“మేడలో బూచి-మూటలో పిశాచి”-(ఒక భీతావహ ప్రేమకథ)

జ్ జ్ జ్ జ్ జ్ జ్ … స్ స్ స్ స్ స్ …

వూ…హూ .. జూ ..

గాలికి జడలు విరబోసుకున్న దయ్యాల్లా భయంకరంగా ఊగుతున్నాయి మఱ్ఱి చెట్లు.

క్రీచ్..క్రీచ్..

టక్..టక్..

ఠప్..ఠప్..

టప టపా కొట్టుకుంటున్నాయి ఆ భూత భవంతి తలుపులూ,గవాక్షాలూ.

అది ఫాల్గుణ బహుళ అమావాస్య.సమయం అర్థ రాత్రి గం.12:45 నిమిషాలు.

తెల్లవారితే చైత్ర శుద్ధ పాడ్యమి.ఉగాది పండుగ.

ఆ భవంతిలో మిగిలి ఉన్నది ఒకే ఒక అబ్బాయి.అతని వయసు దాదాపుగా 30 సంవత్సరాలుంటుంది.

అతను నిలువెల్లా వణికిపోతున్నాడు.చెమటతో తడిసి ముద్దైపోయి ఉన్నాడు అప్పటికే.కదిలిస్తే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది అతని ప్రస్తుత పరిస్థితి.

మామూలు సమయాల్లో ఆరడుగుల ఆ అబ్బాయి అమిత ధైర్యశాలి.బ్రహ్మరాక్షసుడు ఎదురుగా వచ్చి గోళ్ళతో రక్కినా భయపడని సాహసి.

గత మూడు గంటల నించీ అతను చూస్తున్న దృశ్యాల వల్ల అతని ధైర్యం పూర్తిగా చెదిరిపోవడం మొదలయ్యింది.

అతనితో పాటు ఉగాది పండుగ జరుపుకోవడానికి వచ్చిన అతని స్నేహితులు ఒక్కొక్కరుగా అతని కళ్ళ ముందే రక్తపు మడుగుల్లో విగత జీవులైపోతున్నారు.అన్నీ చూస్తూ కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి అతనిది.

ఇంతలో వెనక నించి  వొక చెయ్యి వచ్చి అతడి భుజం మీద గట్టిగా నొక్కింది.

ఉలిక్కిపడి కెవ్వున కేక వేసాడతను.
***************************************

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

వీతెగులు టీవీ ఛానల్ కోసం క్రీంకార్ అనే ప్రముఖ యాంకర్ నిర్వహిస్తున్న విలక్షణమైన హార్రర్ రియాలిటీ షో “మేడలో బూచి-మూటలో పిశాచి” ఒకటో సిరీస్ కోసం సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు.

టీవీ19  “హరస్యం” కార్యక్రమం ద్వారా ప్రజల్లో తన హావభావాలకి గానూ అత్యుత్తమ రహస్యాన్వేషకుడుగా పేరు సంపాదించుకున్న మరో ప్రముఖ యాంకర్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.

సర్పకేశి,తామ్రపాలి అనే అందమైన వ్యాఖ్యాతలు “మేడలో బూచి-మూటలో పిశాచి” కార్యక్రమాన్ని తమ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో కనుల విందుగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చెయ్యబడ్డ పది అత్యుత్తమ విద్యా సంస్థల్లోని M.Tech మరియు Ph.D విద్యార్థులు టైటిల్ పరీక్షలో పాల్గొంటున్నారు.

పోటీలో పాల్గొనే అబ్బాయిలూ,అమ్మాయిలూ మంచి శారీరక దారుఢ్యం,రోగ నిరోధక శక్తి ఇంకా మానసిక స్థైర్యం కలిగి ఉండాలని,ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ గుండె పోటు తెచ్చుకుని పడిపోకూడదని గట్టి నిబంధనలు మొదట్లోనే క్రీంకార్ పెట్టడం వల్ల బలహీనులూ,గుండె ధైర్యం లేని పిరికి వాళ్ళూ ఆడిషన్ స్టేజ్ లోనే వెనుతిరిగి వెళ్ళిపోయారు.

