడు ఎర్రగా యాపిల్ పండులా కనిపిస్తున్నాడు.ఎంత ముద్దుగా ఉన్నాడో!!” మాధవ్ వంక ఓర చూపు చూస్తూ సమాధానమిచ్చింది మిహిర.

“అంటే నాలాగే చాలా క్యూట్ గా హీరోలా ఉన్నాడనమాట !”

“అవునవును ఎర్రగా,లంగూర్ కోతి పిల్లలా చాలా క్యూట్ గా ఉన్నాడు అచ్చూ నీలాగే !” 

“మరి నువ్వో,చెట్ల మీది నించి కిందికి దూకే నల్ల ఉడుత పిల్లలా ఉన్నావు..” మిహిరని ఉడికించాడు మాధవ్.

“నిన్నూ..ఇలా కాదు..చెప్తానుండు నీ సంగతి !” పిడికిళ్ళు రెండూ బిగించి మాధవ్ మీదకి యుద్ధానికి వచ్చింది మిహిర.

“హహ్హాహ్హా..నీ వల్ల కాదు నాతో గెలవడం!!”

“అదీ చూద్దాం..” మాధవ్ మీద పిడి గుద్దులు కురిపించింది మిహిర.

అలవోకగా ఆమె పిడి గుద్దుల నుంచి తప్పించుకుని ఆమెని బలంగా తన కౌగిల్లో ఒడిసి పట్టుకున్నాడు మాధవ్.

మిహిరా మాధవం : భాగం-3

బుధవారం-28 జులై ,2010

PSLV మూడో స్టేజ్ సౌరయాన్-1 నుంచి విడిపోయింది.కల్పనా క్యాప్స్యూల్ లో ఉన్న వ్యోమగాములు ముగ్గురికీ గ్రౌండ్ కంట్రోల్ నించి మూడో స్టేజ్ పూర్తైనట్టు సిగ్నల్స్ వస్తున్నాయి.

నాలుగో స్టేజ్ లో ఉన్న సౌరయాన్-1 కంట్రోల్ బాధ్యతలు ఇప్పుడు మాధవ్ నిర్వహిస్తున్నాడు.టెక్నికల్ గా చాలా చురుకైన వాడు కావడం చేత సౌరయాన్-1 మిషన్ ని కంట్రోల్ చెయ్యడానికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయాడు.శశాంక్ అతనికి కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నాడు.

 ”ఈటా..సౌరయాన్-1 అప్రోచింగ్ ISS,ప్లీజ్ పర్మిట్ డాకింగ్..”

 సౌరయాన్-1 నించి ISS స్పేస్ స్టేషన్ కి సిగ్నల్ అందించాడు మాధవ్.     

 వాళ్ళు ముగ్గురూ ఆతృతగా ISS ని చేరుకునే సమయం కోసం నిరీక్షిస్తున్నారు.

ISS దగ్గర వ్యోమగాములు సౌరయాన్-1 షటిల్ లోని ఇంధనం చంద్రుడి ఉపరితలాన్ని చేరుకుని మళ్ళీ తిరిగి ISS వచ్చే వరకూ సరిపోతుందో లేదో చెక్ చేసుకుని, అవసరమైతే అదనపు ఇంధనాన్ని అక్కడే నింపుకుని, సౌరయాన్-1 కి ఏదైనా ప్రమాదం వాటిల్లితే దాన్ని సరిచేసుకునే ఎక్విప్ మెంట్ కూడా అక్కడి నించే సమకూర్చుకుని చందమామ వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) :

ఇది అమెరికా,రష్యా,జపాన్,కెనడా మరియు యూరోపియన్ యూనియన్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్పేస్ స్టేషన్.

ఇందులో శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసుకోవడానికి అనుగుణంగా అధునాతన రీసెర్చ్ ల్యాబ్ లు అమర్చబడ్డాయి.ఇది భూమి చుట్టూ తిరుగుతూ శక్తివంతమైన ఆస్ట్రనామికల్ టెలిస్కోపుల సాయంతో సుదూర తీరాల్లో ఉన్న విశ్వ రహస్యాలను అన్వేషిస్తుంది.

ఇక్కణ్ణించి డిస్కవరీ,కొలంబస్ మరియు మిర్,సోయజ్ వంటి స్పేస్ షటిల్స్ ఆపరేట్ చెయ్యబడతాయి.

