పండు స్నానానికి వెళ్ళిన సమయంలో రూముకి కన్నమేసి అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్ని కొట్టేసారు నందూ-చందూ..
ఆ బ్యాగులు చచ్చేంత బరువుండడంతో పండు అసలు ఏం తిని ఇలాంటి బ్యాగుల్ని సునాయాసంగా మోసేస్తున్నాడా అని ఎంతో ఆశ్చర్యం చెందారు.
బ్యాగుల్ని రూములోంచి బైటికి తీసుకెళ్ళడం కష్టం కావడంతో పండు రూములోని కిటికీ నించి ఆ బ్యాగుల్ని కింద పార్క్ చేసిన వాళ్ళ ట్రక్కులోకి విసిరేసి పైప్ గుండా ట్రక్ లోకి దిగాడు నందూ.
పైప్ పట్టుకుని కిందికి దిగుతుండగా మధ్యలో కాలు ఇరుక్కుపోయి దాన్ని లాగలేక తంటాలు పడుతున్నాడు చందూ.
ఈ లోపే ధడేలుమన్న చప్పుడు వినిపించడంతో హుటాహుటిన తన స్నానం ముగించి రూములోకి వచ్చాడు పండు.
ఎదురుగా పెట్టిన తన అమెరికన్ టూరిస్టర్ బ్యాగులు కనిపించకపోవడంతో రూమ్ అంతా కలయజూసాడు.
తన రూమ్ లోని విండో తెరిచి ఉండడంతో పండుకి అనుమానం వచ్చి విండో దగ్గరికెళ్ళి పరిశీలనగా చూసాడు.
ట్రక్కులోని నందూ చందూకి కాలు బైటికి ఎలా లాక్కోవాలో చెప్తూ కనిపించాడు.
“ఆగండ్రా దొంగ వెధవల్లారా,ఎక్కడికిరా పారిపోతారు? నా చేతుల్లో ఐపోయారు” మెరుపులా లిఫ్టులో కిందికి దిగి నందూ-చందూల్ని వెంబడించాడు పండు.
కాలు వాచిపోయి కుయ్యో-మొర్రోమంటూ ట్రక్కులోకి దూకేసాడు చందూ.వెంటనే నందూ ట్రక్ స్టార్ట్ చేసి ఎదురుగా ఉన్న రోడ్డులోకి తిప్పాడు.
“ఒరేయ్..చచ్చార్రా నా చేతుల్లో” అక్కడ కనిపించిన బైక్ తీసుకుని ట్రక్కుని వెంబడించాడు పండు.
కొండల్లో గుట్టల్లో అష్టా వక్ర వంకర్లు తిప్పుతూ ట్రక్ నడిపిస్తున్నాడు నందూ.
వాళ్ళకేమాత్రం తగ్గకుండా బైక్ ని తిప్పుతూ వాళ్ళ పాలిటి యముడిలా తయారయ్యాడు పండు.
పండు బారి నించి తప్పించుకోవడానికి రక రకాల పథకాలు వేస్తూ స్పీడు కంట్రోల్ చెయ్యలేక ఒకానొక రాంగ్ టైములో రోడ్డు మీదున్న గుంటలో ట్రక్కుని దిగేసాడు నందూ.
ఆ దెబ్బతో ట్రక్కు టైరులో ఒక పెద్ద మేకు దిగబడిపోయింది.
సడన్ బ్రేక్ వేసాడు పండు.లేపోతే ఎదురుగా వస్తున్న లారీ తనని ఢీకొనేదే.వచ్చే ప్రమాదాన్ని ఆపడానికి సడన్ బ్రేక్ వేసి లెఫ్టుకి కట్ చేసాడు పండు.
బైక్ పల్లం లోకి వెళ్ళి ఆగిపోయింది.
ఈ లోపు నందూ-చందూ అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్ని చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాటిని తీసుకుని కుడివైపుగా ఉన్న కొబ్బరి తోటల్లోకి పరిగెత్తారు.
వాళ్ళని చూసి తనూ కోకోనట్ గార్డెన్ లోకి పరిగెత్తాడు పండు.
పొదల మాటుకి పారిపోయి దాక్కున్నారు నందూ-చందూ.
