అతను తెల్లగా,బొద్దుగా ఉంటాడు.
దోసకాయ లాంటి మొహం.
ఉన్నాయా,లేవా తెలియనట్టుండే చీకిరి కళ్ళు.ఆ చీకిరి కళ్ళను కప్పేస్తూ ఫెండీ చలువ కళ్లజోడు.
గుక్కీ బ్రాండ్ దుస్తులంటే మహా ఇష్టం.డెనిమ్ జీన్స్ అంటే మక్కువ ఎక్కువ.
అతని పోర్టికోలో పదికి తక్కువ కాకుండా స్పోర్ట్స్ కార్లుంటాయి.వాటిలో అతనికిష్టమైనది మెక్ లారెన్ మెర్సిడెస్.
ఎక్కడికి వెళ్ళినా తన వెంట అర్మానీ బ్లాక్ కోడ్ పర్ఫ్యూమ్ బాటిల్ మర్చిపోకుండా వెంట తీసుకెళ్తాడు.
చెవులకి పోగులూ,చింపిరి జుట్టూ అతని స్టైల్.
ఇంటి నించీ ఆఫీసు గది వరకూ ఏసీ లేకుండా అసలు రోజు గడవదు.
అతనే రాజ్ అలియాస్ రాజయ్య.
చిన్నప్పుడు అతణ్ణి ఇంట్లో వాళ్ళు రాజిగా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవాళ్ళు.
పదిహేడేళ్ళ వరకూ చిల్లర తిరుగుళ్ళు తిరిగిన రాజి గాడి దశ ఒక రోజు తిరిగిపోయింది.
అధికార పక్షం M.L.A అయిన ఆగన్నని ప్రతిపక్షం వాళ్ళ చెప్పుల దాడి నించి అనుకోకుండా రక్షించి రాత్రికి రాత్రే ఆ నాయకుడి నమ్మిన బంటు అయిపోయాడు.
రెండేళ్ళు తిరిగే సరికి రాజి గాడు ఆగన్న రైట్ హ్యాండ్ అయిపోయాడు.ఎక్కడ రాళ్ళూ,చెప్పుల దాడి జరగాలన్నా రాజి గాడే.
అంతే కాకుండా ఆగన్నకి అడ్డు చెప్పిన వాళ్ళని లేపెయ్యడం,ఆగన్న ఫ్యాక్టరీల మీద సహాయ నిరాకరణోద్యమాలు చేసిన వాళ్ళని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం రాజి గాడి స్పెషల్ సిద్ధాంతాలు.
ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోవాల్సిన 21ఏళ్ళ వయసులో స్పెషల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇన్ రౌడీయిజం,గూండాయిజం పట్టా పుచ్చుకుని ధన్యుడైపోయాడు రాజి గాడు.
ఇలా ఉండగా సంవత్సరం తరవాత -
తన ఒక్కగానొక్క చెల్లెలు అంజమ్మ అలియాస్ అంజని కి సైట్ కొట్టిన రాజి గాడి దౌర్జన్యం భరించలేక ఆగన్న అంజమ్మని తన దోస్తు M.L.A కొడుకు యెంకన్నకిచ్చి పెళ్ళి చెయ్యడంతో ఆగన్న మీద మెరుపు దాడి చేసి అతణ్ణి భూస్థాపితం చేసి M.L.A గా ఎదిగిపోయాడు.
M.L.A గా మారగానే తన పేరు రాజ్ గా మార్చేసుకున్నాడు.అన్నిటికన్నా బాగా ఆమ్యామ్యాలొచ్చే ఎక్సైజ్ శాఖని తన స్వంతం చేసుకుని 1000 బెల్టు షాపుల యజమానిగా పాతికేళ్ళకే బోలెడంత పేరు సంపాదించుకున్నాడు.
తనకి ఎలాగూ పొట్ట పొడిస్తే అక్షరమ్ముక్క రాదు కాబట్టి CIEFL లో ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకుని అమెరికా వెళ్ళి తిరిగొచ్చిన NRI హ్యారీ అనబడే హరిని ఒకానొక శుభోదయాన హైద్రాబాదులో కిడ్నాప్ చేసి తన పర్సనల్ అసిస్టెంటుగా నియమించుకున్నాడు.
తల్లిదండ్రులు,అక్కా-తమ్ముళ్ళు లేని హ్యారీ రాజ్ నెల నెలా ఇచ్చే 50,000 bucks కోసం అతని అసిస్టెంటుగా మారడానికి ఒప్పేసుకున్నాడు.
దానితో పాటు బోనస్ గా రాజ్ వాడే స్పోర్ట్స్ కార్లూ,పర్ఫ్యూమ్ బాటిల్సూ అప్పుడప్పుడూ సోదర ప్రేమతో హ్యారీ కూడా ఉపయోగించుకుంటుండేవాడు.
రాజ్ హ్యారీని ఈ విషయంలో ఏమీ అనకుండా చూసీ చూడనట్టుండేవాడు.హ్యారీ అంటే రాజ్ కి వల్లమాలిన అభిమానం.
హ్యారీ రాజ్ కి ఎన్నో విషయాలు నేర్పించాడు.అందులో ఈ స్టైల్ మెయింటెనెన్స్ కూడా ఒకటి.
హ్యారీ దగ్గరుండి రాజ్ కి అమెరికా లైఫ్ స్టైల్,టాటూలు వేసుకోవడం ఎలా? ఎలాంటి హెయిర్ స్టైల్ ఉంటే అమ్మాయిల హాట్ ఫేవరిట్ అవుతారు?
పోగులు ఎక్కడ పెట్టుకోవాలి? గడ్డం ఎలా పెంచాలి? గుబురు మీసాల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ నేర్పిస్తుండేవాడు.
హ్యారీ గాడు తనకింకో ఏడు సంవత్సరాల క్రితం దొరికుంటే అంజూ ని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో తెలిసేది కదా అని రాజ్ అప్పుడప్పుడూ విచారిస్తూ ఉంటాడు ఏకాంతంలో.
రెండేళ్ళు తిరిగే సరికి రాజ్ చెయ్యి వెయ్యని శాఖ లేదు ఆంధ్ర ప్రదేశ్ లో.
గనుల శాఖ నించీ బొగ్గు గనుల శాఖ దాకా విమానయాన శాఖ నించీ విద్యుత్ శాఖ దాకా,విద్యా శాఖ నించీ ఉద్యోగ శాఖ దాకా ఒక్కడే లీడర్ గా ఎదిగిపోయాడు.
హ్యారీ గోల్డెన్ లెగ్గు వల్లే తన ఆస్తి వెయ్యి రెట్లు,లక్ష రెట్లు,కోటి రెట్లు అయ్యిందన్న నమ్మకం బలంగా ఉండేది రాజ్ కి.
స్వీడన్ ఎయిర్ పోర్ట్, చెకింగ్ కౌంటర్
రాజ్ స్పెషల్ సమ్మర్ హాలిడే గడిపి స్వీడన్ నించి తిరిగి వస్తుండగా ప్రమాద వశాత్తూ అతని పాస్ పోర్ట్ మరో రాజ్ అనబడే రాజేష్ పాస్ పోర్టుతో మారిపోయింది.
అది గమనించని రాజ్ మామూలుగానే హైద్రాబాద్ తిరిగొచ్చాడు.
అక్కణ్ణించీ రాజేష్ కష్టాలు మొదలయ్యాయి.
రాజేష్ వాళ్ళది మధ్య తరగతి కుటుంబం.
ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని రాజేష్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు.
విదేశాల్లో ఉద్యోగం సంపాదించి కనీసం ఒక నాలుగైదు కోట్లు వెనకేసుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని నమ్ముతాడు.