విశ్వంలో జీవుల ఉనికిని కనుక్కోవడానికి కావలసిన సదుపాయాలతో కూడిన జీవరసాయన ల్యాబులూ,ఉల్కలు-తోక చుక్కలు మొదలైన వాటి ఉపరితలాల నుంచి,ధూళి నుంచీ లభించే రసాయన మూలకాల గురించి అధ్యయనం చెయ్యడానికి జియో మరియు ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్,సుదూర తీరాల్లో ఉన్న నక్షత్రాలను,సౌరకుటుంబాలను  గురించి అధ్యయనం చేయడానికి ఆస్ట్రో ఫిజిక్స్ ల్యాబ్,స్పేస్ షటిల్స్ కి కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చగల సదుపాయాలూ,స్పేస్ స్టేషన్ ను మరమ్మతులు చెయ్యడానికి కావాల్సిన ఎక్విప్ మెంట్ మొదలైనవన్నీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉంటాయి.  

ఇది భూమికి 320 నుండి 347 కిలోమీటర్ల ఎత్తున లో-ఎర్త్-ఆర్బిట్ (LEO) లో పరిభ్రమిస్తూ తన కార్య కలాపాలను నిర్వహిస్తూ ఉంటుంది.

మాధవ్,శశాంక్ లిద్దరూ డైరెక్షన్స్ ప్రకారం ISS ను సమీపించడానికి సిద్ధమయ్యారు. ISS కంట్రోల్ విభాగంతో సౌరయాన్-1 కంట్రోల్ కనెక్ట్ చేసింది మిహిర.ISS లోని వారికి తమ కో-ఆర్డినేట్స్ పాస్ చేసారు మాధవ్,శశాంక్.

“ఆల్ఫా..అలర్ట్..సౌరయాన్-1 కమింగ్-ఇన్..”

“ప్లీజ్ ప్లేస్ ద షటిల్ ఇన్ ద డాక్..”

ISS కంట్రోల్ నుంచి వచ్చిన ఆర్డర్స్ పాటిస్తూ షటిల్ ని డాకింగ్ పొజిషన్లోకి మార్చాడు మాధవ్.

సౌరయాన్-1 ఇప్పుడు ISS స్పేస్ స్టేషన్ తో అనుసంధానం అయింది.

“Brilliant buddy!” శశాంక్ మాధవ్ ని అభినందిస్తూ అన్నాడు.

“Excellent!” మాధవ్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ అంది మిహిర.

“Thank you!” మృదువుగా ఆమె కరచాలనాన్ని అందుకున్నాడు మాధవ్.ఆరు నెలల కాలంలో ఎప్పుడూ కోల్డ్ వార్ చేసుకోవడమే గానీ ముఖా ముఖీ మిహిర మాధవ్ ని అభినందించడం ఇదే మొదటి సారి.

“ఇదేమిటి ? వీళ్ళిద్దరూ కొట్టుకోకుండా,తిట్టుకోకుండా ఇంత సౌమ్యంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు?”  ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి అయోమయంగా మొహం పెట్టాడు శశాంక్. 

తాము ISS తో అనుసంధానం అయినట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ ISRO Ground centre కి పంపించాడు మాధవ్  శశాంక్ మొహం చూసి చిరునవ్వు నవ్వుతూ.

కల్పనా క్యాప్స్యూల్ ఎంట్రన్స్ తలుపులు ISS లోపలికి తెరుచుకున్నాయి.వ్యోమగాములు ముగ్గురూ ISS లోకి ప్రవేశించారు.

అప్పటికే అక్కడ ఉన్న వివిధ దేశాల వ్యోమగాములు తమని తాము పరిచయం చేసుకుని మాధవ్,మిహిర,శశాంక్ ల మొట్ట మొదటి అంతరిక్ష యాత్ర సక్సెస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ విషెస్ తెలియజేసారు.

ఆ రాత్రి కొత్తగా వచ్చిన ముగ్గురు వ్యోమగాములకీ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చెయ్యబడింది.

డిన్నర్ తరవాత అరేంజ్ చెయ్యబడిన డ్రింక్స్ పార్టీలో రెచ్చిపోయి ఎంజాయ్ చేసేసాడు శశాంక్, మాధవ్ ఎంత వారిస్తున్నా వినకుండా.

డిన్నర్ పూర్తయాక అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

***********************************

కల్పనా క్యాప్స్యూల్ లో ఇంధనం లెవెల్స్ చెక్ చేస్తున్నాడు మాధవ్.