వాళ్ళ వెనక పరిగెడుతున్న పండు చిత్రంగా ఆగిపోయాడు.
కళ్ళు నులుముకుని చూసాడు,తను కింద పడిపోయి ఉన్నాడు.
తలెత్తి పైకి చూసాడు పండు.
ఎదురుగా లంగా-ఓణీలో బొద్దుగా ముద్దుగా ఉన్న కేరళ కుట్టి కంటపడింది.
“సారీ..రియల్లీ వెరీ సారీ..” వచ్చీ రాని ఇంగ్లీష్ ని మళయాళీ యాక్సెంట్ లో మాట్లాడిందా అమ్మాయి.
వాగుతూనే ఉంది నాన్-స్టాప్ నాన్సెన్స్ లా మళయాళంలో.
ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు పండుకి.
“హేయ్ పిల్లా..ఏమనుకుంటున్నావసలు? నిలువెత్తు అబ్బాయికి నీ ఇష్టమొచ్చినట్టు డ్యాషిచ్చెయ్యడమేనా?” పైకి లేచి ఆ పిల్లని తెలుగులో బెదిరించాడు పండు.
అర్థం కానట్టు అయోమయంగా మొహం పెట్టి తుర్రుమందా అమ్మాయి.
ఆమె ఎటు వెళితే అటే తిరుగుతూ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు పండు ఆ అమ్మాయిని.
“వాట్ యువర్ ప్రాబ్లం మిస్టర్?” వచ్చీ రాని ఇంగ్లీష్ లో అడిగింది.
“యూ ఆర్ మై బిగ్ ప్రాబ్లం.టెల్ మీ వేర్ ఆర్ ద థీవ్స్?” కొబ్బరి మట్ట ఒకదాన్ని వంచుతూ అడిగాడు పండు.
“థీవ్స్..మీన్స్?”
“దొంగ వెధవలు.”
“ఓ..దే..థీవ్స్?”
“2 పర్సన్స్,బ్యాగ్..దే రన్..ఐ రన్.. యూ కమ్..ఐ డాష్” చెప్పింది ముక్కలు ముక్కలుగా.
“మా తల్లే ! ఏం ఇంగ్లీష్ మాట్లాడుతున్నావో,బంగారు తల్లి.ఇప్పుడూ..వేర్ ద థీవ్స్ గో?”
“దే గో బుష్. ఐ రన్..యూ కమ్”
“ఓహో..అదా నీ గోల..ఓ.కే”
ఆ కేరళ కుట్టి చూపించిన పొద వైపు పరిగెత్తాడు పండు.
ఆయాసంతో పొదల్లో కూలబడి బ్యాగులు తెరిచిన నందూ-చందూ అవాక్కయ్యారు.
“ఛ..ఒక వంద కోట్లున్నయ్యేమో అని ఎంత ఫీలయ్యాను? తీరా చూస్తే పాపిన్స్,ఇవా ఈ బ్యాగుల్లో ఉన్నది?” నందూ ఆవేశంగా చందూని పట్టుకుని ఊపేస్తున్నాడు.
“ఒరేయ్ నందూ,పైన ఇలాంటి పాపిన్స్ పెట్టి కింద డబ్బుల కట్టలేమైనా పెట్టారేమోరా..” డౌట్ వెలిబుచ్చాడు చందు.
“నీ బొంద” గద్దించాడు నందు.
సాలోచనగా ప్యాకెట్ చింపి ఒక నిమ్మబిళ్ళని నోట్లో వేసుకున్నాడు చందు.దాని టేస్టుకి ముగ్ధుడైపోయాడు.
“నువ్వు కూడా ట్రై చెయ్యరా..” పన్లో పనిగా ఇంకో నిమ్మబిళ్ళని నందూ చేతికందించాడు చందు.
“ముందా దిక్కుమాలిన పాపిన్స్ ని నా కళ్ళ ముందు నించి తీసెయ్” ఆజ్ఞాపించాడు నందు.
“ఎవడిదిరా దిక్కుమాలిన పాపిన్స్,నా నిమ్మబిళ్ళల్ని అవమానిస్తారా?” వెనుక నించి మెరుపులా కొబ్బరి మట్టతో వాడి గుండు మీద ఒకటి తగిలించాడు పండు.