రాజేష్ అనే మూడక్షరాల పేరు ఇంగ్లీష్ వాళ్ళకి పలకడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పదో తరగతి సర్టిఫికెట్ నించీ తన పేరు రాజ్ గా మార్చుకున్నాడు దూర దృష్టితో.
M.S పూర్తి చేసి స్వీడన్ లో తన ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసమని వెళ్ళాడు.వస్తూ వస్తూ పాస్ పోర్టులు మారిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు.
ఇండియా రాగానే అ పాస్ పోర్టులో ఉన్న అడ్రస్,ఫోన్ నంబర్ల కోసం ఆచూకీ సేకరించాడు గానీ అవి బోగస్ అని తేలడంతో ఏమీ చెయ్యలేక పోలీస్ స్టేషన్లో తన పాస్ పోర్ట్ పోయిందని ఒక కంప్లెయింట్ రాసి ఇచ్చి తన ఇంటికి తిరిగొచ్చాడు.
పది వేల రూపాయల అమ్యామ్యా సమర్పించుకుంటే పాస్ పోర్ట్ వెతికిస్తామని చెప్పిన పోలీసులు అంతటితో ఆగకుండా రాజ్ దగ్గర చీటికీ మాటికీ ఏదోక వంకతో లక్షన్నర దాకా వసూలు చేసారు పాస్ పోర్ట్ ఇవ్వకపోగా.
అసలే మంచి ఉద్యోగం లేక, అటుపై అప్పు చేసి స్వీడన్ వెళ్ళొచ్చిన భారంతో బాధ పడుతున్న రాజ్ నెత్తిన మూలిగే నక్కమీద తాటి పండు పడ్డ చందంగా ఈ లక్షన్నర కొత్త అప్పు తయారయి కూర్చుంది.
రాజి గాడి ఐరన్ లెగ్గు పుణ్యమా అని రాజేష్ బతుకు బందరు బస్ స్టాండ్ ఐపోయింది.
గుడ్డిలో మెల్లలా అప్పుడే ISRO లో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఖాళీలు వెయ్యడంతో ఏదో ఒకటిలే ఈ అప్పు తీర్చడానికి అనుకుని ఆప్లై చేసి పరీక్ష రాసి నెలకి పది వేల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకున్నాడు రాజేష్.
పేరుకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయినా రాకెట్లకి నట్లూ,బోల్టులూ బిగించే బాధ్యత రాజేష్ నెత్తిన పడింది.
“ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన నేను మెకానికల్ ఇంజనీర్లా నట్లూ,బోల్టులూ బిగించాల్సి వస్తోంది.నా ఖర్మ!” అని తన స్నేహితుల దగ్గర వాపోయాడు రాజేష్.
“భారత దేశంలో మంచి చదువు చదివిన వాళ్ళకి ఇలాంటి ఉద్యోగాలే వస్తాయిరా! నువ్వేం బాధ పడకు,ఏదోక నాడు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది” అనునయించారు రాజేష్ స్నేహితులు.
ఆ మాటలతో ఊరట చెందిన రాజేష్ తన ఉద్యోగానికి అంకితమయ్యాడు.
———————————————————-
రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీస్, సికింద్రాబాద్
పది గంటలకి తన సీట్లో వచ్చి కూర్చుంది సారిక.
“అబ్బబ్బా,మనల్ని కనీసం కంప్యూటర్ ఆన్ కూడా చెయ్యనివ్వకుండా ఈ క్యాండేట్స్ అంతా అప్లికేషన్లతో వచ్చి పడతారు.విదేశాలకెళ్ళకపోతే ఏం కొంపలంటుకుపోతున్నాయని ఇక్కడ? కనీసం లిప్ స్టిక్ వేసుకుని,మేకప్ చేసుకునే టైమైనా ఇవ్వరు కదా – ఏమంటావే సరూ?” అడిగింది పక్క సీట్లో
కూర్చునే దేవి.
“హహ్హహ్హా..” పెద్దగా నవ్వింది సారిక.
సీనియర్ ఆఫీసర్ చురచురా చూసాడు సారిక వంక,”ఆఫీసంతా వినిపించేలా బిగ్గరగా ఏమిటా నవ్వు? ముందు పని కానివ్వు”
“అదే కదండీ ఇప్పుడు చేస్తున్నది,కనీసం నవ్వడానిక్కూడా మాకు హక్కు లేదా?” కాస్త గట్టిగా అడిగింది.
“ఎందుకు లేదమ్మా,ఈ నెల టార్గెట్ పది వేల పాస్ పోర్టులు.అదైపోయాక తీరిగ్గా నవ్వుదువు గానీ,ఎవరు వద్దన్నారు?”
“ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ ముసలాడికి? ఒక డొక్కు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చాం కదా అని ముక్కు పిండి మరీ పని చెయ్యిస్తున్నారు” తిట్టుకుంటూ కంప్యూటర్లో తల దూర్చింది సారిక.
సంవత్సరం ఉద్యోగం తరవాత మళ్ళీ కొత్త పాస్ పోర్ట్ కోసం అప్లై చేసుకున్నాడు రాజేష్.
“కనీసం దుబాయ్ పెట్రోల్ బంకులో పెట్రోల్ బాయ్ గా చేరినా అప్పులు రెండేళ్ళలో తీరిపోతాయి.ఈ నట్లూ,బోల్టులూ బిగించుకోవడం కన్నా అదే నయం” అని.
* * * * *
“ఏమిటయ్యా ఈ అప్లికేషన్,ఇలాగేనా నింపేది? ఊపుకుంటూ పాస్ పోర్టుల కోసం వచ్చేస్తారు.ఎవడయ్యా నిన్ను లోపలికి పంపించింది?” అరుస్తున్నాడు సీనియర్ ఆఫీసర్.
“మొదలయ్యింది ముసలాడి గోల” గొణిగింది దేవి.
“ఊరుకోవే,విన్నాడంటే నీ టార్గెట్ పెంచేస్తాడు.పొద్దున్నే ఫైర్ మీద ఉన్నాడు” మందలించింది సారిక.
* * * * *
లైన్లో నిలబడ్డ రాజేష్ అరుస్తున్న ముసలి ఆఫీసర్ వంక చూసాడు.
——————————————————–
“ఏమిటిది? అడ్రస్ లేదూ,ఎడ్యుకేషన్ డిటెయిల్స్ లేవూ,ఫోన్ నంబర్ లేదూ..ఈ చెత్త ఫామొకటి తీసుకొచ్చి పాస్ పోర్ట్ ఇవ్వమంటే ఎక్కణ్ణించి ఇష్యూ చెయ్యాలనుకున్నావు?గాల్లోంచి పాస్ పోర్ట్ ఊడి పడుతుందా??” క్లాస్ పీకుతున్నాడు ఆఫీసర్.
అతనికెదురుగా ఒక 23-24 ఏళ్ళ అబ్బాయి నిలబడి ఉన్నాడు.
“నాకేం తెలీదు సార్,గేటు దగ్గర ఏజెంట్ నా దగ్గర 2500 తీసుకుని పాస్ పోర్ట్ ఇప్పిస్తా అని చెప్పి లోపలికి పంపించాడు” చెప్పాడా అబ్బాయి.
“ఆహా! ఐతే ఈ అప్లికేషన్ మొత్తం నింపి పట్టుకురా.ఆ తరవాత నాకింకో 10 వేలివ్వు,నీ పాస్ పోర్ట్ తయారు చేసి ఇస్తాను.వాడు చెప్తాడూ,వీడు వస్తాడూ..” ఫామ్ ని ఆ పిల్లాడి మీదికి విసిరేస్తూ అన్నాడు ఆఫీసర్.
“పెద్ద వీడొక్కడే భారతీయుడు రేంజులో ఆ ఫోజు చూడు” సారికకి వినిపించేలా మంద్రంగా అంది దేవి.