సాయానికి వస్తానన్నాడు శశాంక్.శశాంక్ పరిస్థితి చూసి అతణ్ణి పడుకోమని చెప్పి ఇంధనం లెవెల్స్ చెక్ చెయ్యడానికి ఒంటరిగానే వచ్చాడు మాధవ్.

మిహిర అంతరిక్షంలోంచి భూమిని ఫోటోలు తియ్యడానికి మిషన్ కంట్రోల్ రూములోని కెమెరా టెలిస్కోప్ దిశ సవరిస్తోంది.

కాసేపటి తరవాత ఆమెకి అంతరిక్షంలో పరిభ్రమిస్తూ నక్షత్రాల మధ్య నీలి రంగులో,అక్కడక్కడా అతికించినట్టున్న పచ్చని పచ్చిక బయళ్ళతో నయనానందకరంగా మిల మిలా మెరిసిపోతున్న వసుంధరా సాక్షాత్కారం అయింది.

కళ్ళింతలు చేసి ఆ దృశ్యాన్ని తన కళ్ళతో పాటు కెమెరా కంటిలోనూ బంధించింది మిహిర.

“మార్వెలస్!” ఒక్క అంగలో మాధవ్ ఉన్న చోటుకి పరుగున చేరుకుంది ఆమె.

మాధవ్ ని చూడగానే పరిగెత్తడం వల్ల వచ్చిన ఆయాసంతో వొగరుస్తూ నిలబడింది.

“హేయ్,ఎందుకలా ఆయాసపడుతున్నావు?” తలెత్తి చూసి ఎదురుగా ఉన్న మిహిరని ప్రశ్నించాడు మాధవ్.

“త్వరగా పద,నీకొకటి చూపిస్తాను” మాధవ్ చేయి అందుకుని తనతో పాటే మళ్ళీ కంట్రోల్ రూమ్ లోకి పరుగు తీసింది మిహిర.

టెలిస్కోప్ ని చేరుకోబోతూ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ఆగిపోయి నిలుచుంది మిహిర.

“హేయ్ మిహిరా,ఏమైంది?” అడిగాడు మాధవ్.

“ఒక్క నిమిషం..”

మాధవ్ వెనక్కి వచ్చి నిలబడింది.

“సర్ ప్రైజ్!” మాధవ్ రెండు కళ్ళనీ తన అరచేతులతో గట్టిగా మూసేసింది.

టెలిస్కోప్ ఐ-పీస్ ని రెండో చేత్తో మాధవ్ హైటుకి సరిపోయేలా అడ్జస్ట్ చేసింది.

నెమ్మదిగా తన అరిచేతులని మాధవ్ కళ్ళ మీది నించి విడదీసి,”ఇప్పుడు చూడు” చెప్పింది.

టెలిస్కోప్ ఐ-పీస్ లోంచి కనిపిస్తున్న భూమి సౌందర్యాన్ని చూసి చకితుడయ్యాడు మాధవ్.

“వావ్,వండర్ ఫుల్” అప్రయత్నంగానే అనేసాడు. 

అందులోంచి కనిపిస్తున్న భూమిని ఇద్దరూ మార్చి మార్చి చాలా సేపు తన్మయత్వంతో అలాగే చూస్తూ నిలుచున్నారు.

“హేయ్,మన భారతదేశం ఇందులోంచి ఎలా కనిపిస్తుందో చూద్దామా?” అడిగాడు మాధవ్.

“రాత్రి పూట మరీ అందంగా కనిపిస్తుందట” సునీ(సునితా విలియమ్స్) చెప్పింది,చటుక్కున అంది మిహిర.

“ఊహూ, మరి నేనూ ?” మారాం చేస్తూ అడిగాడు మాధవ్.

“సిగ్గు లేని అబ్బాయి,ఎప్పుడూ సొంత డబ్బాయే” అంది మిహిర సిగ్గు పడుతూ.

“అంతేగానీ నేనందంగా ఉన్నానని ఒప్పుకోవనమాట!” ఇంకాస్త గోముగా అడిగాడు మాధవ్.

“ఊహూ..” బెట్టు చేసింది మిహిర.

“సరే అయితే! నువ్వొప్పుకునే వరకూ ఈ లెన్స్ నా దగ్గరే ఉంచుకుంటానులే, ఒప్పుకున్నాక వచ్చి తీసుకో” చటుక్కున  టెలిస్కోప్ ఐ-పీస్ తీసేసి తన సూట్లో దాచుకున్నాడు మాధవ్.

                                               (ఇంకా ఉంది..)

