“ఏమిటిది మాధవ్ ? వదలమంటుంటే..ఏంటిది,సిగ్గు లేకుండా?”
“చాతనైతే విడిపించుకో,ఎవరు వద్దన్నారు?”
“నిన్నూ..ఇలా కాదు” చెయ్యి కొరికేసి తప్పించుకుంది మిహిర.
“ఎక్కడికి వెళ్తావ్ నన్ను తప్పించుకుని? ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ నా దగ్గరికే వస్తావ్! భూమి గుండ్రంగా ఉంటుంది మిహిరా,ప్రేమ కూడా..” చిరు నవ్వు నవ్వాడు.
* * * * *
పడుతూ లేస్తూ టెలిస్కోప్ లో దేన్నో చూద్దామని తాపత్రయపడుతోంది మిహిర.
ఉదయాన్నే ఈ ఫీట్లు చూసి మిహిర తల మీద ఒక మొట్టికాయ వేసాడు మాధవ్,”ఏం జరుగుతోందిక్కడ?”
“కనిపించట్లేదూ,టెలిస్కోప్ లోంచి చూస్తున్నాను.డిస్టర్బ్ చెయ్యకూ.”
“నాతో ఫైటింగ్ చెయ్యకపోతే ఒక్క నిమిషం కూడా తోచదా నీకూ? ఐనా ఇంత పొద్దున్నే టెలిస్కోపులో కనిపించిన ఆ యాంటిక్ పీస్ ఏమిటో?” అడిగాడు.
“యాంటిక్ పీస్ కాదు,పాదరసం పీస్” రెట్టించింది మిహిర.
“ఊహూ..ఐ సీ! అడ్డుగా నిలబడి నువ్వొక్కదానివే ఎంత సేపు చూస్తావ్,జరుగు-నేను చూడొద్దా?” మిహిరని సుతారంగా పక్కకి నెట్టేసి టెలిస్కోప్ దగ్గర సెటిల్ అయ్యాడు.
“ఓయ్..ఎందుకలా తోసేస్తున్నావ్? టెలిస్కోప్ కావాలని అడుగుతే నేనే ఇచ్చేదాన్ని కదా!”
“మాధవ్ తనక్కావాల్సింది సొంతగా తీసుకుంటాడు,అడిగి తీసుకోడు.నువ్వేమిటి ఇచ్చేది?వెళ్ళవమ్మా..వెళ్ళూ!”
“ఓయబ్బో..కొయ్యి కొయ్యి 100 లారీల సొరకాయలు,పోజులకేం తక్కువ లేదు” రుస రుసలాడుతూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది మిహిర.
“ఉడుకుమోతు అమ్మాయి” టెలిస్కోప్ లోంచి పరిశీలనగా చూస్తూ అన్నాడు,”మెర్క్యురీ లానే!”
బుధుడు (మెర్క్యురీ)
బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం.
ఇది టెర్రెస్ట్రియల్ గ్రహాల కోవలోకి చెందుతుంది.అంటే భూమి వంటి నిర్మాణం కలిగి ఉంటుందనమాట.బుధుడి కేంద్రకంలో ద్రవీభవించిన ఇనుము (భూకేంద్రకంలో కూడా ద్రవీభవించిన ఇనుము) ఉండటాన్ని మనం గమనించవచ్చు.
ఐతే భూమి మీద ఉన్న టెలిస్కోపుల ద్వారా బుధుణ్ణి చూడటం అంత సులువైన విషయం కాదు ఎందుచేతనంటే ఇది సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల,పరిమాణంలో భూమికంటే చిన్నదవడం వల్లా సూర్య కాంతి ముందు బుధుడి కాంతి వెల వెలా పోతుంది! అందుచేత బుధుణ్ణి మామూలుగా పగటి పూట చూడలేం(ఒకవేళ సూర్యుని కిరణాలు పరావర్తనం చెంది బుధుణ్ణి ఆ కాంతిలో వీక్షించగలిగినప్పుడు మాత్రమే).
సాధారణంగా బుధుణ్ణి ఉదయతార గానూ(సూర్యోదయానికి కొన్ని నిమిషాల ముందు),సాయంతార గానూ(సూర్యాస్తమయ సమయానికి కొన్ని నిమిషాల తరువాత) చూడవచ్చు.