చిరు నవ్వొకటి విసిరేసి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది సారిక.
రాజ్ కంటే ముందు ఇంకో పాతిక మంది దాకా లైన్లో నిలబడి ఉన్నారు.
వచ్చిన ప్రతి అప్లికెంటు మీదా చిర్రు బుర్రులాడుతునే ఉన్నాడు ఆఫీసర్.ఒక పది అప్లికేషన్ ఫాముల దాకా విసిరేసాడు అప్పటికే.
పదకొండు అవ్వగానే టీ బ్రేక్ అని లేచి వెళ్ళిపోయాడు ఆఫీసర్.
“ఇంట్లో పెళ్ళాం టిఫిన్ పెట్టినట్టు లేదు.ఆ కోపమంతా వీళ్ళ మీద ప్రదర్శిస్తున్నాడు” అనుకుంది సారిక.
గంట సేపటి తరవాత తిరిగొచ్చాడు.అప్పటికే అక్కడ నిలబడి ఉన్న వాళ్ళ కాళ్ళు పీక్కు పోతున్నాయి.
ముందు రోజు రాత్రి నించీ చాపలూ,దిండ్లతో వచ్చి అక్కడే పడుకుని తెల్లారగానే లైన్ లో నిల్చున్న వాళ్ళున్నారు వాళ్ళలో. రాజ్ ది కూడా అదే పరిస్థితి.
ఇంకో ఐదు అప్లికేషన్ ఫాములు విసిరేసిన ఆఫీసర్ మళ్ళీ లంచ్ బ్రేక్ అని బైటికెళ్ళాడు.
కోపం నషాళానికంటింది రాజేష్ కి.
తిన్నగా సారిక సీట్ దగ్గరికి వచ్చాడు.”ఈ ముసలోడు ఎప్పుడొస్తాడు లంచ్ బ్రేక్ నించి?” విసురుగా అడిగాడు.
తలెత్తి చూసింది సారిక.
“ఏమోనండీ,అది అతని మూడ్ ని బట్టి ఉంటుంది.”
“చింపెయ్యడం,విసిరెయ్యడం తప్పించి వేరే పనేమీ ఉన్నట్టు కనిపించట్లేదు.ఇతనికి పాస్ పోర్ట్ ఇచ్చే మూడెప్పుడొస్తుంది ఇలా ఐతే?
నిన్న రాత్రి నించీ లైన్లో నిల్చున్నాం.కళ్ళు తిరిగిపోతున్నాయి,గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నాయి.టీ కోసమే గంట సేపు వెళ్ళాడు.వీడి లంచ్ అయ్యే వరకూ ఇంకెన్ని గంటలు నిల్చోవాలి?” నిలదీసాడు రాజ్.
“చూడండి మిస్టర్,మీరు బాగా కోపంలో ఉన్నారు కదా! ఈ కోపంలోనే అతణ్ణి నాలుగు కడిగెయ్యండి. ఇక్కడ చూడండి కనీసం 300 మంది ఉన్నారు లైన్లో.వీళ్లందరి అప్లికేషన్లూ నేను ప్రాసెస్ చెయ్యాలి.” సమాధానమిచ్చింది సారిక.
“వాణ్ణెలాగూ కడిగేస్తాను. పోయిన సారి కూడా ఇలాగే గంటలు గంటలు నిల్చోబెట్టి మూడు నెల్ల తరవాత పాస్ పోర్ట్ ఇచ్చారు.అతణ్ణొక్కణ్ణి కాదు మీ అందరినీ నిలబెట్టి కడిగెయ్యాలి” అన్నాడు రాజేష్.
“అయ్యయ్యో,మమ్మల్నందర్నీ వద్దండీ! అంతటికీ అతనే కారణం” అఫీసర్ సీటు వంక చూపించింది సారిక.
“అవునవును” వంత పాడారు లైన్లో నిల్చున్న వాళ్ళు.వాళ్ళకి మహా ఆనందంగా ఉంది ఇలా ఒకబ్బాయి వెళ్ళి వాళ్ళని అరుస్తున్నందుకు.
రెండు గంటల తరవాత తిరిగొచ్చాడు ఆఫీసర్.
ఇంకో ఐదు మంది అప్లికేషన్లు విసిరేసాడు.
* * * * *
రాజేష్ వంతు వచ్చింది.
అప్లికేషన్ ఫామ్ అతనికివ్వకుండా గడకర్రలా నిల్చున్నాడు రాజ్.
“అప్లికేషన్ ఫామ్” తన కళ్ళ జోడు సవరించుకుంటూ అడిగాడు ఆఫీసర్.
“ఎందుకూ,నువ్వెలాగూ విసిరేస్తావు కదా!” అన్నాడు రాజ్.
“ఏమిటయ్యా నీ ఉద్దేశ్యం?”
“నువ్వు పొద్దుణ్ణించీ విసిరెయ్యకుండా,చించెయ్యకుండా వదిలేసిన అప్లికేషన్ ఫాములెన్నో చెప్పు పోనీ?” ముందుకి వంగి ఆఫీసర్ కళ్ళలో కళ్ళు పెట్టి అడిగాడు రాజ్.
“మిస్టర్,యూ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్” అరిచాడు ఆఫీసర్.
“యూ హావ్ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్” ముందుకి వంగి ఆఫీసర్ దగ్గర మోగుతున్న సెల్ ఫోన్ లాక్కున్నాడు రాజ్.
“మర్యాదగా చెప్తే వినర్రా మీరూ..” లేచి నిలబడ్డాడు ఆఫీసర్.
వెంటనే రాజ్ వెనక్కి తిరిగి చూసాడు.లైన్లో నిలబడ్డ వాళ్ళంతా ఒక్క సారిగా ముందుకొచ్చి ఆఫీసర్ని చితగ్గొట్టారు.
అనుకోని ఈ సంఘటనకి భయంతో వాళ్ళు నిల్చున్న వైపు చూసింది సారిక.
“గదిలో పెట్టి కొడితే పిల్లి ఐనా ఇంతేనమ్మా” అన్నాడు వాళ్ళలో ఒకడు.
గది తలుపులు మూసేసాడు రాజేష్.
“ఎక్కడికి పారిపోతావురా? ఈ రోజు వీళ్ళందరి పాస్ పోర్టులూ ప్రాసెస్ చేసే వరకూ నిన్నీ గదిలోంచి బైటికి వెళ్ళనివ్వను” ఆఫీసర్ పక్కనే ఇంకో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.
మొదట్లో కాస్త భయపడ్డా ఆఫీసర్ చినిగిపోయిన షర్టూ,దేభ్యం మొహమూ చూసి నవ్వు ముంచుకొచ్చేసింది సారికకి.
“భలే ఉన్నాడు ఈ అవతారంలో,వీడి తిక్క ఇవాళ్టికి కుదిరింది” అని సంబరపడిపోయింది.
తన సెల్ ఫోన్ తో చడీ చప్పుడూ లేకుండా ఆఫీసర్ ని ఒక ఫోటో కూడా తీసుకుంది. “అచ్చూ అడుక్కు తినే వాళ్ళా ఉన్నాడు,వీడికిప్పుడు జోలె ఒకటే తక్కువైంది” అనుకుంటూ..
సారిక ఫోటో తియ్యడం రాజ్ చూసాడు.
దేవి,సారిక ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు ఆఫీసర్ని చూసి.అదంతా గమనిస్తూనే ఉన్నాడు రాజ్.
ఆఫీసర్ మొత్తుకుంటూ తిట్టుకుంటూ తన ఎదురుగా లైన్లో నిల్చున్న వాళ్ళందరి అప్లికేషన్లూ తీసుకుని కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నాడు.