ఆ దెబ్బకి గింగిరాలు తిరిగిపోయి కింద పడ్డాడు నందు.
చందుకి ఇంక పరిగెత్తడానికి దమ్ము సరిపోక పండుకి సరెండర్ అయ్యాడు.
“ఈ పనేదో గంట క్రితం చేసుంటే ఈ ఛేజింగ్ ఎపిసోడ్ తప్పేది కదా..అనవసరంగా నా టైమ్ వేస్ట్ చేసారు కదరా!” తన అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్ని సర్దుకుంటూ అన్నాడు పండు.
“ఎలాగూ వాణ్ణొకటి పీకాను కదా,ఇప్పుడు నిన్ను కూడా ఒకటి పీకుతానేం” కొబ్బరి మట్ట చేతిలోకి తీసుకుని ఓ డైలాగిచ్చాడు.
“వద్దన్నా..ప్లీజే” బ్రతిమిలాడాడు చందు.
“లాభం లేదురా,మిమ్మల్నిద్దర్నీ గాలికొదిలేస్తే మళ్ళీ కన్నాలేస్తారు” అదే మట్టతో చందూ గాడి గుండు మీద ఒక్కటి వేసాడు పండు.
నందూ-చందూ ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయారు.
“వాట్ మూవీ యూ వాచ్,కమ్ హియర్” – కొబ్బరి చెట్ల చాటు నించి తొంగి తొంగి చూస్తున్న కేరళ కుట్టిని పిలిచాడు పండు.
“గివ్ మీ వన్ రోప్” ఆర్డర్ వేసాడు.
పండుని అక్కడ కనిపిస్తున్న ఒక కాటేజ్ లోకి తీసుకెళ్ళింది కుట్టి.
అక్కడి వాళ్ళిచ్చిన తాడుతో నందూ-చందూల్నిద్దరినీ కట్టేసి పోలీసులకి ఫోన్ చేసాడు.
“థాంక్స్ ఫర్ ద హెల్ప్.టేక్ వన్ నిమ్మబిళ్ళ” తన నిమ్మబిళ్ళని కుట్టికి ఆఫర్ చేసాడు పండు.
“థాంక్స్” సిగ్గుతో మెలికలు తిరుగుతూ నిమ్మబిళ్ళ తీసుకుంది కుట్టి.
“వాట్ ఈజ్ యువర్ నేమ్?”
“రుక్మిణి” కొబ్బరి పుల్లతో ఆడుతూ చెప్పింది.
“ఓ..నైస్ నేమ్.మై సెల్ఫ్,వాసుదేవ్.కాల్ మీ పండు” షేక్ హ్యాండిచ్చాడు పండు.
“పండూ” – ముద్దుగా పిలిచింది కుట్టి.
“యా..టెల్ మీ”
“యూ డాష్,ఐ డాష్.యూ షేక్ హ్యాండ్,ఐ షేక్ హ్యాండ్.వీ మ్యారేజ్..ఓవర్” చెప్పింది కుట్టి.
“వాట్?” అదిరి పడ్డాడు పండు.
పండు చెయ్యి పట్టుకుని వాళ్ళ గూడెం లోకి తీసుకెళ్ళింది రుక్కూ.
సింగిల్ గా వెళ్ళి జంటగా ఇంటికి తిరిగొచ్చాడు పండు.
ఇంటికొస్తూనే సహదేవ్-వీణాపాణి పెళ్ళి ఫిక్స్ ఐన విషయం తెల్సుకున్నాడు.
“ఓరి దుర్మార్గుడా,కన్యాకుమారిలో కన్యా కుమారి తో డ్యూయెట్ వేస్కోవడానికెళ్ళావా?” సహదేవ్ ని ఆట పట్టించడం మొదలు పెట్టాడు పండు.
“పెద్దాడికి పెళ్ళి చేద్దామనుకుంటుంటే నేనేం తక్కువ తిన్లేదని నువ్వు కూడా కాంపిటీషన్ కి తయారయ్యావుగా!” పండు తల మీద ప్రేమగా ఒక్కటి వేసింది అమ్మ.
అర్థం కాని అయోమయంలో నవ్వింది రుక్కూ.
ఆ తరవాత పండు కేరళ కుట్టికి ఎంతో కష్టపడి తెలుగు నేర్పించాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా!