మిహిరా మాధవం : భాగం – 4

“మాధవ్..ప్లీజ్! ఏమిటా అల్లరి?” అతణ్ణి వెంబడించింది మిహిర లెన్స్ కోసం.

మిహిర మాధవ్ భుజాల ఎత్తులో ఉంటుంది.అందుకే ఆ లెన్స్ అందుకోవడం ఆమెకు వీలు చిక్కడం లేదు.

ఇదే అదనుగా లెన్స్ ని కుడి చేతిలోంచి ఎడమ చేతిలోకీ ఎడమ చేతిలోంచి కుడి చేతిలోకీ వేగంగా సమయం చూసి మారుస్తూ లెన్స్ కోసం మిహిరతో దాదాపుగా బ్రేక్ డ్యాన్స్ చెయ్యిస్తున్నాడు మాధవ్.

అతని చేతుల హైట్ తను అందుకోలేనన్న విషయం కాసేపటికి అర్థమై ఏదో స్ఫురించిన దానిలా మాధవ్ దగ్గరికి వచ్చి అతడికి చక్కిలిగింతలు పెట్టింది మిహిర.చక్కిలిగింతలకి నవ్వుతున్న మాధవ్ చేతుల్లోంచి లెన్స్ ని లాగేసుకుంది.

“హేయ్..ఇది మోసం!” అన్నాడు మాధవ్.

“ఏం కాదు” అంది మిహిర.

“ఎందుక్కాదూ ? న్యాయంగా నా చేతుల్లోంచి లెన్స్ తీసుకోవాలి,చక్కిలిగింతలు పెట్టి తీసుకోకూడదు” కంప్లెయింట్ చేసాడు మాధవ్. 

“అవును పాపం! పొడుగ్గా ఉన్నామని చెప్పి పొట్టి వాళ్ళకి అందకుండా చేతుల్లోంచి లెన్స్ మార్చుకుని అందనివ్వకుండా ఏడిపించడం న్యాయం,చక్కిలిగింతలు పెట్టి నేను తీసుకుంటే మోసం ఎందుకవుతుంది? దానికీ దీనికీ చెల్లు. లెక్క సరిపోయింది” చెప్పింది మిహిర.

“ఊహూ..ఉండు చెబుతాను నీ సంగతి!” మిహిర దగ్గరి నించి మళ్ళీ లెన్స్ తన చేతుల్లోకి రప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మాధవ్.

“Hey Maddy,Ur friend is not doing well.Would you please mind to come with me?” ISS లోని డాక్టర్ ఆఘమేఘాల మీద మాధవ్ ని సమీపించింది.

 “What happened doctor?”

“Nothing is rigorously serious but seems some minor health problem” చెప్పింది డాక్టర్.

వెంటనే డాక్టర్ తో పాటు శశాంక్ ఛాంబర్లోకి వెళ్ళారు మిహిరా,మాధవ్.

“Hey Shashank, what happened?” ఆదుర్దాగా అడిగింది మిహిర.

“I Don’t know honey but I feel like I am flying upside down” భారంగా తల పట్టుకున్నాడు శశాంక్.

“వీడికి బాగా కిక్ ఎక్కినట్టుంది.ఇందాక వద్దురా అంటుంటే వినకుండా పార్టీలో బాటిల్ ఎంజాయ్ చేసిన ఎఫెక్టేమో” అనుకున్నాడు మాధవ్.

“మిహిరా! ఇప్పటికే చాలా ఆలస్యం అయింది,నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో.శశాంక్ దగ్గర నేనుంటాలే” చెప్పాడు.

“సరే!” శశాంక్ కి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది మిహిర.

“అసలేం జరిగిందిరా?” అడిగాడు మాధవ్ మిహిర వెళ్ళిపోయాక రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ.

“ఏమోరా..డిన్నర్ తరవాత డ్రింక్ తీసుకున్నాను కదా,కాసేపటికి కడుపులో అంతా పిచ్చి పిచ్చిగా ఉంటే ఈ డాక్టర్ ని పిలిచాను.టాబ్లెట్స్ ఇచ్చింది, అవేసుకోగానే వామిటింగ్స్ అయ్యాయి.ఆ తరవాత నించీ తల తిప్పుతోంది.నేను తల కిందులుగా వేళాడుతున్నట్టూ,తరవాత కాసేపటికి ఎక్కడో లోయలో పడిపోతున్నట్టూ అనిపిస్తుంది.ఫీవర్ కూడా ఉందని డాక్టర్ చెప్పింది.” 