“మేడలో బూచి-మూటలో పిశాచి”  కార్యక్రమ నియమ నిబంధనల్ని అనుసరించి ఎవరైతే భూతభవంతిలోని భూతాలతో ప్రత్యక్షంగా మాట్లాడి వాటి మాటలని/అరుపులని/చేష్టల్ని కెమెరాలో బంధించి తగిన ఆధారాలతో నిరూపిస్తారో వారే విజేతగా నిలుస్తారు.

చివరి పరీక్షలో 15 మంది నెగ్గారు.వారిలో ఉన్నాడు సౌమిన్ కాశ్యప్.

సౌమిన్ వయసు 30 సంవత్సరాలు.ఎత్తు ఆరడుగుల రెండంగుళాలు.

ప్రతి రోజూ జిమ్ లో రెండు పూటలా వర్కవుట్లు చెయ్యడం వల్ల అతని శరీరం ధృఢంగా ఉంటుంది.ఎత్తుకి తగ్గ పర్సనాలిటీ.ఎదుటి వారిని కట్టి పడేసే తేనె కళ్ళు అతని స్వంతం.

అమిత్,రూప,వంశీ,జోసెఫ్,లతీఫ్,సుందర్ వీళ్లంతా సౌమిన్ తో పాటు ఎంపికయ్యారు.ఈ ఏడుగురూ సెలక్షన్స్ జరుగుతున్నప్పుడే మంచి మిత్రులైపోయారు.

ఇక “మేడలో బూచి-మూటలో పిశాచి” సాహస కార్యక్రమం మొదలయ్యింది.

ఎంపిక చేసిన పదిహేను మందినీ రెండు గ్రూపులుగా విభజించారు.సౌమిన్ వాళ్ళ గ్రూప్ కాకుండా ఇంకో గ్రూపులో 8 మంది సభ్యులున్నారు.

మరో బృందాన్ని ఉత్తరం వైపుగానూ,సౌమిన్ వాళ్ళ బృందాన్ని దక్షిణం వైపుగానూ పంపించారు.

ప్రఖ్యాతి గాంచిన భూతభవంతుల్లో వాళ్ళకి బస ఏర్పాటు చేసారు.ఆ భవంతి మూల మూలలా పరిశీలించి దయ్యాలు ఎక్కడున్నాయో వెతకడం,వాటి మాటల్ని/చేష్టల్ని రికార్డ్ చెయ్యడం ఆ రెండు బృందాలకీ అప్పజెప్పబడిన పని.

ఫాల్గుణ బహుళ అమావాస్య.

సౌమిన్ బృందంలోని సభ్యులు రెండు రోజులుగా ఆ భవంతిలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నివాసం ఉంటున్నారు.

భవంతి నలు వైపులా ఎటు చూసినా వారికి భుతాల జాడ కనిపించలేదు.

ఆ భవంతిలోని ప్రతి అణువునీ సర్పకేశి వీతెగులు ఛానల్ టీవీ కెమెరాలో తన వ్యాఖ్యానంతో పాటు ప్రత్యక్షంగా చూపిస్తోంది.

రెండు రోజులుగా ఎలాంటి చలనమూ లేని ఆ భవంతిలో ఒక్కసారిగా వింతలూ,విచిత్రాలూ చోటు చేసుకోవడం మొదలు పెట్టాయి రాత్రి పది గంటలవుతుండగా.

ఉగాది కోసం ముందు రోజు రాత్రి నించే సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకున్నారు మిత్రులంతా.

ఉగాది సంబరాలు జరుపుకోబోతున్న సమావేశ స్థలాన్ని నిర్ణయించుకున్నారు.అక్కడ అందంగా అలంకరించిన ఒక వేదికని సిద్ధం చేసారు.

ఆ వేదిక మీద “ఉగాది పచ్చడి” గిన్నెని అమర్చారు.దానితో పాటే ఒక చాక్లెట్ కేక్ ని కూడా సిద్ధంగా ఉంచారు.

పది గంటలకి సౌమిన్ బృందంలోని సభ్యులంతా అక్కడ సమావేశం అవడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని తయారుగా ఉన్నారు.

సమయం రాత్రి 9:57 నిమిషాలు.

బృందంలోని సభ్యులంతా అక్కడ సమావేశమయ్యారు.

సర్పకేశి,వీతెగులు ఛానల్ కెమెరా మెన్లూ,బూచి-పిశాచి కార్యక్రమాన్ని షూటింగ్ చేస్తున్న డైరెక్టర్,టెక్నికల్ అసిస్టెంట్లూ అందరూ ఆ సమయానికి అక్కడికి చేరుకున్నారు.