మిహిరా మాధవం : భాగం-2

బుధవారం-21 జులై ,2010

తూనీగలా రివ్వున తిరిగి జీరో-జి ఛాంబర్ ని సమీపించింది మిహిర.

ఆమెని అనుసరించాడు మాధవ్.

ఛాంబర్లోకి అడుగు పెడుతూనే హెడ్ అడిగింది,”What are you both doing?? Where are U coming from?” 

“Hey U, Mihira – I am asking where are U coming from?” 

మిహిర సైలెంట్ గా నిలబడింది.

“There was some problem in the suction pump, we went to check that” చెప్పాడు మాధవ్.

“Oh honey, why didn’t U tell me before? Come in fast, we are getting late”

మాధవ్ చేతిని క్షణంలో ముద్దాడి వదిలేసింది హెడ్.

మిహిర కాస్త ఇబ్బందిగా చూసింది ఆవిడ వైపు.

కాసేపు తరవాత ఇంకో బ్యాచ్ కి ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది హెడ్.

“ఎప్పుడు చూసినా అమ్మాయిలకి సైట్ కొట్టడమేనా ? జీరో-జీ ట్రెయినింగ్ ఏమైనా సరిగ్గా పూర్తి చేసేదుందా?” కాస్త ఉడుకుమోతుతనంగా అడిగింది మిహిర.

“అమ్మాయిలే నాకు సైట్ కొడ్తున్నారు.నీకెందుకు అంత ఉడుకుమోతుతనం? కావాలంటే నువ్వు కూడా సైట్ కొట్టుకోవచ్చుగా? “ ఇంకాస్త ఉడికించాడు మాధవ్.

“వెయ్యిన్నొక్క జిల్లాల అందగాడు దిగి వచ్చాడనీ సైట్ కొట్టేస్తారు పాపం!”

“వెయ్యిన్నొక్కజిల్లాలేం లెక్క? పదకొండువేల నూటా పదకొండు అని సరి చేసుకో” 

“ఆహా..అలాగా?”

“యా!”

“కోతలాపి ట్రెయినింగ్ పూర్తి చెయ్యండి సర్!”

“ముందు మీరు మొదలెడితే తరవాత మేం మొదలెడతాం మేడమ్! మళ్ళీ ఫస్ట్ ఛాన్స్ కూడా అబ్బాయిలే తీసేసుకుంటున్నారు,నేనొక్కదాన్నే అమ్మాయినని నన్నన్యాయం చేస్తున్నారని హెడ్ మిస్ కి కంప్లెయింట్ వెళ్ళినా వెళ్ళొచ్చు!”

మాధవ్ వంక చుర చురా ఒక చూపు విసిరి ట్రెయినింగ్ కంటిన్యూ చెయ్యసాగింది మిహిర.

మాధవ్-మిహిర ఇద్దరూ ఒకచోట కలిసి ఉన్నారంటే అక్కడ మూడో ప్రపంచ యుద్ధమే,క్షణం కూడా విరామం లేకుండా ఇద్దరూ గొడవలు పడుతూ ఉంటారు.

శశాంక్ ని ఒకసారి మధ్యలోకి లాగుతే వీళ్ళ బారి నించి తట్టుకోలేక “నా వల్ల కాదు బాబోయ్ మీ తగవులకి తీర్పు చెప్పడం” అంటూ పారిపోయాడు.

వాళ్ళిద్దరూ ఉన్నారంటే ఆ ఛాయలక్కూడా వెళ్ళడు శశాంక్.

మిహిర అన్ని విషయాలూ బైటికి మాట్లాడలేదు.ఆమెకి కొంచం బిడియమెక్కువ. ఉడికించి ఆమెతో అన్ని విషయాలూ బైటికి మాట్లాడించాలని మాధవ్ తాపత్రయం.

మాధవ్ ప్రతి విషయాన్నీ ఓపెన్ ఫోరమ్ లో డిస్కషన్ పెడుతూ ఉంటాడు.అందుకని మిహిర ఎప్పుడూ మాధవ్ తో తగవు పడుతూ ఉంటుంది.

************************************

కొట్టుకుంటూ-తిట్టుకుంటూ మూడు నెలల ట్రెయినింగ్ లో మూడు వందల కోల్డ్ వార్ లు విజయవంతంగా పూర్తి చేసుకుని ట్రెయినింగ్ పూర్తి చేసారు మాధవ్-మిహిరలు.

వాళ్ళిద్దరి మధ్యా జరిగిన కోల్డ్ వార్ల అంకెలు లెక్క పెడుతూ డైరీలో నోట్ చేస్తుండేవాడు శశాంక్.