“ఐతే స్పేస్ అడాప్టేషన్ సిండ్రోమ్ అనమాట” అన్నాడు మాధవ్.

“ఊ”..

“నువ్వు ఈ స్టేజ్ లో రాగలవా మరి సౌరయాన్-1 మిషన్ లో?”

“లేదురా, నా వల్ల కావడం లేదు.మీరిద్దరూ వెళ్ళండి.నేను రిటర్న్ వెళ్ళిపోతా”

“సరే, ఐతే నేను ISRO గ్రౌండ్ కంట్రోల్ కి ఇన్ ఫార్మ్ చేస్తాను”

శశాంక్ ఆరోగ్యం గురించి మిహిరతో సంప్రదింపులు జరిగిన తరువాత కూడా ఆమె తొట్రు పడక సౌరయాన్-1 మిషన్ కోసం తన సంసిద్ధత వ్యక్తం చెయ్యడంతో ISRO లోని గ్రౌండ్ కంట్రోల్ ని సంప్రదించాలని నిశ్చయించాడు మాధవ్.

కల్పనా క్యాప్స్యూల్ లోకి వెళ్ళి మానిటరింగ్ సిస్టమ్ ఆన్ చేసాడు.

కాసేపటికి ISRO కంట్రోల్  తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది.

శశాంక్ పరిస్థితి గురించి వాళ్ళకి క్లుప్తంగా వివరించి తనూ,మిహిరా సౌరయాన్-1 మిషన్ కొనసాగిస్తామని తెలియజేసాడు మాధవ్.

శశాంక్ ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా సౌరయాన్-1 మిషన్ ఆగిపోకుండా కొనసాగేందుకు మాధవ్, మిహిరలు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ఆమోదించారు ISRO ఛైర్మన్. 

ప్రణాళిక ప్రకారం సరిగ్గా 24 గంటల హాల్ట్ ముగించుకుని,పూర్తి స్థాయిలో ఇంధనం సమకూర్చుకుని మిహిరా,మాధవ్ ల సాహసంతో తిరిగి జాబిలి మీదకి ప్రయాణాన్ని సాగించింది సౌరయాన్-1.

అత్యున్నతమైన సౌందర్యంతో శోభిల్లే ధరణీ తలాన్ని, పర్యావరణాన్ని దాటుకుని సౌరకుటుంబం లోకి తమ మొదటి అడుగు వేసారు మిహిరా – మాధవ్ లు.

భూమిని దాటిన తరువాత చంద్రుణ్ణి చేరుకోవడానికి సౌరయాన్-1 కి మరో ఐదు రోజులు పడుతుంది.

భూమి నించి దూరం వెళుతున్నకొద్దీ ఎటు చూసినా అన్ని వైపులా ఆవరించి ఉన్న శూన్యం.

ఆ శూన్యంలో వెలుగులు విరజిమ్ముతూ మన సౌరకుటుంబం లోని ఏకైక నక్షత్రం సూర్యుడు గోచరించాడు వారికి శతకోటి,సహస్రకోటి వజ్ర కాంతులతో దీప్తమై తనకి సాటి మరెవరూ లేరన్నంత ధీమాగా..   

సూర్యుడు

భూమికి  సమీపంలో ఉన్న ఏకైక నక్షత్రం.

భూమి మీద జీవరాశులకి,వాటి మనుగడకి కావాల్సిన సమస్త పదార్థాలూ తన కిరణాల రశ్మి ద్వారానే ప్రసాదిస్తున్న అతి శక్తివంతమైన నక్షత్రం.

సూర్యుడు పాలపుంత లోని ఓరియన్ మండలానికి చెందిన నక్షత్రం.

నక్షత్రాల కాంతి తీవ్రతని బట్టి సూర్యుడు G2V మెయిన్ సీక్వెన్స్ విభాగానికి చెందిన నక్షత్రం.