ఐతే చంద్రుణ్ణి చూసినంత సుళువుగా మనం బుధుణ్ణి గమనించలేము.ఇప్పటి వరకూ ఉన్న బుధుడి చిత్రాలు 1970 దశకంలో ప్రయోగించబడ్డ మారినర్-10 వ్యోమ నౌక తీసినవే కావడం గమనార్హం.ఐతే 2011 సంవత్సరంలో మెసెంజర్ వ్యోమ నౌక బుధుడి ఉపరితలాన్ని 80% వరకూ ఛాయా చిత్రాల రూపంలో చూపించింది.ఇంతవరకూ మనం చూడని బుధుడి రెండవ వైపు చిత్రాలను కూడా మెసెంజర్ నౌక సేకరించడం గమనించ దగ్గ విషయం.
బుధుడు 4880 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాడు (సుమారుగా 1/3 భూవ్యాసంతో సమానం).
బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 4500c వరకూ సమీపిస్తాయి.
ఆ వేడికి ఎలాంటి వస్తువైనా క్షణాల్లో బూడిదైపోవాల్సిందే!
సూర్యుడి ధాటికి బుధుడిలోని వాయువులన్నీ ఇగిరిపోవడం వల్ల,అక్కడ ఎలాంటి నీటి జాడలు లేకపోవడం వల్లా,బుధోపరితలం పొడిగా సిలికేట్ల రూపంలో ఉంటుంది.
భూమిని ఆవరించి ఉన్న వాతావరణం లాగా బుధుడి మీద అసలు వాతావరణమే ఉండదు.అందువల్ల రాత్రి పూట ఉష్ణోగ్రత ఒక్కసారిగా -170 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకూ పడిపోతుంది.అంటే చలికే వణుకు తెప్పించేంత చల్లదనం అనమాట!
బుధుడి ద్రవ్య రాశి 3.30 x 10 23. ద్రవ్యరాశి ప్రకారం చూస్తే 20 బుధ గ్రహాల్ని మన భూగోళంలో పట్టించవచ్చు.

బుధ మధ్య రేఖ(భూమధ్య రేఖ లాగే బుధుడి మీద అక్షాంశాలూ,రేఖాంశాలూ గుర్తిస్తే) దగ్గర నిలబడి నిటారుగా చూసినప్పుడు సూర్యుడు భూమి మీదకన్నా మూడు రెట్లు పెద్దగా కనిపిస్తాడు.
బుధుడి మీద ఒక రోజు భూమి మీద 58 రోజుల 16 గంటలతో సమానం.అలాగే బుధుడి మీద ఒక సంవత్సరం 88 రోజులు.
సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకీ అతి వేగంగా పరిభ్రమించే గ్రహంగా బుధుణ్ణి చెప్పుకోవచ్చు.
మొదట బుధుడు కూడా చంద్రుడిలాగే తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం తీసుకుంటాడో,అంతే సమయం సూర్యుడి చుట్టూ తిరగడానికి తీసుకుంటాడని భావించేవారు (58 రోజులు).
అంటే చంద్రుణ్ణి ఎప్పుడూ మనం ఒకే వైపు చూస్తాం,రెండో భాగం చూడలేం.అలాగే బుధుడు కూడా! అని శాస్త్రవేత్తలు భావించారు.కానీ మెసెంజర్ వ్యోమనౌక తీసిన చిత్రాల ద్వారా అది తప్పని ఋజువయింది.
బుధుడి మీద సూర్యోదయం,సూర్యాస్తమయం కూడా చిత్రంగా ఉంటాయి.
సూర్యోదయ సమయంలో సూర్యుడు మొదట కొద్దిగా ఉదయించి తరువాత మళ్ళీ అస్తమించి కాసేపటి తరువాత తిరిగి ఉదయిస్తాడు.అలాగే అస్తమించేప్పుడు ముందు కొద్దిగా అస్తమించి తరువాత కాసేపు మళ్ళీ ఉదయించి తరువాత అస్తమిస్తాడు.బుధుడు తన అక్షానికి 0.206 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.
చంద్రుడికీ,బుధుడికీ మధ్య ఎన్నో సామ్యాలున్నాయి.రెండిటి ఉపరితలాలూ సిలికేట్ల రూపంలోనే ఉన్నాయి.పరిమాణంలో కూడా దాదాపుగా కొద్ది తేడాలతో ఒకేలా ఉంటాయి.చంద్రుడి మీద లాగే బుధుడి మీద కూడా ఉల్కాశకలాల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
40 కోట్ల సంవత్సరాల క్రితం బుధుణ్ణి మీద ఒక ఉల్కా శకలం తాకడం కారణంగా ఏర్పడ్డ “కెలొరిస్ బేసిన్” వ్యాసం 1550 కిలోమీటర్లు ఉంటుంది.ఇదే బుధుడి మీద ఉల్కా శకలం తాకిడి వల్ల ఏర్పడ్ద అతి పెద్ద బిలం.