******************************************

జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ లో ట్రెయినింగ్ పూర్తి ఐపోగానే వాళ్ళు ముగ్గురూ బెంగుళూరు లోని ISRO కార్యాలయంలో మరియు దాని అనుబంధ సంస్థలలో,శ్రీహరి కోట లోని రాకెట్ లాంచింగ్ సెంటర్ వద్దా కొన్ని అనుబంధ ట్రెయినింగులు పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.

జీరో-జి ట్రెయినింగ్ సదుపాయాలు భారత దేశంలో ఇంకా అందుబాటులో లేకపోవడం వల్ల అదొక్కటి మాత్రం అమెరికాలో చెయ్యడం వ్యోమగాములకి తప్పని సరి అవుతోంది.

PSLV యొక్క నిర్మాణం,దాని వేగం గురించిన ప్రాథమిక సమాచారం తెలుసుకోవడంతో పాటు దానిలో ఉండే క్యాప్స్యూల్స్, ముఖ్యంగా మాధవ్-మిహిరలు ప్రయాణించబోయే కల్పనా క్యాప్స్యూల్ లోని electrical systems ని ఎలా యాక్సెస్ చెయ్యాలో, వాటిని ఎలా కంట్రోల్ చెయ్యాలో,వాటికి ఏవైనా మరమ్మత్తులు చెయ్యాల్సి వచ్చినపుడు ఎలా చెయ్యాలో మొదలైనవన్నీ వ్యోమగాములు మాధవ్-మిహిర,శశాంక్ లు నేర్చుకోవాల్సి ఉంటుంది.

మొత్తం కలిపి ఆరు నెలలకు పైగా సాగే ట్రెయినింగులో ఈ అంశాలన్నీ చక్కగా ఆకళింపు చేసుకుని రాబోయే తమ సౌరయాన్ – 1 ప్రయాణానికి సిద్ధమయ్యారు మాధవ్,మిహిర,శశాంక్.

సౌరయాన్ – 1 లో భాగంగా జాబిల్లి మీద అడుగు పెట్టి అక్కడి సమాచారమంతా సేకరించి తిరిగి భూమి మీదకు రావడం వాళ్ళకప్పగించబడిన బాధ్యత.

ట్రెయినింగ్ కాలం పూర్తి చేసుకుని వాళ్ళు ముగ్గురూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.

జూలై 19,2011:

PSLV సౌరయాన్-1 స్పేస్ షటిల్ యొక్క రివర్స్ కౌంట్ డౌన్ మొదలయింది.

యావద్భారతావనీ సౌరయాన్-1 కోసం ఉత్కంఠభరితమైన క్షణాల్ని లెక్కపెట్టుకుంటోంది.

జూలై 22,2011:

సమయం తెల్లవారు ఝాము మూడు గంటలా ముఫ్ఫై నిమిషాలు.

కల్పనా క్యాప్స్యూల్ లోకి ముగ్గురు వ్యోమగాములూ ప్రవేశించారు.క్యాప్స్యూల్ భద్రంగా PSLV సౌరయాన్ -1 స్పేస్ షటిల్ కి అనుసంధానించబడింది.

వ్యోమగాములు ముగ్గురూ తమకోసం నిర్దేశించబడిన సీట్లలో అప్రమత్తంగా ఉన్నారు.

మొదటి సారి అంతరిక్ష యానం చెయ్యబోతున్న ఉత్కంఠ వాళ్ళ ముగ్గురిలోనూ తొణికిసలాడుతోంది. మిహిర,శశాంక్ లు బాగా టెన్షన్ లో ఉన్నారు.

ఆ టెన్షన్ ని తగ్గించుకునేందుకు మాధవ్ మెడిటేషన్ సాయంతో తన భావోద్వేగాల్ని నియంత్రించుకుంటున్నాడు.

మిహిర తన ఇష్టదైవాలందరికీ మొక్కి ప్రార్థనలు చెయ్యడం మొదలు పెట్టింది.శశాంక్ మాత్రం దేవుణ్ణి పెద్దగా నమ్మడు కాబట్టి టెన్షన్ పడుతూ గోళ్ళు కొరుక్కుంటున్నాడు.

23 జూలై,2011 :

సమయం ఉదయం 6:30 నిముషాలు

ఇస్రో చైర్మన్ రాధా కృష్ణన్ మీడియా వారందరినీ సమావేశ పరిచి సౌరయాన్-1 ప్రణాళిక గురించిన కొన్ని వివరాలు వాళ్ళకి తెలియజేసారు.వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయబడిన ఒక సందేశం వాళ్ళు ముగ్గురికీ అందించారు.

దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో వ్యోమగాములకి శుభాకాంక్షలు తెలియజెయ్యడం ఇంకా సౌరయాన్-1 గురించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొదలైనవి ముఖ్యమైన అంశాలు.

సమయం వేగంగా కదులుతోంది.

25..24..23..22..21..20..19..18..17..

తమ మానిటర్లో ఉన్న వాయిస్ సిస్టమ్ ద్వారా బయట ISRO సూపర్ కంప్యూటర్లోని IVR లోంచి కౌంట్ డౌన్ ముగ్గురు వ్యోమగాములకీ స్పష్టంగా వినపడుతోంది.

“Are you ready guys?”

రాధా కృష్ణన్ వారితో లిఫ్టాఫ్ తీసుకోబోయే కొన్ని క్షణాల ముందు సంభాషించారు.

“Yes, sir”

“All the best with your mission. We wish you all to return soon to Earth with grand success!”

“Thank you very much Sir!” ముగ్గురు వ్యోమగాములూ ఎంతో ఉత్సాహంగా బదులిచ్చారు.

15..14..13..12..11..

కంట్రోల్ రూములోని ప్రతీ శాస్త్రవేత్తా ఊపిరి బిగపట్టుకుని ఫైనల్ కౌంట్ డౌన్ కోసం సమాయత్తమవుతున్నారు.

సమయం ఉదయం 7:07 AM

ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది.

10..9..8..7..6..5..4..3..2..1..0..

“Lift-off!”

ఒక్క కుదుపుతో లాంచింగ్ ప్యాడ్ ని దాటి రెప్పపాటు కాలంలో PSLV సౌరయాన్-1 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది.

“Wow! We took-off!”

కల్పనా క్యాప్స్యూల్ లోని మిహిరా,మాధవ్,శశాంక్ లు సౌరయాన్-1 ప్రయాణం మొదలవగానే పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

శాస్త్రవేత్తలందరూ తీక్షణంగా రాకెట్ మొదటి స్టేజ్ కో-ఆర్డినేట్స్ గమనిస్తున్నారు.

లిఫ్టాఫ్ తరువాతి మొదటి రెండు నిమిషాలలో PSLV ప్రయాణిస్తున్న కక్ష్య సరిగ్గా ఉన్నదీ లేనిదీ కో-ఆర్డినేట్స్ సాయంతో శాస్త్రవేత్తలు తెలుసుకుంటారు.

SHAR లోని సూపర్ కంప్యూటర్ మానిటర్ మీద PSLV యొక్క x, y, z co-ordinates, PSLV ప్రయాణిస్తున్న వేగం,దాని ప్రయాణ మార్గం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రెండు నిమిషాల అనంతరం విజయవంతంగా మొదటి స్టేజ్ రాకెట్ నించి విడిపోయింది.

శాస్త్రవేత్తలు ఊపిరి బిగపట్టి పదిహేను నిమిషాల సెకండ్ స్టేజ్ కౌంట్ డౌన్ కి సమాయత్తమయ్యారు.

లిఫ్టాఫ్ తరువాత 15 నిమిషాలకి PSLV రెండో స్టేజ్ దాటి జియో-సింక్రోనస్ కక్ష్య వైపు దూసుకెళ్ళింది.

హర్షాతిరేకాల మధ్య శాస్త్రవేత్తలందరూ శుభాభినందనలు తెలుపుకున్నారు.

PSLV  రెండో దశ విజయవంతంగా దాటిందన్న వార్త మీడియా ద్వారా తెలుసుకున్న ప్రజానీకం తమ తమ హర్షామోదాలు వ్యక్తం చేసారు.

లిఫ్టాఫ్ పూర్తైన 8 గంటలా 45 సెకన్లు..

ఇక సౌరయాన్-1 ప్రాజెక్టుకి అత్యంత ముఖ్యమైనది ఐన మూడవ స్టేజ్ సమీపించింది PSLV.ఈ దశని బట్టి ఆఖరుదీ,అసలుదీ ఐన జియో-సింక్రోనస్ కక్ష్య యొక్క భవితవ్యం తేల్చబడుతుంది.