ఇంద్ర ధనుస్సులోని రంగులు ఊదా రంగుతో మొదలై ఎరుపు రంగుతో సమాప్తమవుతాయని మనకి తెలుసు కదా! అలాగే తారల్లోనూ వర్ణపటకం ఊదా రంగుతో మొదలై ఎరుపు రంగుతో సమాప్తం అవుతుంది.

వర్ణ పటకంలో అన్నిటికన్నా చివర ఉండే రంగు యొక్క ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.అంటే ఎరుపు రంగు యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందనమాట!  అందువల్ల ఎరుపు రంగులో ఉండే తారల ఉష్ణోగ్రతలు తక్కువగానూ,ఊదా రంగులో ఉండే తారల ఉష్ణోగ్రతలు ఎక్కువగానూ ఉంటాయని మనం తెలుసుకోవచ్చు.

నక్షత్రాల వర్ణాలను వివిధ విభాగాల్లో వర్గీకరించడం జరిగింది.ఈ వర్ణ విభాగాలు నక్షత్రాలకి మాత్రమే వర్తిస్తాయి (ఎందుకంటే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు).

ప్రస్తుతం దూరదర్శినుల ద్వారా మనం వీక్షించ గలుగుతున్న నక్షత్రాలని వాటి వర్ణాల ఆధారంగా 7 విభాగాల్లోకి వర్గీకరించడం జరిగింది.అవి O,B,A,F,G,K మరియు M 

ఈ వర్ణమాలని సులభంగా గుర్తుంచుకోవడానికి ఈ క్రింది పదాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది.

“Oh Be A Fine Girl and Kiss Me!!”

ఇందులో O రకానికి చెందిన తారలు అమితమైన ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి.క్రమ క్రమంగా B,A,F వర్గాలకి చెందిన నక్షత్రాల ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఆఖరున ఉన్న M రకానికి చెందిన తారలు O రకం తారలతో పోల్చితే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి.

O రకం తారలు నీలం రంగులోనూ

A రకం తారలు తెలుపు రంగులోనూ

G రకం తారలు పసుపు రంగులోనూ

M రకం తారలు ఎరుపు రంగులోనూ ఉంటాయి.

మన సూర్యుడు ఇందులో G రకం తారల కోవలోకి వస్తాడు.

ఒక్కొక్క తారకీ వర్ణ మాపక సంఖ్య 0-10(వర్ణ తీవ్రత 0-100%) గా ఉంటుంది. ఈ సంఖ్య ప్రకారం సూర్యుడు G2 విభాగానికి చెందుతాడు.G2 అంటే పసుపు రంగు నుండి కొంచం దూరంగా 20% కాషాయ రంగు (ఆరెంజ్) వర్ణం కలిగిన మెయిన్ సీక్వెన్స్ K రకం తార వైపుగా తన వర్ణ మాపకాన్ని కలిగి ఉంటాడు. 

ఇక సూర్యుడి కాంతి తీవ్రత మరియు మిగతా తారలతో పోల్చి చూసినప్పుడు సూర్యుడి పరిమాణం ప్రకారం రోమన్ అక్షరం (0-7 లేదా 0-VII) విభాగాల్లో V విభాగం పరిధిలోకి వస్తాడు.

విభాగం -  0 రకానికి చెందిన తారలు బృహత్తారలు.ఇవి సూర్యుడికంటే కొన్ని కోట్ల రెట్లు హెచ్చు ఉష్ణోగ్రతల వద్ద ఉంటాయి.సూర్య కాంతికి కోట్ల రెట్లు ప్రకాశవంతమైన కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి.  

విభాగం -  I  రకానికి చెందిన తారలు మహా తారలు.ఇవి కూడా సూర్యుని కంటే కొన్ని లక్షల రెట్లు ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి.ఇవి బృహత్తారల కంటే కొంచం తక్కువ కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి.

విభాగం – II  రకానికి చెందిన తారలు బృహత్కాంతిమత్తారలు.ఇవి విభాగం – I తారల కంటే తక్కువ కాంతిని ప్రసరిస్తూ ఉంటాయని మనం సుళువుగానే తెలుసుకోవచ్చు.