మెసెంజర్ వ్యోమ నౌక కెలోరిస్ బేసిన్ యొక్క అట్టడుగు భాగాన్ని తీసిన ఛాయా చిత్రాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.ఈ భాగం సాలీడు ఆకారంలో ఉండటాన్ని మనం గమనించవచ్చు.దీనికి శాస్త్రవేత్తలు “ద స్పైడర్” అని పేరు పెట్టారు.
ఇక బుధుడి గురించిన అతి పెద్ద విచిత్రం ఏమిటంటే బుధుడి కక్ష్య మిగతా అన్ని గ్రహాల కక్ష్యల్లా కాకుండా తన చుట్టూ తాను శతాబ్దానికి 55 నిమిషాల చొప్పున తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది.

భూమధ్య రేఖ,భూ కక్ష్యకు 0.01396డిగ్రీల కోణంలో ఉంటుంది.భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో అదే విధంగా భూకక్ష్య కూడా కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది.భూమధ్యరేఖ కక్ష్య ప్రతి 26 వేల సంవత్సరాలకి ఒక సారి సూర్యుణ్ణి చుట్టి వస్తుంది.
ఈ కక్ష్యా పరిభ్రమణం బుధుడికి కూడా వర్తింపజేస్తే (బుధ కక్ష్య కూడా భూకక్ష్య లాగా స్థిర కక్ష్య అనుకుంటే) బుధుడి కక్ష్య కూడా 26 వేల సంవత్సరాలకి ఒక సారి సూర్యుణ్ణి చుట్టి రావాలి.
ఈ 0.01396 డిగ్రీలని ఆర్క్ సెకన్ల కింద విభజిస్తే 5025 ఆర్క్ సెకన్ల కాలం అవుతుంది.కానీ విచిత్రంగా బుధుడి కక్ష్యా పరిభ్రమణ కాలం 5600 ఆర్క్ సెకన్లుగా గుర్తిచడం జరిగింది.
అంటే బుధుడి కక్ష్య స్థిరంగా లేదనమాట!
న్యూటన్ సిద్ధాంతాల్ని అనుసరించి సౌరకుటుంబంలోని గ్రహ కక్ష్యలన్నీ స్థిరమైనవి.అలాగే కెప్లర్ సిద్ధాంతాల ప్రకారం బుధుడి పరిభ్రమణం జరగడం లేదు! ఆ కాలం లోని కెప్లర్ సిద్ధాంతాలు న్యూటన్ గమన నియమాల మీద ఆధారపడి సూత్రీకరించబడ్డాయి.
ఈ సమస్యని న్యూటన్ గమన నియమాలేవీ వివరించలేకపోయాయి.తరువాత 1909 లో ఐన్ స్టీన్ రాసిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం ద్వారా ఈ సమస్య దాదాపుగా పరిష్కరింపబడింది.(ఐన్ స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం – జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ).
ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం మనకి తెలిసిందే.విశ్వం వంపు తిరిగి ఉన్న కారణంగా ఆ వంపులోకి ప్రవేశించిన కాంతి కూడా వంపు తిరిగి ప్రయాణిస్తుంది.
విశ్వంలో ఈ వంపు గురుత్వాకర్షణ కారణంగా కలుగుతుంది.
అంటే శూన్యంలో ఒక ద్రవ్య రాశి కలిగిన వస్తువు తన చుట్టూ ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని అది వంపు తిరిగేలా చేస్తుంది.ద్రవ్య రాశి ఉన్న వస్తువులన్నిటికీ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని మనకి తెలుసు కదా!
దీని ప్రకారం బుధుడికి కూడా గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టు అర్థమవుతుంది.ఐతే ఈ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో 0.38 శాతం మాత్రమే(ఎందుకంటే బుధుడు భూమి పరిమాణంలో కేవలం 1/3 వంతు మాత్రమే అని పైన చెప్పుకున్నాం.)
లాగ్రేంజ్,లాప్లేస్ నియమాలు తరువాతి కాలంలో కొంత ఆధునిక పద్ధతుల ద్వారా ఈ సమస్యని పరిష్కరించడానికి దోహదపడ్డాయి.ఐతే ఈ రెండు సిద్ధాంతాలనూ సైద్ధాంతికంగా ప్రయత్నించిన తరువాత 532 ఆర్క్ సెకండుల కాలాన్ని మాత్రమే ఇంతకు ముందున్న 5025 ఆర్క్ సెకన్ల కాలానికి జోడించగలిగారు.
అంటే బుధుడి కక్ష్యా పరిభ్రమణం 5025+532 = 5557 ఆర్క్ సెకండ్లు.
ఐతే ప్రయోగపూర్వకంగా కనుగొన్న 5600 ఆర్క్ సెకండుల కాలానికి ఇంకా 43 ఆర్క్ సెకండులు తక్కువ అవుతున్నాయి. సిద్ధాంతాల పరంగా కనుగొన్న దానికీ,వాస్తవ విలువకీ భేదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
ఇలాంటి సమస్యే యురేనస్ విషయంలో ఏర్పడినప్పుడు ఆ చుట్టు పక్కల ఉన్న మరొక గ్రహం కారణంగా యురేనస్ కక్ష్యా పరిభ్రమణంలో మార్పులు ఊహించి శాస్త్రవేత్తలు ప్లూటో గ్రహాన్ని కనుక్కోగలిగారు.అలాగే బుధుడి విషయంలోనూ వల్కన్ అనే మరొక గ్రహం సూర్యుడికీ,బుధుడికీ మధ్యగా ఉందని శాస్త్రజ్ఞులు వేసిన అంచనాలు తలకిందులైపోయాయి.అలాంటి గ్రహమేదీ లేదని స్పష్టంగా ఋజువైంది.
సౌరకుటుంబంలోని ద్రవ్యరాశిలో 99% సూర్యుడిలోనే నిక్షిప్తమై ఉందని మనకి తెలుసు కదా! అందువల్ల సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి చాలా బలమైనది.
బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా 4 కోట్ల 70 లక్షల కిలోమీటర్ల దూరంలోనూ,దూరంగా ఉన్నప్పుడు 7 కోట్ల కిలోమీటర్ల దూరంలోనూ పరిభ్రమిస్తూ ఉంటాడు.ఐతే బుధుడి కక్ష్య సూర్యుడి గురుత్వాకర్షణ కారణంగా వంపు తిరిగిన స్థల-కాలాల్లో ఉండటం వల్ల ఈ 43 సెకన్ల కక్ష్యా భ్రమణం జరుగుతోందని ఐన్ స్టీన్ సిద్ధాంతం సూత్రీకరించింది.
ప్రస్తుతం ఉన్న అన్ని సిద్ధాంతాల్లోనూ ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం చాలా సమస్యలకి సరైన సమాధానాలు సూచించిన కారణంగా ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుతానికి ఎవరూ ప్రశ్నించే ప్రయత్నం చేయలేకపోతున్నారు.
ఇతర సిద్ధాంతాలు కొన్ని సూర్యుడు బల్లపరుపుగా ఉన్నాడని సూత్రీకరిస్తున్నాయి.దాని వల్లే ఈ 43 సెకన్ల తేడా కలుగుతోందని అవి నిర్ధారించలేకపోవడం వల్ల ఈ సిద్ధాంతాల్ని బలహీనమైన సిద్ధాంతాలుగా పరిగణించడం జరుగుతోంది.
ఈ 43 సెకన్ల మిస్టరీని ప్రయోగ పూర్వకంగా ఇంతవరకూ శాస్త్రజ్ఞులు ఛేదించలేకపోయారు.
ఇన్ని వింతలూ విశేషాలతో కూడుకున్న బుధగ్రహానికి మరో వింత కూడా ఉంది! అదే బుధాయణం లేక బుధుని ట్రాన్సిట్.
బుధాయణం (బుధుని ట్రాన్సిట్)
బుధుడు సూర్యుడికీ,భూమికీ మధ్య ఉన్నప్పుడు మాత్రమే మనం బుధాయణాన్ని చూడగలం.
ఈ ప్రక్రియలో బుధుడు సూర్యబింబం మీద ఒక చివరి నించి మరొక చివరికి (ఎడమ నించి కుడికి లేదా పై నించి కిందికి) నల్లని చుక్క వలె తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
అంగారకుడు,బృహస్పతి,శని లాంటి మిగతా గ్రహాల నించి చూసినప్పుడు శుక్రుడు,భూమి కూడా ఇలాంటి ప్రక్రియని కనబరుస్తాయి.
భూమి నించి బుధుణ్ణి,శుక్రుణ్ణి వీక్షించడం వీలు పడుతుంది కాబట్టి బుధాయణాన్ని భూమి మీద ఉండే వారు గమనించవచ్చు.
బుధుడు మన సౌరకుటుంబంలోనే అత్యంత వేగంగా పరిభ్రమించే గ్రహం అని చెప్పుకున్నాం కదా! అందువల్ల ఒక శతాబ్ద కాలంలో బుధుడు 12 నించి 13 సార్లు తన బుధాయణాన్ని పూర్తి చేస్తాడు.శతాబ్ద కాలంలో మరే ఇతర గ్రహాల ట్రాన్సిట్ల కన్నా ఇదే ఎక్కువ.
———————————————————————————
మూడో రోజు సౌరయాన్-1 ప్రయాణం సజావుగానే జరిగింది.
దశల వారీగా నాలుగో రోజు చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెడుతుంది సౌరయాన్.చంద్రుడి ఆకర్షణ పరిధికి లోబడి ఒక సారి చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తిన్నగా చంద్రుడి మీద దిగుతుంది.
గ్రౌండ్ కంట్రోల్ దగ్గర అనుకున్న ప్రకారం నాలుగో రోజు ఉదయం కల్పనా క్యాప్స్యూల్ నియంత్రణ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు మాధవ్.
మూడు గంటల్లో సౌరయాన్-1 చంద్రుడి కక్ష్య చేరుతుందనగా..
అప్పుడు జరిగిందొక ప్రమాదకర సంఘటన.
* * * * *
ఆస్టరాయిడ్ బెల్ట్ లోంచి భూమి మీదకి దూసుకుని రాబోతున్న ఒక ఉల్కా శకలం గతి తప్పి చంద్రుడి వైపుకి దూసుకు రాసాగింది.
కల్పనా క్యాప్స్యూల్ మానిటర్ నించి చంద్రుడి కక్ష్యని పరిశీలిస్తున్న మాధవ్ చప్పున అలర్ట్ అయాడు.
ISRO గ్రౌండ్ కంట్రోల్ ని సంప్రదించాడు.
“గామా..గామా..రెడ్ అలర్ట్..దిస్ ఈజ్ మాధవ్ కమింగ్ ఇన్..ఓవర్”
“వాట్ హ్యాపెన్డ్ మై బాయ్?” ఇస్రో ఛైర్మన్ అడుగుతున్నారు.
“యన్ ఆస్టరాయిడ్ ఈజ్ అప్రోచింగ్ ద మూన్ సర్,కొలిజన్ ఈజ్ లైక్లీ టూ హ్యాపెన్.ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ సౌరయాన్ అండ్ కల్పనా క్యాప్స్యూల్ విల్ గెట్ సివియర్లీ డామేజ్డ్.కుడ్ యూ ప్లీజ్ చెక్ ద పొజిషన్ కో-ఆర్డినేట్స్? ఐ వుడ్ గెట్ ద స్పేస్ షిప్ బ్యాక్ టూ ఐ.యస్.యస్.వీ హ్యావ్ 3 అవర్స్ ఆఫ్ టైమ్ రిమెయినింగ్. అట్లీస్ట్ ఐ కెన్ అవాయిడ్ ద కొలిజన్ డ్యామేజ్ టూ 3/4th ఎక్స్టెంట్.”
“ష్యూర్ మై బోయ్!వాట్ ఎవర్ ఈజ్ ద పాజిబుల్ సొల్యూషన్,ప్లీజ్ గో విత్ ఇట్.ఐ నో దట్ యూ కెన్ హ్యాండిల్ సచ్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్.గో ఎహెడ్! వీ విల్ మానిటర్ ద కరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఆస్టరాయిడ్.విల్ అప్ డేట్ యూ షార్ట్ లీ.”
“కమాన్ గైస్,వీ హ్యావ్ యన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్.ఇమ్మీడియెట్లీ నీడ్ టూ మ్యాప్ ద డేటా ఫర్ యాన్ ఆస్టరాయిడ్.ఇట్స్ అప్రోచింగ్ మూన్.ఫాస్ట్,ఫాస్ట్! రేంజ్ ద ఇంపాక్ట్ ఏరియా అండ్ కొలిజన్ ఎఫెక్ట్..”
మరో పక్క గ్రౌండ్ కంట్రోల్ లోని తోటి శాస్త్రవేత్తలకి ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తూ ఉల్కా శకలం ప్రస్తుతం యే వైపుగా ఎంత వేగంతో కదులుతున్నదీ లెక్క కట్టమని పురమాయించారు.
“సర్,కొలిజన్ ఇంపాక్ట్ ఈజ్ వెరీ హై.దిస్ ఆస్టరాయిడ్ వజ్ లైక్ లీ టూ హిట్ ద ఎర్త్ బట్ హ్యాజ్ ఛేంజ్డ్ ఇట్స్ డైరెక్షన్ అండ్ హెడింగ్ టువర్డ్స్ ద మూన్. ఐ థింక్ 3 అవర్స్ విల్ బీ ద సఫిషియెంట్ టైమ్మ్ ఇఫ్ ద సౌరయాన్ ట్రావెల్స్ ఔట్ వార్డ్స్ ఇన్ నార్తర్న్ డైరెక్షన్ అరౌండ్ ద పోలార్ యాక్సిస్ ఆఫ్ ద మూన్.సౌరయాన్ నీడ్ టూ పికప్ ఎ స్పీడ్ ఆఫ్ 250-300 కిలోమీటర్స్ యన్ అవర్ టూ ఎస్కేప్ ద కొలిజన్ ఇంపాక్ట్.ఇంపాక్ట్ ఈజ్ లైక్లీ టూ స్ప్రెడ్ ఓవర్ 500 కిలోమీటర్స్ ఫ్రమ్ ద యాక్చువల్ ఇంపాక్ట్ సైట్!”
“ఓహ్..దట్ ఈజ్ హైలీ డిఫికల్ట్ సిట్యుయేషన్” తల పంకిస్తూ అన్నారు ఇస్రో చైర్మన్.
బీటా..బీటా..గ్రౌండ్ కంట్రోల్..సిగ్నల్ కమింగ్ ఇన్..
కల్పనా క్యాప్స్యూల్ లోని మానిటర్ బీప్ మనే శబ్దం చేస్తూ మోగింది.
“మాధవ్..ఉల్కా శకలం ఢీకొట్టాక ఆ చుట్టు పక్కల 500 కిలోమీటర్ల వరకూ ఇంపాక్ట్ ఉంటుందని మన వాళ్ళు అంచనా వేసారు మై బోయ్! సౌరయాన్ ని గంటకి 250-300 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉత్తర ధృవ కక్ష్య నించి బైటి వైపుగా తిప్పాల్సుంటుంది.నువ్వు చెయ్యగలవా ఈ సాహసం?”
“సౌర పవనం అనుకూలిస్తే చెయ్యగలననుకుంటాను” – చెప్పాడు అంత ప్రమాదకరస్థితిలోనూ తన ధైర్యాన్ని కోల్పోని మాధవ్.
“యే మాత్రం తేడా జరిగినా మీ ప్రాణాలకే ప్రమాదం!”
“తెలుసు సర్- ఇంపాక్ట్ వల్ల కూడా ప్రమాదమే కదా!!”
——————————————–
సౌరపవనం వీస్తున్న మార్గాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నించాడు మాధవ్.
ప్రయత్నిస్తే 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం సాధ్యమే.కానీ 3 గంటల పాటు సౌరపవనం ఆగకుండా వీస్తేనే తాము ఇంపాక్ట్ సైట్ నించి 750 కిలోమీటర్ల దూరం వెళ్ళడం వీలు పడుతుంది.అలా జరిగితే గానీ ఆ విస్ఫోటం నించి తప్పించుకోవడం సాధ్యం కాదు.
“లేదంటే సౌరయాన్ తో పాటు మేమిద్దరం కూడా…” ఒక్క నిట్టూర్పు విడిచాడు మాధవ్.
“మానవ ప్రయత్నం చెయ్యాలి-ఫలితం దైవానికి వదిలివెయ్యాలి” భగవద్గీతా సారం గుర్తించాడు.
“ఏమంటావు మిహిరా? ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా?”
పెల్లుబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ మాధవ్ ని గట్టిగా కౌగిలించుకుంది మిహిర.
“ఊ..ఇప్పుడు నేను అన్నిటికీ సిద్ధపడ్డాను” భారంగా వస్తున్నాయి మిహిర మాటలు.
“పిచ్చి పిల్లా..ఎందుకేడుస్తున్నావు? ప్రమాదాలు ఎక్కడైనా ఉంటాయి.ధైర్యవంతులు ఏడవరు.సాధించి చూపిస్తారు!!” ఓదార్చాడు.
“ఐ యామ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్” బాధని దిగమింగుతూ చెప్పింది.
***************************************************
కల్పనా క్యాప్స్యూల్ లోని మిషన్ కంట్రోల్ బోర్డ్ సహాయంతో సౌరయాన్ వేగం గంటకి 250 కిలోమీటర్లు చేరుకునేలా చెయ్యగలిగాడు మాధవ్.
సౌరపవనం అంత అనుకూలంగా లేదు,మరీ అంత ప్రతికూలంగా కూడా లేదు.మధ్యస్థంగా సౌరయాన్ దిశ మార్చడానికి సహాయ పడుతున్నట్టుగా ఉంది.కానీ మూడు గంటల పాటు అది సహకరిస్తుందో లేదో అంచనా వెయ్యడం మాధవ్ కి కొద్దిగా కష్టంగానే ఉంది.
ఏదేమైనా ఈ అపాయం నించి తప్పించుకునే ఉపాయం వెతికి తీరాలి కాబట్టి సౌరయాన్ దిశని చంద్రుడి ధృవ కక్ష్యకి ఉత్తరంగా సరి చేసాడు మాధవ్.
వింటిని సారించి వదిలిన బాణంలా రివ్వున ముందుకి దూసుకుపోయింది సౌరయాన్.
ఉల్కా శకలం గంటకి 1500 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు దూసుకొస్తూంది.
అది ప్రయాణిస్తున్న మార్గం యే కొద్దిగా మళ్ళినా సౌరయాన్ కి ముప్పు తప్పదు.జాగ్రత్తగా సౌరయాన్ ని మరొక ఆల్టిట్యూడ్ కిందకి దించాడు మాధవ్. ఒకవేళ ఉల్కా శకలం కక్ష్య మారినా దానితో ఢీకొట్టడానికి అవకాశం లేని కక్ష్యలోకి సౌరయాన్ ని తీసుకెళ్ళాలనేది మాధవ్ ఉద్దేశ్యం.
“మిహిరా,ఆస్టరాయిడ్ పొజిషన్ చెక్ చెయ్!”
“అలాగే..”, ఆమె ఉల్కా శకలం ప్రస్తుత స్థితిని అంచనా వెయ్యడానికి సిద్ధమైంది.
“ఆస్టరాయిడ్ ఆల్టిట్యూడ్ +795 కిలోమీటర్స్ ఫ్రమ్ GSA -” మానిటర్లో చెక్ చేస్తూ చెప్పింది.
“అంటే మనం ఇంకో 300 కిలోమీటర్లు కిందికి దిగాలనమాట! కానీ అప్పుడు చంద్రుడి ఆకర్షణ మన మీద పని చెయ్యదు,భూమి ఆకర్షణ ఎక్కువయిందంటే మళ్ళీ ISS కి తిరిగి చేరుకోవడం తప్ప మరో దారి లేదు” అన్నాడు మాధవ్.
“అదే చెయ్యాలనుకుంటున్నాం కదా! ఇంక దాని గురించి ఇంత ఆలోచన దేనికి?” అడిగింది మిహిర.
“నిజమే,కానీ ఒక సారి అక్కడి నించి ముందుకి కదలడమంటూ జరిగాక మళ్ళీ వెనక్కి తగ్గడం ఏమీ బాగోలేదు” అన్నాడు మాధవ్ సాలోచనగా.
“అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం,ISS తిరిగి వెళ్ళటం నీకిష్టం లేదా?”
అవునన్నట్టు తలపంకించాడు మాధవ్.”దీనికి ఇంకో సొల్యూషన్ ఉంది,అదేమిటంటే..” అర్థాంతరంగా ఆగిపోయాడు.
తనకి వచ్చిన ఆలోచనకి తనకి తానే ఒళ్ళు గగుర్పొడిచింది ఒక్క నిమిషం.”ఇది వింటే మిహిర నా దరిదాపుల్లోకి రావడానిక్కూడా భయపడుతుందేమో! వీడికి ఇంత పెద్ద క్రాక్ ఏంట్రా బాబూ,ఈ నట్ లూజ్ గాడితో వెళ్తున్నానా నేను అనుకుంటే?” అన్న సందేహం కూడా అదే నిమిషంలో కలిగింది మాధవ్ కి.
“ఏమిటి?” అని అడిగింది కుతూహలం ఆపుకోలేని మిహిర.
“ఏమీ లేదులే!” అన్నాడు.
“చెప్తావా? చెప్పవా?” పట్టు పట్టింది.