“మరి నా అప్లికేషనెవరు చేస్తారు,మీ తాతయ్యా? ఊపుకుంటూ ఆఫీసులకొచ్చేస్తారు.పబ్లిక్ సర్వెంట్ అని బోర్డ్ తగిలించుకుంటే కాదు.పబ్లిక్ కి సర్వీస్ చెయ్యాలి” ఆఫీసర్ని ఉరిమాడు రాజ్.
“చేస్తానయ్యా బాబూ,ఆగు.చేస్తాను.చెయ్యకపోతే చస్తాను” భయం భయంగా చూసాడు ఆఫీసర్.
“తియ్ అప్లికేషన్ ఫామ్.ఆన్-లైన్.నేను డిటెయిల్స్ చెప్తానూ,అది నింపు” డిమాండ్ చేసాడు రాజ్.
గత్యంతరం లేక అప్లికేషన్ ఫామ్ తీసాడు ఆఫీసర్.
రాజ్ డిటెయిల్స్ చెప్తుంటే అతను ఫామ్ నింపుతున్నాడు.
“రీ-అప్లై.నా పాస్ పోర్ట్ పోయింది.కొత్తది కావాలి” చెప్పాడు రాజ్.
వివరాలు నింపడం పూర్తైపోయింది.
“సార్,నేనింక ఇంటికి వెళ్ళొచ్చా?” దీనంగా అడిగాడు ఆఫీసర్.
“ఏమిటి వెళ్ళేది? నా పాస్ పోర్ట్ నా చేతిలో పెట్టే వరకూ నిన్ను వదిలేది లేదు”
“వారం రోజులు పడ్తుంది సార్”
“నాకు ఇవాళే,ఇప్పుడే కావాలి” ఆర్డర్ వేసాడు రాజ్.
“సార్,మీ పాత పాస్ పోర్ట్ ఇంకా యాక్టివ్ స్టేజ్ లోనే ఉంది.అది సబ్మిట్ చేస్తే గానీ కొత్తది ఉపయోగించడానికి వీల్లేదు.అదెక్కడుందో ట్రేస్ చేసే టైమైనా మీరు మాకివ్వాలి కదా!” కనీసం రెండు రోజుల టైమ్ కావాలి.అన్నాడు ఆఫీసర్.
అతను చెప్పింది సబబు గానే అనిపించింది రాజ్ కి.
“సరే ఐతే,ఏడువ్” అతణ్ణి వదిలి పెట్టాడు.
రాజ్ గది బైటికి వెళ్ళగానే సారిక పరిగెత్తుకుంటూ అతనికోసం బైటికి వచ్చింది.
“ఎక్స్ క్యూజ్ మీ,మిమ్మల్నే మిస్టర్ బ్లాక్ టీ-షర్ట్!” పిలిచింది సారిక.
“యా..” వెనక్కి తిరిగి చూసాడు రాజ్.
“ఆ ముసలోడికి బలే కోటింగ్ ఇచ్చారు.మీ పేరు రాజ్ అనుకుంటాను కదూ,డిటెయిల్స్ నింపిస్తున్నప్పుడు విన్నాను.
చాలా థాంక్స్ అండీ,సంవత్సరం నించీ వాడు నాకు ఒక్క లీవు కూడా ఇవ్వకుండా ఏడిపించుకు తింటున్నాడు.ఇవాళ మీరిచ్చిన కోటింగుకి తిక్క కుదిరింది వెధవకి.
చినిగిపోయిన షర్టుతో వాణ్ణసలు ఫోటో తియ్యకుండా ఉండలేకపోయాను.
ఈ ఫోటో మా ఇంట్లో వాళ్ళందరికీ చూపించి నేను పార్టీ చేసుకుంటాను.మీరేమీ అనుకోనంటే..మీ ఫోటో ఒకటి తీసుకోవచ్చా?” అడిగింది సారిక.
“ఆఫీసర్ని తన్ని ఫామ్ నింపించిన అబ్బాయి అని మీ ఇంట్లో వాళ్ళకి చూపించి ఇంకో పార్టీ చేసుకుంటారా?” అడిగాడు రాజ్.
“బలే క్యాచ్ చేసారే?” అమాయకంగా చూసింది సారిక.
మొదటి సారి సారిక ఎందుకో నచ్చేసింది రాజ్ కి.
“అందరితో ఇలాగే మాట్లాడతారా?” అడిగాడు.
“లేదు.మీతోనే ఇలా వాగేసాను.సంవత్సరం నించీ వాడు ఏడిపించేస్తున్నాడు కదా,అందుకూ..వాడి మీద కోపం” చెప్పింది సారిక.
చిరు నవ్వు నవ్వేసి అక్కణ్ణించి వేగంగా వెళ్ళిపోయాడు రాజేష్.
“అయ్యో,నా ఫోటోకి పోజివ్వకుండానే వెళ్ళిపోయాడు.పేద్ద పోజు..దుర్మార్గుడు” తిట్టుకుంది సారిక.
రెండు రోజుల తరవాత రాజ్ కి ఫోన్ వచ్చింది.తన వంతు కోసం ఎదురు చూస్తున్నాడు ఆఫీసర్.
“సార్! మీ పాత పాస్ పోర్ట్ ట్రేస్ అవ్వట్లేదు,అర్జంటుగా మీరొక సారి పాస్ పోర్ట్ ఆఫీసుకి రావాలి” చెప్పాడు.
పాస్ పోర్ట్ ఆఫీసులో మళ్ళీ అడుగు పెట్టాడు రాజ్.
వెనుక నించి ఎవరిదో చెయ్యి తన భుజమ్మీద పడటంతో ఆశ్చర్యానికి లోనై తిరిగి చూసాడు.
“ఇష్..ఇలా రండి” పక్కకి తీసుకెళ్ళింది సారిక.
“హమ్మయ్యా,కనిపించారా! ఇందాకణ్ణించీ మీ కోసమే వెతుకుతున్నాను.మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళకండి”
దేనికన్నట్టు కనుబొమలు ఎగరేసాడు రాజ్.
“మొన్న మీరు వాడి భరతం పట్టారు కదా.రివెంజ్” చెప్పింది సారిక.
“నీకెలా తెలుసు?”
“వాడు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను.అందుకే మీకు వార్నింగ్ ఇద్దామని ఇందాకటి నించీ వెతుకుతున్నాను.”
“ఏం మాట్లాడాడు?”
“వేసెయ్యండ్రా వాణ్ణి” అన్నాడు.
“ఓ.. ఐ సీ”
“వద్దంటుంటే మళ్ళీ ఆఫీసులోకే వెళ్తారేం?”
“సరే వెళ్ళను ఐతే,నా పాస్ పోర్ట్ నువ్వు ఇస్తావా మరి?” అడిగాడు రాజ్.
“చూసి చెప్తాను.మీ పాస్ పోర్ట్ కాస్త సమస్యగానే మారేట్టుంది”
“ఏం?”
“ఎవడో మీ పాస్ పోర్ట్ ఉపయోగించుకుంటున్నాడు.వాడు దొరకడం లేదు.వాడిచ్చిన డిటెయిల్స్ అన్నీ తప్పుడువే” చెప్పింది సారిక.
“ఇప్పుడు తెలిసిందా నేనెందుకు మళ్ళీ అప్లై చేసానో?”
“ఊ..”
* * * * *
రాజ్ అడపా దడపా సారికని కలుసుకోవడానికి వెళ్తున్నాడు.
రెండు సార్లు తనని ఔటింగ్ కి తీసుకెళ్ళాడు.ఒక సారి తన నట్లు,బోల్టుల విభాగానిక్కూడా తీసుకొచ్చాడు.
సారిక మరీ అంత ఆధునికంగా లేకపోయినా నిండైన చుడీదార్లలో పద్ధతిగా ఉంటుంది.మెరుపు తీగలా లేకపోయినా అందంగానే ఉంటుంది.
రాజేష్ కూడా అంతే.మంచి పొడగరి.ఎత్తుకు తగ్గట్లు మీడియం పర్సనాలిటీ.మరీ సన్నగా ఉండడు,అలాగని లావుగా కూడా ఉండడు.
ఉన్నట్టుండి ఒక రోజు-
హ్యారీ అలియాస్ హరి వాల్డ్ కప్ మ్యాచుల కోసం ఛానల్స్ మారుస్తూ అనుకోకుండా ఒక ప్రోగ్రాం హెడ్ లైన్ చూసి ఆగిపోయాడు.టీవీని కన్నార్పకుండా తదేకంగా చూస్తున్నాడు.
* * * * *
అంగారకుడి మీద ఫ్లాట్స్ కొన్న బిలియనీర్లని ఇంటర్వ్యూ చేసి చూపిస్తున్న కార్యక్రమం అది.అమెరికాలో ఉన్న ఐదుగురు కోటీశ్వరులు అంగారకుడి మీద ఇంటి స్థలాలు కొన్నారు.
ఇంటర్వ్యూ చేస్తున్న అతను వాళ్ళని వివరాలు అడుగుతున్నాడు.
“అంగారకుడి మీద స్థలాలు కొనడం ఎలా సాధ్య పడింది?”
వచ్చే సంవత్సరం డిసెంబర్లో డూమ్స్ డే రాబోతోంది.ఈ లోపే అమెరికా లోని కొందరుమేధావులు అంగారకుడి మీదకి వెళ్ళే రాకెట్ ఒకదాన్ని తయారు చేసారు.అలాంటి రాకెట్లు ఇంకొన్నిటిని ప్రయోగ పూర్వకంగా తయారు చెయ్యబోతున్నారు.దాని ద్వారా అంగారకుడి మీదకి వెళ్ళడం సాధ్యమే.
చంద్రుడి మీద స్థలాలు కొన్నా అక్కడ జీవం నివసించడానికి చాలా కష్టం.అదే అంగారకుడి మీద నీటి జాడలున్నాయి.అక్కడ జీవం బ్రతికి బైటపడే ఛాన్సులు ఎక్కువ.
అందుకే మేం అంగారకుడి మీద ప్లాట్లు తీసుకున్నాం.
వావ్,మీ దూర దృష్టికి నేనెంతో ఆశ్చర్య పడుతున్నాను.మరి మీరు అంగారకుడి మీదకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారు?
నాసా వాళ్ళు.
వాళ్ళు ఆల్రెడీ ఒక రాకెట్ తయారు చేసారు.ముందు ఒక మనిషిని 2011 నవంబర్ లోగా అంగారకుడి మీదకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.అది గానీ సక్సెస్ అవుతే మేము కూడా అంగారక యాత్ర చేసే వీలుంటుంది.
రాకెట్లో ఎక్కి అంగారకుడి మీదకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుని ఉండటమే!
ఈ రాకెట్ ప్రయాణం ఎంత ఖరీదుంటుంది?
సింపుల్ గా చెప్పాలంటే మా లాంటి కోటీశ్వరుల వల్లే అవుతుంది.అందరూ ఇలాంటి రాకెట్లలో ప్రయాణం చెయ్యలేరు.దీనికి ఎంత లేదన్నా ఒక లక్ష కోట్ల డాలర్లు ఖర్చవుతుంది.
చూసారు కదా వ్యూయర్స్, ఇప్పుడు అంగారకుడి గురించి మరిన్ని వివరాలు తెల్సుకుందాం. అంగారకుడి మీద యేయే స్థలాల్లో ప్లాట్లు విక్రయిస్తున్నారో కూడా తెలుసుకుందాం!
ఆ తరవాత –
అంగారకుడి మీద జీవం నివసించడానికి అనువుగా ఉండే ప్రాంతాలు,నీటి జాడలున్న ప్రాంతాలు జూమ్ చేసి చూపిస్తున్నాడు రిపోర్టర్.అంగారకుడి చరిత్ర మొత్తం చూపించాడు.
తరవాత అంగారకుడి మీదికి పంపించబోయే రాకెట్,దాని గురించిన వివరాలు చూపించడం మొదలెట్టాడు.
తదేకంగా ఆ రాకెట్ ని చూస్తున్న హ్యారీ ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు ఛానల్ మారిపోవడంతో.
“ఏంది తమ్ముడూ,అట్ట కన్నార్పకుండా యేంది జూస్తన్నావూ? ఆ ముష్టి రాకెట్టా? వాల్డ్ కప్పులో సచిన్ ఇరగదీసేస్తున్నాడు.ఆ బ్యాటింగ్ చూద్దామంటే లేకుండా పోతుండె,ఎట్టాగబ్బా?” అడిగాడు రాజ్.
“అ-దీ ముష్-టి రా-కె-ట్ కా-దూ డూడ్,సూ-ప్ప-ర్ రాకెట్. ఆ రా-కె-ట్-లో ఎ-క్కూ-తే మార్స్ మి-దా-కి తీస్-కెల్తున్-ది టె-ల్సా?” కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు హ్యారీ.
“ముష్షా,బుష్షా? ఎట్టెట్టా? మళ్ళీ జెప్పు” అడిగాడు రాజ్.
“ఆ ప్రోగ్-రామ్ మ-ల్లీ పెడ్-టే చెప్-టా అన్ని-య్యా!” మారాం చేసాడు హ్యారీ.
“అట్టాగే గానియ్” ఇందాకటి ఛానల్ మళ్ళీ పెట్టాడు రాజ్.
“ఈప్-డూ ఈ రాకెట్ ఉన్-ది క-దా ? ఇదీ స్సో కాస్ట్-లీ రాకెట్,ఇ-దీ ఎక్-తే మార్స్ అన్-టే టెల్గూ లో అన్-గా-రక్-డూ అక్-డి-కీ టీస్-కెల్-తున్-ది.
వీ-లన్-తా మల్టీ బిలియనీర్స్. అన్-గా-రక్-డూ మీ-ద ప్లాట్స్ కొను-క్కు-నారూ” ముక్కలు ముక్కలు చేసిన తెలుగులో ఇంగ్లీష్ మిక్స్ చేసి మిడికాడు హ్యారీ.
“అట్టాగా? వీళ్ళంతా ఆ గెహం మీద ప్లాట్లు గొనీ ఏం జేస్తారూ?”
“అక్-డే ఉంటారూ.ఎన్-దూ-కన్-టే డూమ్స్ డే వ-చేస్-టున్-దీ క-దా డూడ్!”
“ఓర్నీ నీకు బుర్ర దొబ్బేసింది.వేలంటైన్ డే ఉంటాది గానీ ఈ డూమ్సుడే యేంది?”
“అయ్యో అన్ని-యా నీ-కూ డూమ్స్ డే టె-లీ-దా?
ఆ డే రో-జూ భూమి మో-త్తం మున్-గీ పో-టున్-ది.”
“ఎట్టెట్టా? ఎవురు జెప్నారు నీకూ?”
“అమే-రికా మో-త్తం అందర్-కీ టెల్సూ,అందుకే ఈ రాకెట్ చేస్-టూ-నారు.ఇండ్-యా లో కూ-డా చా-లా మంద్-కీ టెల్సూ.”
“మరి నాకెందుకు జెప్పలా?”
“ను-వ్ అడ్-కో-లేదు కదా అన్ని-యా!”
“అడుక్కోవడం కాదురా నీ తస్సాదియ్య,అడగలేదు అనాల – సర్నా?”
“ఓ..యా”
“అట్టాగా,ఈ రాకెట్టోళ్ళు యాడుంటారు? నాకీ ఇసయం ఇప్పుడే తేలిపోవాల”
“ఇస్-రో అనీ ఇండ్-యా లో ఒక పే-ద కంప్-నీ ఉంది.అక్-డా ఉన్-టా-రు.”
“పేద కంపెనీ రాకెట్ ఎట్టా జేస్తందిరా నీ దుంపదెగ?”
“పేద కంప్-నీ కాదు అన్ని-యా ఐ మీన్ బిగ్ కంప్-నీ”
“పెద్ద కంపనీ కొచ్చిన తిప్పలా ఇయ్యి? నీ దుంప దెగ.నువ్వు మాట్టాడుతంటే కొన్ని కొన్ని అర్థమే గావురా.నేను గాబట్టి ఇట్టా అర్థం చేసేసుకుంటన్నాను.బండి తియ్యి. ఆ కంప్నీ యేందో ఓ పాలి జూసొస్తే పోలా?”
“ఆ,మర్సినాను.మన తెల్ల గుర్రం మెక్కులారీ ఉండాదే (మెక్ లారెన్).ఆ బండి దియ్యి.200 మీన జామ్మున పోతాది.
ఓ హ్యారీ,నేనోపాలి ఆ కోడు(అర్మానీ బ్లాక్ కోడ్) సెంటు గొట్టుకునొస్తానబ్బాయో అందాకా ఆగు.ఆ పెంటి(ఫెండీ) కళ్ళ జోడెట్టుకోవాల.అట్నేనా?”
“ఓ-కే అన్ని-యా!” పోర్టికోలోని మెక్ లారెన్ బైటికి తీసాడు హ్యారీ.
* * * * *
ముందో పది సెక్యూరిటీ కార్లూ,వెనకో పది సెక్యూరిటీ కార్లూ వెంట వస్తుండగా తెలుపు రంగు మెక్ లారెన్ మెర్సిడెస్ కారులో ఇస్రో రాకెట్టోళ్ళని కలుసుకోవడానికి బైలుదేరాడు రాజ్.
యథావిధిగా ఆ రోజు కొత్త రాకెట్ కి నట్లూ,బోల్టులూ బిగిస్తున్నాడు రాజేష్ (రాజ్-2).
8 గంటల ప్రయాణం తరవాత రాజ్-1 కారు ఇస్రో ఆఫీసు వెనకున్న లాంచింగ్ ప్యాడ్ దగ్గర ఆగింది.
అరుణాచలం సినిమాలో లాగా అన్ని కార్లు వచ్చి ఆగాయేమిటా అని ఆశ్చర్యపోయాడు రాజ్-2.
పువ్వులాంటి గుక్కీ సూటు వేసుకున్న నిరక్షర కుక్షి రాజ్-1 కారు దిగి తన ఫెండీ కళ్ళజోడు సరి చేసుకుని హ్యారీని వెంట తీసుకుని ఇస్రో ఆఫీసులో అడుగు పెట్టాడు.
“యవుర్రా ఈ కంప్నీ యెడ్డూ?” వాకబు చేసాడు రాజ్-1.
అక్కడ ఎవ్వరికీ తెలుగు రాకపోవడంతో రాజ్-1 కి ఎవరూ సమాధానం చెప్పలేదు.
“వోర్నీ,వీళ్ళకు మనవెవరో తెలిసినట్లేదు.హ్యారీ,యీళ్ళ కతేందో నువ్వోపాలి సూసి సెప్పూ”
“ఈ కంప్-నీ హె-డ్ ఇక్-డా ఉన్-డ-డనీ చెప్-టు-నారు అన్ని-యా.”
“యాడుంటాడు మరి?”
“ఆయ్-నా ఈ కంట్రీలో లే-డు.యే-దో మీటింగ్ కో-సం వే-రే కంట్రీ వె-లా-డూ” చెప్పాడు హ్యారీ.
“మరి మనకెవరు జెప్తారు ఆ మార్సు రాకెట్టు గురించి.ఈణ్ణి కిడ్నాప్ జేసి మన కారులో అట్టుకెళ్ళిపోదాం.ఆడే జెప్తాడు ఆడ్సిగదరగ”
* * * * *
వీళ్ళెవరో తనని ఎందుకు కిడ్నాప్ చేసి తీస్కెళ్తున్నారో అతనికేం అర్థం కాలేదు ఓ పట్టాన.సైంటిస్టు దిక్కు తోచక మూర్ఛపోయాడు.
సైంటిస్టుని ఒక రూములో బంధించి మొహమ్మీద నీళ్ళు చిలకరించాడు రాజ్.
కళ్ళు తెరిచి చూసిన సైంటిస్ట్ గాభరా పడ్డాడు.
“ఎన్నప్పా,చెన్న బసప్పా..నీ బారప్పా,నాన్ కిడ్నాప్ హోగిద్దారే”" కన్నడలో దేవుణ్ణి స్మరిస్తున్నాడు.
“వోర్నీ,యిప్పుడు గానీ నేనడిగిందానికి జవాబు సెప్పనేదూ,ఈ కోడి పిల్ల పీకట్టుకుని పిసికీసినట్టు నీ పీకట్టుకు పిసికేస్తా” ఎదురుగా ఉన్న కోడి పిల్ల పీక మీద కత్తి పెట్టాడు రాజ్.
ఆ సైంటిస్టుకి ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ వివరించాడు హ్యారీ.
“డిస్ గై ఈజ్ గోయింగ్ టూ స్మాష్ యువర్ హెడ్ లైక్ డట్ ఆఫ్ ద చిక్, క్రాప్.. ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ ద క్వెశ్చన్”
వణికిపోయాడు సైంటిస్ట్ .
“ఓ.కే,ఓ.కే” వణుకుతూనే చెప్పాడు.
“డూమ్సు డే యెప్పుడొస్తాది?” అడిగాడు రాజ్.
ట్రాన్స్ లేషన్ చేస్తున్నాడు హ్యారీ.
“డిసెంబర్ 21,2012″
“బూవి నిజంగా మునిగిపోతుండాదా?”
“అవును”
“దాంతర్వాత ఏటవుద్ది?”
“ఒక మీటియర్ వొ-చ్చీ ఎర్త్ మీ-దా పడ్-టున్-దీ.అప్-డూ ఎర్త్ చచ్చీ-పో-టున్-ది.”
“వోరి దీన్సిగదరగ,నాను పదేళ్ళ నించీ సంపాదిత్తాంది ఇంకో సంవత్సరంలో పోగొట్టీసుకోటాన్కా? నానూ ఆ మార్సుమీద ప్లాట్ కొనేసుకుని యెల్లిపోవాల! అమెరికా వోడు రాకెట్టు సేసీసినాడు.నాను కూడా అట్టాంటి రాకెట్టు యెక్కి మార్సు మీదకెల్లాల.ఆ రాకెట్టు యవుడు జేత్తాడు?”
“యూ,నువ్ జస్ట్ గలీ-లీడర్.
బుల్ షిట్,నీ దగ్-రా అంత డబ్బ్-లూ యక్-డీ నిన్-చీ వ-స్తా-యి?
ఈ క్వశ్చిన్ నీ-ను కాదు అన్ని-యా.. వీ-డూ అడు-కున్-టు-నాడూ.”
“ఇంకో పాలి ఆడు పెశ్నలడిగీడంటే ఆడి పీకెగిరిపోతాది.అడగాల్సింది నాను,ఆడు కాదు.
నాను ఏపీ వొక సోటే లీడర్ అనుకుంటన్నాడు సన్నాసి.ఇంకో ఆరు నెలల్లో పెయిమ్ మినిట్టర్నైపోతన్నా అని ఈడికి తెలీట్నేదు.”
“అ-లాన్-టి రా-కెట్-లు అమే-రికా వా-లే చే-స్టా-రు అని చెప్-టు-నా-డు అన్ని-యా.”
“అట్నా,ఆ అమెరికా వోణ్ణే లేపేసి అట్టుకొచ్చెయ్యాల.నువ్ రేపే అమెరికా యెల్లాల హ్యారీ.యేంది? నాను ఈణ్ణెట్టా లేపుకొచ్చినానో అట్నే ఆ తెల్ల దొర రాకెట్టోణ్ణి నువ్వు లేపుకొచ్చీయ్యాల.నాను రాకెట్టెక్కాల. మార్సు మీద ఇల్లు కట్టుకోవాల.ఆణ్ణే పెదాన మంత్రి కుర్సీ యెక్కి కూకోవాల.”
హ్యారీకి అమెరికా టికెట్లు బుక్ చేసేసాడు రాజ్.
“అన్ని-యా.. టె-ల్లా డో-రా రాకెట్ సైంటిస్ట్ ని లే-పు-కొచ్చే-డం అంత ఈజీ కా-దూ అన్ని-యా!”
“అదంతా నాకు తెలవదు.ఎట్ట జేస్తావో యేందో.నా అట్టెంట్లిద్దర్ని నీతో పాటు పంపిత్తన్నా.ఆణ్ణి లేపి ఈడకట్టుకురావాల.
పో..ఇన్ని రోజుల కాణ్ణించీ నా దెగ్గిర పన్జేసి ఇంతేనా అబ్బాయా నువు నేర్సుకుండాది?”
“వీడు ఇంత మొండోడని నాకు తెలీదే” వాపోయాడు హ్యారీ.
ఇంక చేసేదేమీ లేక తెల్ల దొర రాకెట్ సైంటిస్టుని కిడ్నాప్ చేసి తీసుకు రావడం కోసం పథకం సిద్ధం చేసాడు.
——————————————————
నల్ల మాస్క్ వేసుకుని నాసా ఆఫీసులో నకిలీ కోడ్ తో చొరబడ్డాడు హ్యారీ.
అందర్లోకీ పెద్ద తలకాయ రాకెట్ డివిజన్ హెడ్ ని టార్గెట్ చేసాడు.
అసిస్టెంట్లిద్దరికీ ట్రాంక్విలైజర్లు ఒక గన్నులో పెట్టి ఇచ్చాడు.
హెడ్ సింగిల్ గా కారిడార్లోకి రాగానే అతణ్ణి అటాక్ చేసి ట్రాంక్విలైజర్లు పేల్చారు.అవి దిగబడ్డ హెడ్డు వారం రోజుల దాకా లేవలేదు.
అతణ్ణి చేప పిల్లలా ఒక గాజు పెట్టెలో పెట్టి ఆక్సీజన్ మాస్క్ తొడిగి భద్రంగా ఇండియాకి పార్సిల్ చేసి లేపుకొచ్చాడు హ్యారీ.
“వావ్..అన్ని-య్యా నీ-నూ కిడ్నాప్ మాస్టర్ ఐ-పొ-య్యా!” సంతోషంతో కళ్ళు మిల మిలా మెరుస్తుండగా చెప్పాడు హ్యారీ.
“బలే తెచ్చీవు.నీకు పమోసన్ ఇచ్చేత్తన్నా,తీస్కోయెహే!”
* * * * *
రాజ్ కష్టాల పరంపర పాస్ పోర్ట్ ఆఫీసుతో ఐపోలేదు.
రాజ్ నట్లు బిగించిన రాకెట్ పైకెగిరిన కాసేపటికే బంగాళాఖాతంలో కూలిపోయింది.
రాకెట్ కూలిపోవడానికి కారణాలు వెతికిన పెద్ద సైంటిస్టులు రాజ్ నట్ సరిగ్గా బిగించకపోవడం వల్లే రాకెట్ కూలిపోయిందని రిపోర్ట్ ఇచ్చారు.
డివిజన్ హెడ్ రాజ్ కి వార్నింగ్ ఇచ్చేడు.
“ఇది నీ మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను,రెండో సారి రిపీట్ అవుతే రాకెట్ కాదు నువ్వుంటావు బంగాళాఖాతంలో.”
ఈ మధ్య రాజ్ కి వర్క్ మరీ ఎక్కువయ్యింది.హ్యారీ పుణ్యమాని ఇస్రో ఆఫీసులో నాసా సైంటిస్టులు చొరబడటంతో.
కొలాబరేషన్ స్కీము కింద నాసా-ఇస్రో సంయుక్తంగా చేపట్టిన మార్స్ మిషన్ కోసం చాలా రాకెట్ మోడల్స్ ని పరిశీలించి ఒక ఫైనల్ మోడల్ తయారు చేసాడు హ్యారీ లేపుకొచ్చిన తెల్ల దొర సైంటిస్ట్.
నాలుగు నెలల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రైమ్ మినిస్టర్ని గద్దె దింపేసిన రాజ్ ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ అవతారం ఎత్తాడు.
అన్ని శాఖల నిధులూ తన రాకెట్ కోసం మళ్ళించాడు.బెల్టు షాపుల నించి వచ్చే ఆదాయాన్ని కూడా రాకెట్ మార్గం వైపు తరలించాడు.
ఏడు నెలల్లో పూర్తయ్యింది ప్రైమ్ మినిస్టర్ కొత్త రాకెట్.
టెస్ట్ రాకెట్ ని విజయవంతంగా పరీక్షించారు.ఈ సారి రాకెట్ బంగాళాఖాతంలో కూలకుండా గాలి పటంలా రివ్వున పైకెగిరింది.
* * * * *
యెంతో ఆనందించేడు రాజ్.ఈ దెబ్బతో తన కష్టాలన్నీ గట్టెక్కుతాయనుకున్నాడు.
రాజ్ కష్టం వృధా పోలేదు.నెలకి వెయ్యి రూపాయల జీతం ఇంక్రిమెంటుగా అందుకున్నాడు.
తన ఇంక్రిమెంట్ వచ్చిన ఆనంద క్షణాలని సారికతో పంచుకోవాలనుకున్నాడు రాజ్.
సారికని తన నట్లూ,బోల్టుల విభాగానికి ఆహ్వానించాడు.
రాజ్ కోసం పరుగున వచ్చింది సారిక.
అదే రోజు యం.యల్.ఏ రాజ్ తన మార్స్ ప్రయాణం టెస్ట్ చేసుకోబోతున్నాడు.
తన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఇంకో రాకెట్లో ముందు భూమి చుట్టూ మూడు చక్కర్లు కొట్టి అసలు రాకెట్ నిజంగా పని చేస్తుందో లేదో పరీక్షించి చూద్దామని లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి బైలుదేరాడు.
నట్లూ బోల్టుల డివిజన్ దగ్గర సారిక కోసం ఎదురు చూస్తున్నాడు రాజ్.
“రాజ్” తియ్యటి గొంతుతో పిలిచింది సారిక.
అటుగా వెళ్తున్న రాజ్ కుందనపు బొమ్మలా జీన్స్ లో ఉన్న సారికని చూసాడు.
“ఎంతందంగా ఉందీ పిల్ల,నా అంజూ కంటే లక్ష రెట్లు ముద్దొచ్చీస్తున్నాది.దీన్ని కూడా మార్స్ మీదకట్టుకెలిపోతే అక్కడ తోట బంగళా కట్టుకుని హాయిగా ఉండిపోవచ్చు” అనుకున్నాడు.
“యే గుంటదానా,బేగొచ్చీవే” సారికకి చెయ్యి వూపాడు.
సారిక రాజ్ ని దాటుకుని ఇంకాస్త ముందుకెళ్ళింది.