విభాగం – III రకానికి చెందిన తారలు ఘనకాంతిమత్తారలు. సూర్యుని కంటే కొన్ని వేల రెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి.విభాగం-II తారల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. 

విభాగం – IV రకానికి చెందిన తారలు కాంతిమత్తారలు.సూర్యుని కంటె కొన్ని వందల రెట్లు కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. 

విభాగం – V రకానికి చెందిన తారలు కుబ్జ తారలు లేక మెయిన్ సీక్వెన్స్ తారలు లేక డ్వార్ఫ్ తారలు.ఇవి సూర్యునితో దాదాపుగా సమానమైన ద్రవ్యరాశిని కలిగి సూర్య కాంతితో సమానమైన కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి.    

ద్రవ్య రాశి మరియు కాంతి తీవ్రతని బట్టి సూర్యుణ్ణి V అంటే డ్వార్ఫ్ లేదా మెయిన్ సీక్వెన్స్ రకానికి చెందిన తారగా మనం గుర్తించవచ్చు.

కాబట్టి సూర్యుడు 20% కాషాయ రంగు వర్ణ మాపకాన్ని కలిగిన పసుపు పచ్చ తార లేదా G2V మెయిన్ సీక్వెన్స్ తారగా మనం గుర్తించవచ్చు. 

ఇక విభాగం – VI రకానికి చెందిన తారలు మహాకుబ్జ తారలు.

విభాగం – VII రకానికి చెందిన తారలు శ్వేతకుబ్జ తారలు.

ఈ రెండు విభాగాలకి చెందిన తారలు సూర్యుడి కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు కలిగి తక్కువ కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి.

పైన చెప్పిన 0-V విభాగాల్లోని తారలు కొన్ని వేల కోట్ల సంవత్సరాల తరువాత తమలోని ద్రవ్యరాశిని కోల్పోతూ కోల్పోతూ విస్ఫోటనం చెంది రెడ్ జెయింట్ (అరుణకుబ్జ) లేదా వైట్ డ్వార్ఫ్(శ్వేతకుబ్జ ) తారలుగా మారిపోతాయి.మహా కుబ్జ,శ్వేత కుబ్జ తారలు మాత్రం తమలోని ఇంధనాన్ని కోల్పోక కోట్ల సంవత్సరాల తరువాత కూడా వాటి యథా స్థితుల్లోనే ఉంటాయి.

సూర్యుడు భూమికి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.

ఒకవేళ మనం కాంతి వేగంతో గనుక ప్రయాణిస్తే సూర్యుణ్ణి 8 నిమిషాల 19 సెకన్లకు చేరుకోగలుగుతాం.అంటే సూర్యుడు మనకి 8 కాంతి నిమిషాల దూరంలో ఉన్నాడనమాట!

సూర్యుడి వయసు 46 కోట్ల సంవత్సరాలు.     

పాలపుంత నిహారిక మధ్య భాగానికి సూర్యుడు 26,000 కాంతి సంవత్సరాల దూరంలోని ఓరియన్ అనే మండలంలో పాలపుంత చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు.

సూర్యుని వ్యాసం దాదాపుగా 13,92,000 కిలోమీటర్లు. అంటే దాదాపుగా 109 భూ వ్యాసాలతో సమానం.అంటే ఒక్క సూర్యుడిలో 109 భూగోళాలను పట్టించవచ్చు!

సూర్యుడు ఆరు లక్షల కిలోమీటర్ల చదరపు వైశాల్యం కలిగి ఉంటాడు.సౌరకుటుంబం లోని 99% ద్రవ్యరాశి సూర్యుడి నించి ఉత్పన్నమైనదే.సూర్యుడు తనలోని విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావం వల్ల దాదాపుగా గుండ్రని ఆకారం కలిగి ఉంటాడు.

సూర్యుడి కేంద్రకం మరియు ధృవాల వద్ద వంపులో తేడా ~10 కిలోమీటర్లు.

అందువల్ల సూర్యుడు ప్రస్ఫుటమైన గోళాకారాన్ని కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు.

అదే మన భూమి మరియు ఇతర గ్రహాల మీద విద్యుదయస్కాంత క్షేత్రాల బలం సూర్యుడి మీద కంటే తక్కువ కాబట్టి పూర్తి గోళాకారం కాకుండా అంచుల దగ్గర కొద్దిగా చదును చేయబడ్డ బంతుల వలె ఉంటాయి.

సూర్యుడు ప్రధానంగా వాయువులతో ఏర్పడిన గోళం.సూర్యుడి ఉపరితలం లోని ఉష్ణోగ్రతలు కొన్ని లక్షల డిగ్రీల సెల్సియస్ లో మరియు కేంద్రక ఉష్ణోగ్రతలు కొన్ని కోట్ల డిగ్రీల సెల్సియస్ లలో ఉంటాయి కాబట్టి సూర్యుడి కేంద్రకంలో పదార్థం వాయు రూపంలో కాక అణువులు,పరమాణువులు ఎక్కడివక్కడ విడిపోయిన ప్లాస్మా స్థితిలో ఉంటుంది.

సూర్య కేంద్రకంలో ఉన్న పదార్థం ప్లాస్మా స్థితిలోనూ,ధృవాల వద్దనున్న పదార్థం వాయు రూపంలోనూ ఉండటం వల్ల సూర్య కేంద్రకం (తన చుట్టూ తాను తిరిగే సమయం 26 రోజులు ) ధృవాల వద్ద (తన చుట్టూ తాను తిరిగే సమయం 34 రోజులు) కన్నా ఎక్కువ వేగంతో పరిభ్రమిస్తూ ఉంటుంది.అందువల్ల సూర్యుడు తన చుట్టూ తాను   కలన భ్రమణం (differential rotation) చేస్తూ ఉంటాడు. 

సూర్యోపరితలం మొత్తాన్ని 9 భాగాలుగా విభజించవచ్చు.

 1.కేంద్రకం

2.ఉష్ణ మండలం

3.వికిరణ మండలం

4.ఫోటో స్ఫియర్

5.క్రోమో స్ఫియర్

6.కరోనా

7.సన్ స్పాట్

8.గ్రాన్యూల్స్

9.ప్రామినెన్సులు

సూర్య  కేంద్రకంలో ఉన్న హైడ్రోజన్ అణువులలోని ప్రోటాన్-ప్రోటాన్ మధ్య సంయోగం జరిగినప్పుడు హైడ్రోజన్ అణువు హీలియం అణువుగా రూపాంతరం చెందుతూ దానితోబాటే అమితమైన ఉష్ణ శక్తి కేంద్రకం నించి విడుదలవుతూ ఉంటుంది.ఈ శక్తి కొన్ని లక్షల అణుబాంబుల శక్తితో సమానం.

కేంద్రక ఉష్ణోగ్రత 1 కోటి 36 లక్షల కెల్విన్లు. (~1,35,99,727 0 C)  

సూర్యుని కేంద్రకంలో సాంద్రత 150 గ్రాములు/సెంటీమీటర్3 గా ఉంటుంది.అంటే (భూమి మీద) నీటి

సాంద్రతలో ఒక గ్రాము బరువు తూగే వస్తువు సూర్య కేంద్రకంలో 150 గ్రాములు తూగిన దానితో సమానం.

మనం చూసే దృశ్య కాంతిలోని చాలా భాగం కాంతి ఫోటో స్ఫియర్ లేదా కాంతి మండలం నించి విడుదలవుతుంది.

క్రోమో స్ఫియర్ (వర్ణావరణం) మరియు కరోనా ల నుంచి కూడా కాంతి ప్రసారం జరుగుతుంది గానీ ఫోటో స్ఫియర్ నించి విడుదలయ్యే కాంతి తరంగాల శక్తి ముందు వీటిని మనం చూడలేం.అందువల్లే గ్రహణాల సమయంలో మాత్రమే మనం కరోనాను వీక్షించగలుగుతాం. 

రేడియో తరంగాలు,అల్ట్రా వయొలెట్ తరంగాలు,X మరియు ఆల్ఫా,బీటా,గామా తరంగాలు కూడా దృశ్య కాంతితో పాటే సూర్యుడి నించి విడుదలవుతూ ఉంటాయి.   