**********************************************

ఉన్నట్టుండి కలలో లాగ ఎవరో అదృశ్య మీట నొక్కినట్టు ఆ భవంతి గాలిలో మాయమైపోయింది.

ఎటు చూసినా కీకారణ్యం.కళ్ళు పొడుచుకున్నాకనిపించని కటిక చీకటిలో సర్పకేశి బెదురు బెదురుగా తన వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తోంది.

స్టూడియో నించి క్రీంకార్ పెద్దగా అరుస్తున్నాడు,”సర్పా,అక్కడ ఏం జరుగుతోంది?”

“మేము బస చేసిన భవంతి ఉన్నపాటుగా ఒక్క క్షణంలో మాయం అయిపోయింది క్రీంకార్” చెపింది సర్ప.

న్యాయ నిర్ణేత హరస్యం యాంకర్ :”క్రీంకార్,ఉన్నట్టుండి సర్ప వీడియో కెమెరాలోని సిగ్నల్ కట్ అవుతోంది.నా చెవుల్లో శంఖం మోగినట్టు వింత ధ్వని వస్తోంది.ఇది ఖచ్చితంగా మాయా నాగరికతకి సంబంధించిన ఆనవాలు.

మాయన్ ఏలియన్లు నాతో సంభాషించడానికి సిగ్నల్స్ పంపుతున్నారు.మాయన్ల ఆచారాలని అనుసరించి చెవిలో శంఖనాదం వినిపించడాన్ని ప్రమాద సూచనగా పరిగణిస్తారు.

ప్రపంచంలోని అత్యున్నత నాగరికత కేవలం మాయన్ క్యాలండర్లోనే ఇమిడి ఉంది.అందులోని శంఖం గుర్తు ప్రళయానికి ప్రతీక.”

“ఇప్పుడు ఏదో అనర్థం ముంచుకు రాబోతుందని నాకనిపిస్తోంది.”

***********************************************

ఉన్నట్టుండి స్టూడియో స్క్రీన్ మీద ఒక ఆకారం లీలగా ప్రత్యక్షం అయ్యింది.అది ఎలాంటిదో తెల్సుకునే లోపే మాయం ఐపోయింది.

#####################################

“ఓరీ ధూర్తులారా,మీరంతా ప్రాణాలతో మిగిలాలనుకుంటే తక్షణమే నా భవంతిని విడిచి పొండు” ఒక భయంకరమైన ధ్వని ఆ అరణ్యంలో గింగురుమంది.

ఆ గొంతు వింటూనే సౌమిన్ వాళ్ళ బృందంలో సగం మందికి పై ప్రాణాలు పైనే పోయాయి.

భయంతో బిగ్గరగా ఒకరినొకరు పొదివి పట్టుకుని నిల్చున్నారు.

మరు క్షణం మాయమైపోయిన భవంతి ప్రత్యక్షం అయింది.అంతా చూస్తుండగానే సుందర్ రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది.

“అహో..మాకు నృత్య గాన లీలా వినోదములు కావలె.సర్పా,ఇటు రమ్ము” కర్కశంగా ఆజ్ఞాపించిందా కంఠస్వరం.

వణుకుతూ వణుకుతూ వేదిక లాంటి స్థలంలో వెళ్ళి నిలబడింది సర్ప.భవంతి మళ్ళీ గాలిలో మాయం ఐపోయింది.

ఒక కీర్తన గాలిలో లీలగా వినిపించడం మొదలైంది.

“మయూరి వలె ఈ గానమునకు నీ నాట్యము రక్తి కట్టవలె.బేలా..ఇక నీ నృత్యము కొనసాగించుము.”

తన ఇష్టం వచ్చినట్టు కాళ్ళూ,చేతులూ అడ్డ దిడ్డంగా కదుపుతూ అడుగు తీసి అడుగు వెయ్యడమే కష్టంగా అరుంధతిలో అనుష్క నాట్యం చేసినట్టు చెయ్యసాగింది సర్పకేశి.

తన చీరకొంగునే కత్తిలా గాలిలోకి విసురుతూ నృత్యం చెయ్యసాగింది.

                                                                                          సశేషం..

ప్రత్యుత్తరమిమ్ము

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.