ఆఖరి దశలో International space station దగ్గర వ్యోమగాములు మాధవ్,మిహిర ఇంకా శశాంక్ 24 గంటల హాల్ట్ తీసుకుని అక్కడి నించి తిన్నగా జాబిలి మీదకి కల్పనా క్యాప్స్యూల్ ద్వారా చేరుకుంటారు.

                                                      (ఇంకా ఉంది..)

మిహిరా మాధవం

గురువారం-15 జులై ,2010

జూలై 19, 2011:

 సౌరయాన్ – 1 ప్రాజెక్ట్ కోసం PSLV లాంచింగ్ వెహికిల్ సిద్ధంగా ఉంది.

 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వారు రాధా కృష్ణన్ నేతృత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సౌరయాన్ ప్రాజెక్టులోని వరుస అంతరిక్ష ప్రయోగాలలో మొదటిది,భారతావనికి తలమానికమైనది ఐనటువంటి ప్రయోగం మరి కొన్ని గంటల్లో జరగబోతూంది.

 సౌరయాన్ – 1 ఉపగ్రహానికి 72 గంటల కౌంట్ డౌన్ మొదలైంది.

 జూలై 23,2011 నాడు ఉదయం 07:07 నిమిషాలకి సౌరయాన్ – 1 అంతరిక్షంలోకి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది.

 సౌరయాన్ – 1 ప్రయాణ సన్నాహాలలో శాస్త్రవేత్తలందరూ తీవ్రంగా నిమగ్నమై ఉన్నారు.

 రాష్ట్రపతి,దేశ ప్రధాని లతో సహా దేశంలోని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఆ ప్రయోగం కోసం ఎదురు చూస్తున్నారు.

 అబ్దుల్ కలాం,మాధవన్ నాయర్,కస్తూరి రంగన్,రాధా కృష్ణన్ మొదలైన ప్రముఖ శాస్త్రవేత్తలంతా యాక్షన్ ప్లాన్ ని అంగుళం అంగుళం నిశితంగా గమనిస్తూ తగిన సూచనలూ,సలహాలూ ఒకరితో ఒకరు చర్చిస్తున్నారు.

 ఈ సారి సౌరయాన్ – 1 లోని ప్రత్యేకత భారతీయ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించడం. ఇదివరలో భారతీయ ఉపగ్రహాలు అందుకున్న విజయాల పరంపరలో వ్యోమగాములని అంతరిక్షంలోనికి పంపించలేకపోవడం ఒక్కటే కాస్త లోటు.

ఈ సారి ఆ లోటుని భర్తీ చెయ్యడానికి,భారత దేశపు ఖ్యాతి దశ దిశలా విస్తరింపజేయడానికీ సౌరయాన్ – 1 లో వ్యోమగాములని పంపించడానికి కావాల్సిన సమస్తమైన ఏర్పాట్లూ జరుగుతున్నాయి.

 మేధావులైన శాస్త్రవేత్తలు, ఎంపిక చేసిన ముగ్గురు వ్యోమగాములని అంతరిక్షంలోకి పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు స్వయంగా ఎంతో శ్రమకోర్చి చేస్తున్నారు.

 తొలి భారతీయ వనితా అంతరిక్ష వ్యోమగామి కల్పనా చావ్లా పేరు సౌరయాన్ అంతరిక్ష క్యాప్స్యూల్ మీద ముత్యాల్లాంటి అక్షరాలతో మెరుస్తూ ఉంది ఆమె జ్ఞాపక చిహ్నంగా.

 ***************************************

 డిసెంబర్,2010

 క్యాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ:

 మాధవ్,మిహిర,శశాంక్ -వీళ్ళు ముగ్గురూ క్యాలిఫోర్నియా లోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ లో అంతరిక్ష యానం కోసం కావాల్సిన జీరో గ్రావిటీ టెస్ట్ లు పూర్తి చేసుకుని సునితా విలియమ్స్ నేతృత్వంలోని టీమ్ లో శిక్షణ పొందుతున్నారు.

 మిహిర,శశాంక్ లిద్దరూ చాలా పంక్చువల్.మొదటి సారి భారతదేశం నించి అంతరిక్ష ప్రయాణం చెయ్యబోతున్నందుకు వాళ్లిద్దరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు.ప్రతి దానిలోనూ ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే అది చెయ్యవలసిందే.

 మాధవ్ కాస్త అల్లరి అబ్బాయి. టెక్నికల్ గా మిహిర,శశాంక్ ల కంటే మాధవ్ మంచి ఎక్స్ పర్ట్. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కూల్ గా ఉండటం మాధవ్ సహజ లక్షణం.  

మాధవ్ ప్రతి సారీ జీరో గ్రావిటీ రూమ్ లోకి రెండు మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చి వాళ్ళ హెడ్ చేతుల్లో సున్నితంగా మందలించబడుతూ ఉంటాడు.

 CIT క్యాంపస్ లో ఒక అందమైన అమ్మాయికి గులాబీ పువ్వులు ఇస్తూ ఈ రోజు మరికాస్త ఆలస్యం చేసాడు.

 ఛాంబర్లోకి వెళుతూనే తన ఫోన్ లోని వాయిస్ మెసేజెస్ వినడం మాధవ్ కి అలవాటు.

 యథా ప్రకారం ఛాంబర్లో అడుగు పెట్టి తన ఫోన్ వాయిస్ మెయిల్ బాక్స్ లోంచి వినిపిస్తున్న మెసేజ్ కి అలర్ట్ అయ్యాడు మాధవ్.వెంటనే జీరో గ్రావిటీ రూముకి పరిగెత్తాడు.

 “Hey guys, what’s the problem?” మాధవ్ మొహంలో ఎక్కళ్ళేని ఆతృత.ఏమైందో తెలుసుకోవాలన్న ఆరాటం.

 ”Suction pump is out of order. Could you please check the air pressure?”

 ”Yah, will try” ఆదరాబాదరాగా సక్షన్ పంప్ వైపు పరిగెత్తాడు మాధవ్.

 తీవ్రంగా సక్షన్ పంపు చూపిస్తున్న నంబర్లకేసి ఒకసారి చూసాడు.అక్కడ కనిపిస్తున్న నంబర్లన్నీ సవ్యంగానే ఉన్నాయి.అరగంట సేపు వెతికినా సక్షన్ పంపులో ఎలాంటి ప్రాబ్లమూ దొరకలేదు మాధవ్ కి.

 ఐతే మిహిర కావాలని తప్పుడు సమాచారం ఇచ్చి తనని ఏడిపించిందనమాట.

 “ఊ..ఈ కోతి పిల్ల పెళ్ళి చేస్తాను” ఉక్రోషంతో మాధవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి.

“Hey guys, there is a real serious problem out there in the pump and you are happily floating over here?” జీరో-జి రూమ్ లోకి వస్తూ మిహిరా, శశాంక్ లని ఉద్దేశించి అడిగాడు మాధవ్.

 ”Oh My God, what’s the problem?” లేని ఆతృత నటిస్తూ అడిగింది మిహిర.

 ”How can I show the problem here, u got to come to the pump baby” అన్నాడు మాధవ్.

 తను కావాలని మాధవ్ ని ఆట పట్టించడానికే చేసిందని తెలిసినా పైకి మాత్రం ఏమీ తెలియని దానిలా మాధవ్ తో పాటూ బయలుదేరింది మిహిర.

 మిహిరా,మాధవ్ లిద్దరూ సక్షన్ పంప్ ని సమీపించారు.

“See, there the problem is!” ఆ పంపులోని ఒక వాల్వ్ ని తన వేలుతో చూపుతూ చెప్పాడు మాధవ్.

 “What?” అని తొంగి ఆ వాల్వ్ వంక చూసింది మిహిర.

 ఆమెని వెనుక నించి తన బలమైన రెండు చేతులతోనూ ఒడుపుగా పారిపోవడానికి వీలు లేకుండా పట్టుకున్నాడు మాధవ్.

“యూ.. నన్నే ఆట పట్టిద్దామని చూస్తావా? ఇప్పుడేం చేస్తానో చూడు” ఆమె మొహాన్ని బాగా గాలి వీస్తున్న వైపుకి తిప్పాడు.

 ”ప్లీజ్ మాధవ్,ఐ యామ్ రియల్లీ వెరీ సారీ – నేను చేసింది తప్పే.. ఏదో మన హెడ్ ఆర్డర్ ఇచ్చినందుకు మిమ్మల్ని సరదాగా బెదిరిద్దామని అలా చేసాను.

సారీ చెప్తున్నాను కదా! ఇంక విడిచి పెట్టండి..ప్లీజ్!!” జాలిగా మాధవ్ మొహంలోకి చూస్తూ అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నం చేయసాగింది మిహిర.

 ”అదీ..అలా రా దారిలోకి” ఆమెని విడిచి పెడుతూ చెప్పాడు మాధవ్.

                                                      (ఇంకా ఉంది..)


Follow

Get every new post delivered to your Inbox.