ఉష్ణ మరియు వికిరణ మండలాల్లో ఏర్పడిన ఫోటాన్లు కాంతి మండలం ద్వారా ప్రయాణించి వర్ణావరణాన్ని దాటుకుని సూర్యోపరితలమైన కరోనాను చేరుతాయి.కరోనాలో ఉష్ణోగ్రత దాదాపుగా 6000 కెల్విన్లు (~5727 0C).    

కాంతి మండలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల కంటె నల్లగా చుక్కల వలె కనిపిస్తాయి.వీటినే సన్ స్పాట్స్ అంటారు.

సన్ స్పాట్ల ఉష్ణోగ్రతలు దాదాపుగా 2,727–4,227 °C మధ్య ఉన్నా కాంతి మండలంలోని ఇతర ప్రాంతాలు ~5700 0C ఉష్ణోగ్రతలుకలిగి ఉండటం వల్ల సన్ స్పాట్స్ కాంతి మండలం లోని

కాంతివంతమైన మిగతా భాగాలకంటే నల్లగా కనిపిస్తాయి. ఇవి వికిరణావరణం లోని విద్యుత్ తరంగాల కదలికల వల్ల ఏర్పడతాయి.

ఇవి 10 కిలోమీటర్ల నించి మొదలుకొని 80,000 కిలోమీటర్ల వరకూ ఉంటాయి. ఇవి కాంతి మండలం నించి పైవైపుగా కదులుతూ సూర్యోపరితలానికి చేరి అదృశ్యమవుతూ ఉంటాయి. 

కాంతి మండలంలోని వికిరణ విద్యుత్ తరంగాల వల్ల గ్రాన్యూల్స్ ఏర్పడతాయి.ఇవి బుడగల్లాంటి ఆకారాలు.

ఇవి ఒక్కొక్కటీ దాదాపుగా 1000 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.ఇవి సూర్యోపరితలంపై ఏర్పడిన 8 నించి 20 నిమిషాల వ్యవధిలో అదృశ్యమవుతూ ఉంటాయి.

సూర్యుడి కరోనా నించి విరజిమ్మబడే ప్రకాశవంతమైన దారాల వంటి ప్రాంతాలను ప్రామినెన్సులు అని అంటారు.ఇవి వివిధ ఆకారాల్లో ఏర్పడతాయి.వీటినే సోలార్ ఫ్లేర్స్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు.ఇవి కొన్ని వేల కిలోమీటర్ల వరకూ ఉంటాయి.

 

—————————————————–

“సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు కదా!”  ఏదో ఆలోచనలో మునిగి ఉన్న మిహిర ఏకాంతం భగ్నం చేసాడు మాధవ్.

“ఊ..సూర్యుడు ఎర్రగా యాపిల్ పండులా కనిపిస్తున్నాడు.ఎంత ముద్దుగా ఉన్నాడో!!” మాధవ్ వంక ఓర చూపు చూస్తూ సమాధానమిచ్చింది మిహిర.

“అంటే నాలాగే చాలా క్యూట్ గా హీరోలా ఉన్నాడనమాట !”

“అవునవును ఎర్రగా,లంగూర్ కోతి పిల్లలా చాలా క్యూట్ గా ఉన్నాడు అచ్చూ నీలాగే !” 

“మరి నువ్వో,చెట్ల మీది నించి కిందికి దూకే నల్ల ఉడుత పిల్లలా ఉన్నావు..” మిహిరని ఉడికించాడు మాధవ్.

“నిన్నూ..ఇలా కాదు..చెప్తానుండు నీ సంగతి !” పిడికిళ్ళు రెండూ బిగించి మాధవ్ మీదకి యుద్ధానికి వచ్చింది మిహిర.

“హహ్హాహ్హా..నీ వల్ల కాదు నాతో గెలవడం!!”

“అదీ చూద్దాం..” మాధవ్ మీద పిడి గుద్దులు కురిపించింది మిహిర.

అలవోకగా ఆమె పిడి గుద్దుల నుంచి తప్పించుకుని ఆమెని బలంగా తన కౌగిల్లో ఒడిసి పట్టుకున్నాడు మాధవ్.

ప్రత్యుత్తరమిమ్ము

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.