“చెప్తే భయపడ్తావ్”
“అందుకని నాకు చెప్పకుండా చేసేద్దామనేనా? ఇక్కడ క్యాప్స్యూల్ లో నేను కూడా ఉన్నాను,నువ్వుతీసుకునె డెసిషన్స్ కరెక్టో కాదో చెక్ చెయ్యాల్సిన అవసరం నాకే ఉంది” అంది మిహిర అతని మీద హక్కులన్నీ తనొక్కదానివే అన్నట్టు ఆరిందాలా.
“క్యాప్స్యూల్ కింద పడిపోయినా పర్లేదు,మహారాణి గారు మాత్రం గాల్లో తేలుతూ ఉండాలి.కింద పడ్డా కూడా పైచెయ్యి నాదే అంటావనమాట అయితే!కూలిపోయే క్యాప్స్యూల్లో చేరి కోల్డ్ వార్ చెయ్యడమంటే ఇదే!”
“కాదా మరి? మనం పడితే మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా లాగి పడెయ్యాలి.లేదంటే రేసులో వెనకాల ఐపోతాం” చెప్పింది టెక్కుగా.
“చూడటానికి వేలెడంత లేవు గానీ ఈ సోకులకేం తక్కువ లేదు” అన్నాడు మాధవ్.
“ప్లీజ్,చెప్పవా నువ్వేమనుకున్నావో? మా బుజ్జి కదా..ప్లీజ్!” గడ్డం పట్టుకుని అడిగింది గోముగా.
“ఆరడుగుల అందగాణ్ణి ఇలాగే నువ్వు బుట్టలో పడేస్తున్నావు.చెప్పమన్నావా? చెప్తే భయపడి పారిపోకూడదు మరి!”
“పారిపోనులే,చెప్పు”
“ఆస్టరాయిడ్ తాకేది సదరన్ హొరైజన్ దగ్గర కదా,మనమిప్పుడు డైరెక్షన్ రివర్స్ చేసి ఒక రైట్ కట్ ఇచ్చుకుని చంద్రుడికి తూర్పు వైపున ఉన్న క్రేటర్లో ఎందుకు దిగకూడదూ?”
“ఏమిటీ? నీకేమైనా పిచ్చా? అసలే ఇక్కడ ముందు నుయ్యి,వెనుక గొయ్యి అంటుంటే ఎటు పొయ్యినా వచ్చేది గొయ్యే కదా,అందులో ఇద్దరం కలిసి ఒకే సారి దూకుదాం అంటున్నావా! ఇంకా నయమే, పని చూస్కోవోయ్ – నేను బెంగుళూరులో ఉన్న మా ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను”
“ఆశ..అంత తొందరగా వెళ్ళిపోదామనే!”
“దోశా,వడా,అప్పడం కూడా..నాకు మా అమ్మ కావాలి.నేను వెళ్తున్నానంతే!”
వీళ్ళిలా సంభాషణలో ఉండగానే ఒక్క సారిగా పడమర వైపుకి బలంగా వీచిన సౌరపవనం సౌరయాన్ ని చూస్తుండగానే తనతో పాటు ఈవెంట్ హొరైజన్ లోకి తీసుకువెళ్ళింది.
కన్ను మూసి తెరిచేలోపు జరుగుతున్నదేమిటో అంతుబట్టలేదు వాళ్ళిద్దరికీ.
ఏదో ఒక సొరంగ మార్గంలోంచి స్వేచ్ఛా స్థితిలో కిందికి పడిపోతున్నట్టుగా అనిపించసాగింది.
అలా ఆ సొరంగ మార్గంలో ఎంత సేపు ప్రయాణించారో తెలియదు.కల్పనా క్యాప్స్యూల్ లో ఉన్న మిషన్ కంట్రోల్స్ అన్నీ పని చెయ్యడం మానేసినట్టుగా అనిపించింది వాళ్ళిద్దరికీ.
“రెడ్ అలర్ట్..రెడ్ అలర్ట్..” ఇస్రో గ్రౌండ్ కంట్రోల్ లోని IVR సిస్టమ్ పదేపదే హెచ్చరించసాగింది.
“రెడ్ అలర్ట్..రెడ్ అలర్ట్..సౌరయాన్ మిస్సింగ్ ఫ్రమ్ ద విజన్!”
“ఓహ్..ఏమిటిది?” ఉన్నట్టుండి ఏం జరిగిందో అంతుబట్టని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుని కూర్చున్నారు.
(ఇంకా ఉంది..)