“రాజ్!” పరిగెత్తుతూ వెళ్ళి రాజేష్ ని గట్టిగా కౌగిలించుకుని “ఏది నా గిఫ్టు?” అడిగింది.
రాజ్ కి కోపం ముంచుకొచ్చేసింది.సారిక దగ్గరికి వచ్చాడు.
“నన్ను రమ్మని పిల్సీ ఈణ్ణట్టుకుని మీదమీద పడిపోతన్నావు,నీనొదిలేత్తానా? యేటనుకుంతన్నావు? తిమ్మిరిగా ఉందా? “ సారిక చెయ్యి పట్టుకుని లాగాడు.
“వదల్రా,ఎవరు నువ్వు? నేను నా రాజ్ ని పిలిచాను.నిన్నెవరు పిలిచారిక్కడ?”
“నన్ను పిల్సీ నాటకాలాడుతావా? రాజ్ అంటే నీను. పెయిమ్ మినిస్టర్ రాజ్. బుర్రలోకెక్కిందా?
బుల్లే,నువ్ నాక్కావాల.మనిద్దరం లగ్గమెట్టుకోవాల.ఈణ్ణొదిలేసి నా కాడికొచ్చీయ్యి.
మనిద్దరం మార్సు మీదకి పోయి బంగళా కట్టుకోవాల.బేగెల్దాం వోచ్చీవే,పేమగా పిల్సి నన్నిట్టా ఏడిపించమాక.”
రాజ్ చటుక్కున మెరుపులా కదిలాడు.”ఓ..ఐతే ఇదన్నమాట విషయం! వీడి మొహానికి నా సారిక కావాల్సొచ్చిందా,చెప్తాను వీడి సంగతి”
సైంటిస్టులంతా ప్రైమ్ మినిస్టర్ గారి చోద్యం చూస్తున్నారు గుడ్లు మిటకరించి.అందరి ఫోకస్ ఇప్పుడు సారిక మీదే ఉంది. ఆ సమయంలో ఒక చిన్న తప్పు చేస్తే తనకి యే అపాయమైనా జరగొచ్చు.ఇది ముందుగానే ఊహించాడు రాజ్.
రాకెట్ ఇంకా లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి తీసుకెళ్ళలేదు.దానికి ఫైనల్ టచెస్ ఇస్తున్నారు.
మెల్లిగా నక్కుతూ పిల్లిలా వెళ్ళి దాని ఇంజన్లో ఉన్న నట్ ఒకదాన్ని పీకేసి వచ్చాడు.”ఇంక వీడి బతుకు బంగాళాఖాతమే!”
సారికకి సైగ చేసాడు రాజ్.వాడి వెంట వెళ్తున్నట్టు ఒప్పుకో!
రాజ్ ఎందుకలా చెప్తున్నాడో సారికకి అంతు బట్టలేదు.
“నేనున్నాను,వొప్పుకో!” చూపించాడు రాజ్.
అందరి చూపులూ తన మీదే ఉండటంతో సారిక గత్యంతరం లేక మౌనంగా ప్రైమ్ మినిస్టర్ రాజ్ తో కలిసి లాంచింగ్ పాడ్ దగ్గరికి వెళ్ళింది.
రాకెట్ ని లాంచింగ్ పాడ్ దగ్గరికి తీసుకొచ్చారు.
రాజ్ కీ,సారికకీ స్పేస్ సూట్ వెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సారిక సూట్లో ఏదో తేడా రావడంతో రాజ్ కి అప్పగించారు దాన్లో ఏం తేడా ఉందో చూడమని.
ప్రైమ్ మినిస్టర్ అంగరక్షకుడు కాపలాగా నిలబడ్డాడు.
“ఊ..చెకింగ్ మాత్రమే చెయ్యి.పిచ్చి వేషాలేసి ఆ అమ్మాయిని ముట్టుకున్నావా,మటాష్ ఐపోతావ్” బెదిరించాడు.
“ఓ.కే” సూట్ ని చెక్ చెయ్యడానికి మాత్రమే వచ్చినట్టు ఎంతో వినయంగా వచ్చి సారిక ముందు నిలబడ్డాడు రాజ్.
“స్పేస్ షిప్ ఎక్కకు..” రాజ్ గుసగుసగా సారికకి ఏదో చెప్పాడు.
అర్థమైనట్టు తలూపింది సారిక.
———————————————
తన తల్లోని గులాబీ పువ్వుని ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా కింద పడేసింది.
ప్రైమ్ మినిస్టర్ రాజ్,సారిక స్పేస్ షిప్ ఎక్కారు.
“ఏవండీ” ముద్దుగా పిల్చింది సారిక.
“ఊ..అగ్గదీ,అట్టా పిలుస్తే నాకు కమ్మగా ఉంటది.ఏటి?” అడిగాడు రాజ్.
“ఇందాక మీతో వస్తున్నప్పుడు నా గులాబీ పువ్వు కింద పడిపోయింది.రోజూ ఒక గులాబీ పెట్టుకోవడం నాకలవాటు.నేను గులాబీ మర్చిపోయిన రోజల్లా ఏదోక యాక్సిడెంట్ అయిపోతుంది.నా పువ్వు తెచ్చుకోనా?” గారాలు పోతూ అడిగింది.
“ఊ..తెచ్చుకోవే! నీ ఇట్టం” చెప్పాడు.
ఆమె కిందికి దిగిన కొన్ని క్షణాల తరవాత -
ఇంజన్లో నట్ ఊడిపోవడం మూలంగా రివర్స్ కౌంట్ డౌన్ మొదలవకుండానే రాకెట్ గాల్లోకి ఎగిరి నిమిషంలో బంగాళాఖాతంలో కూలిపోయింది.
* * * * *
స్పేస్ సూట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ రాజ్ ఈదుతూ ఈదుతూ ఒక రెస్క్యూ పడవలోకి చేరి చావు తప్పి కన్ను లొట్ట పోయి తీరానికి చేరుకున్నాడు.
తీరానికి రాగానే కోపంతో ఊగిపోయాడు రాజ్.ఇప్పుడు మూలిగే నక్క మీద తాటి పండు పడట్టు ఇంకో రాకెట్ పేల్చాడు హ్యారీ.
* * * * *
పువ్వు కోసం వచ్చిన సారికకి కింద ఇంకో వస్తువు కనిపించింది.ఏమిటా అని తీసి చూసిన సారికకి అసలు విషయం బోధపడింది.
“రాజ్,ఇటు చూడు నీ పోయిన పాస్ పోర్ట్ ఇక్కడుంది.”
“సూపర్,నువ్వే నాకు గిఫ్టిచ్చావు” నమ్మలేనట్టు తన పాస్ పోర్ట్ ని తడిమి చూసుకున్నాడు రాజ్.
M.L.A గాడి పీడా వదిలినందుకు రాజ్ కి థాంక్స్ చెప్పుకున్నారు సైంటిస్టులు.
———————————————
“అన్ని-య్యా.. నీ-నూ పార్టీ మా-రి-పో-టు-నా-నూ” చెప్పాడు హ్యారీ.
“ఇన్ని రోజులూ నా కాడ పన్జేసి పార్టీ మారిపోవడమేంట్రా,నీ దుంపదెగా?”
“రాజ్-కీయం-లో ఎవ్వరు-నీ నమ-కూ-డ-దనీ ను-వే క-దా చె-పా-వ్ అన్ని-య్యా! సారీ,నే-నిప్-డూ ఆ రాజ్ అన్ని-య్యా పార్టీ!!”
“వోర్నీ సిగ దరగా..” తల మీద చెయ్యి పెట్టుకున్నాడు రాజిగాడు.
రాజ్ దగ్గరికి వెళ్ళాడు హ్యారీ.